Flipkart: నాణ్యత లేని కుక్కర్ల విక్రయం.. ఫ్లిప్‌కార్ట్‌కు ₹లక్ష జరిమానా

నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను తన వేదిక ద్వారా విక్రయించినందుకు గానూ ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు  CCPA జరిమానా విధించింది.

Published : 17 Aug 2022 17:04 IST

దిల్లీ: నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను తన వేదిక ద్వారా విక్రయించినందుకు గానూ ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికారిక సంస్థ (CCPA) జరిమానా విధించింది. లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆ కుక్కర్లను కొనుగోలు చేసిన 598 మంది నుంచీ వాటిని వెనక్కి తీసుకుని డబ్బులు తిరిగివ్వాలని సూచించింది. 45 రోజుల్లో నిబంధనలు పాటించడంపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

2021 నుంచి ‘IS 2347:2017’ ప్రమాణాలు కలిగిన కుక్కర్లను మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. అందుకు విరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్‌ వీటిని విక్రయించినట్లు సీసీపీఏ పేర్కొంది. ఈ కుక్కర్లను విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,84,263 ఫ్లిప్‌కార్ట్‌ పొందిందని తెలిపింది. ఇదే కారణంతో కొద్ది రోజుల క్రితం అమెజాన్‌కు సైతం సీసీపీఏ లక్ష రూపాయలు జరిమానాగా విధించింది. అమెజాన్‌ ద్వారా కుక్కర్‌లను కొనుగోలు చేసిన 2,265 మంది వినియోగదారుల నుంచి వాటిని వెనక్కి తీసుకుని, వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. మరోవైపు నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు సీసీపీఏ సిద్ధమైంది. హెల్మెట్లు, ప్రెజర్‌ కుక్కర్లు, గ్యాస్‌ సిలిండర్ల కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేశవ్యాప్తంగా వినియోగదారులకు అవగాహన కల్పించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని