Mawsynram: అత్యధిక వర్షపాత ప్రాంతం మాసిన్రాం.. ఈ విశిష్టతలు తెలుసా?

‘తొమ్మిది రాత్రుళ్లు.. తొమ్మిది పగళ్లు’.. మేఘాలయలోని ‘మాసిన్రాం’ ప్రజలు వర్షాకాలం తీవ్రత గురించి చెప్పే మాట ఇది. దీన్నిబట్టి.. అక్కడ వర్షాల జోరు అర్థం చేసుకోవచ్చు! అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఎక్కడంటే...

Updated : 24 Jun 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘తొమ్మిది రాత్రుళ్లు.. తొమ్మిది పగళ్లు’.. మేఘాలయలోని ‘మాసిన్రాం’ ప్రజలు వర్షాకాలం తీవ్రత గురించి చెప్పే మాట ఇది. దీన్ని బట్టి.. అక్కడ వర్షాల జోరు అర్థం చేసుకోవచ్చు! అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఎక్కడంటే సాధారణంగా ముందుగా గుర్తొచ్చేది చిరపుంజి. కానీ.. వాస్తవానికి, ఈ రికార్డు పొరుగునే ఉన్న మాసిన్రాం పేరిట ఉంటుంది. ఇక్కడి వార్షిక సగటు వర్షపాతం దాదాపు 11,871 మి.మీ. తూర్పు ఖాసీ కొండల్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం.. ప్రపంచంలోనే అత్యధిక తేమగల ప్రాంతంగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌’లో చోటుదక్కించుకుంది. బంగాళాఖాతం నుంచి వీచే గాలుల కారణంగా ఇక్కడ తేమ అధికం. 1985లో ఇక్కడ అత్యధికంగా 26 వేల మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైంది. ఇదీ గిన్నిస్ రికార్డులకెక్కింది.

రికార్డు స్థాయి వర్షపాతం..

చిరపుంజికి 15 కి.మీ దూరంలో ఉన్న మాసిన్రాం.. ఇటీవల వర్షపాతంలో సరికొత్త రికార్డు నెలకొల్పి మరోసారి వార్తల్లోకెక్కింది. జూన్‌ 16న ఇక్కడ 24 గంటల వ్యవధిలో ఏకంగా 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఒక్క రోజులోనే.. ఏడాది సగటు వర్షపాతంలో 10 శాతం వరకు కురిసింది. దీంతో.. గతంలో ఇక్కడ 1966లో నమోదైన 945.4 మిల్లీమీటర్ల రికార్డును అధిగమించినట్లయింది.

జీవన విధానం భిన్నం..

మాసిన్రాం జనాభా దాదాపు 4 వేలు. తరచూ వర్షాలు పలకరిస్తూ ఉండటంతో.. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ తేమగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక్కడి ప్రజల జీవన శైలి భిన్నంగా ఉంటుంది. వస్త్రధారణ మొదలు.. ఆహారం, పనులు ఇవన్నీ వేరుగా ఉంటాయి.

* స్థానికులు ఎల్లవేళలా ‘నప్’గా పిలుచుకునే వెదురుతో చేసిన సంప్రదాయ గొడుగులను వెంట ఉంచుకుంటారు. దుస్తులను బయట ఆరేసేందుకు వీలుండదు. కాబట్టి.. వాటిని మెటల్ డ్రైయర్‌లలో ఉంచుతారు. ఇళ్లలో హీటర్‌లు ఉంటాయి. నిత్యం వర్షంతో ఇళ్లలోకీ పొగమంచు ప్రవేశిస్తుంది. ఫలితంగా గోడలు, వస్తువులు.. అన్ని తేమగా ఉంటాయి.

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా.. వ్యవసాయం చేసే అవకాశం దాదాపు ఉండదు. స్థానికులు చిన్నచిన్న వ్యాపారాలకు ప్రాధాన్యం ఇస్తారు. కావాల్సిన కూరగాయలు, నిత్యవసరాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిందే. వాటిని ప్లాస్టిక్‌ సంచుల్లో చుట్టి విక్రయిస్తుంటారు.

ఏటా మే నెల నుంచి అక్టోబరు వరకు భారీ వర్షాలు నమోదవుతాయి. కుండపోత కారణంగా ఆ సమయంలో వారాలపాటు సూర్యుడు కనిపించడు! దీంతో ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం అవుతారు. ఆ సమయంలో ఉడికించిన బంగాళాదుంపలను ఎండు చేపలు, మిరపకాయలు టమాటాలతో చేసిన చట్నీ(టుంగ్‌టాప్‌)తో తినడానికి ఆసక్తి చూపుతారు.

అధిక వర్షపాతం కారణంగా ఇక్కడి రోడ్లు తరచూ దెబ్బతింటాయి.అందుకే, వాటి మరమ్మతులకే ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. వంతెనలదీ అదే దుస్థితి. కొన్ని చోట్ల రబ్బరు, వెదురుతో చిన్నపాటి బ్రిడ్జిలు నిర్మిస్తుంటారు. నీళ్లతో త్వరగా పాడవని గుణం, ఎక్కువ బరువును తట్టుకునే సామర్థ్యం వాటి సొంతం.

మాసిన్రాం.. సహజసిద్ధ అందాలకూ ప్రసిద్ధి. దీంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి బారులు తీరుతుంటారు! ఇక్కడి జలపాతాలు, పొగమంచు, దట్టమైన మేఘాలు ఆకట్టుకుంటాయి. మాసిన్రాం సమీపంలో సహజసిద్ధంగా ఏర్పడిన మాజిమ్‌బ్యూయిన్‌ గుహలు ప్రత్యేక ఆకర్షణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని