close


సినిమా

సై-ఫైకి... సై!

‘ఆదిత్య 369’ తర్వాత తెలుగులో నేరుగా సైన్స్‌-ఫిక్షన్‌ సినిమాలు రావడానికి దాదాపు ఇరవై ఆరేళ్లు పట్టింది!  గత ఏడాది నుంచి ఆ తరహా కథలవైపు మొగ్గి వినూత్నమైన సినిమాలతో ముందుకు వస్తున్నారు టాలీవుడ్‌  దర్శకులు. ఆ ‘జానర్‌’లో ఇప్పటికే వచ్చినవాటితోపాటూ, ఇకపై రాబోతున్నవేమిటో ఓ సారి చూద్దామా... 
అ!: శంకర్‌, విక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అపరిచితుడు’ సినిమా ‘మల్టీ  పర్సనాలిటీ డిజార్డర్‌’ సమస్య ఆధారంగా తీశారు. శంకర్‌ దాన్ని రెండు పాత్రలకే  పరిమితం చేశాడు. పైగా ఆ రెండింటినీ  ఒకే నటుడితో చేయించాడు. కానీ తెలుగు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన ‘అ!’ సినిమాని తొమ్మిది పాత్రలతో మలచాడు. ఆ తొమ్మిదో పాత్ర మనసులోని విభిన్న వ్యక్తులే మిగతా ఎనిమిది మంది అన్నమాట! ప్రారంభం నుంచి ఆ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా ఎనిమిది పాత్రలని విభిన్న వాతావరణంలో చూపించి క్లైమాక్స్‌లో ప్రేక్షకుల చేత ‘ఆహా!’ అనిపించాడు దర్శకుడు. 

శ్రీవల్లి : ‘బాహుబలి’ సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్‌ నుంచి వచ్చిన సూడో సైన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ‘బ్రెయిన్‌ మ్యాపింగ్‌’ చేసి... ఎదుటి మనిషి మెదడులోని ‘మదర్‌ వేవ్‌’ని నియంత్రించడం ద్వారా అతని ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేయొచ్చా? ఆ శక్తి మనకి వస్తే పూర్వ జన్మ జ్ఞాపకాలూ వస్తాయా?’ అన్న ప్రశ్నలే ఈ కథకి మూలం. కానీ కథ రాసుకున్నంత చక్కగా ఆ విషయాలని తెరపైన చూపలేకపోవడంతో సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. 
కల వరం ఆయె : 2016లో వచ్చిన సినిమా ఇది. నిద్రలో మాట్లాడే అలవాటున్న హీరో నిద్రలోనే దర్శకుడొకడికి అద్భుతమైన కథ చెబుతాడు! కానీ క్లైమాక్స్‌ మరచిపోతాడు. ఆ క్లైమాక్స్‌ చెబితేకానీ ఆ దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం రాదు. అందుకోసం అదే కలని మళ్లీ తెప్పించుకునే ప్రయత్నంలో పడతాడు. ఇందుకోసం ఓ సైకియాట్రిస్టు సాయపడతాడు. సంపత్‌ వి.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటిదాకా పుస్తకాలకే పరిమితమైన కలల శాస్త్రీయ విశ్లేషణలని చాకచక్యంగా వెండితెరపైకి తీసుకురాగలిగింది! 

టాక్సీవాలా : 1980లలో నవలలుగానూ, 1990లలో టీవీ సీరియళ్లుగానూ వచ్చిన యండమూరి వీరేంద్రనాథ్‌ తరహా సూడోసైంటిఫిక్‌ హారర్‌ శైలి కథ ఇది! శరీరం నుంచి ఆత్మని వెలికితీసి చూసే ‘ఆస్ట్రల్‌ ప్రొజెక్షన్‌’ అనే అభూత కల్పనా వాదం దీనికి మూలం. ‘ఇది హారర్‌ సినిమానే కానీ ఇందులో కనిపించేది దెయ్యం కాదు... శాస్త్రపరిశోధనలో భాగంగా శరీరం నుంచి బయటకొచ్చిన ఆత్మ’ అని ప్రేక్షకులని ఒప్పించడంలో దర్శకుడు విజయం సాధించాడు. 
అంతరిక్షం 9000 కేఎంపీహెచ్‌ : అంతరిక్ష యాత్ర ఆధారంగా వస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ‘ఘాజీ’తో గత ఏడాది తెలుగుకి జాతీయ అవార్డు సాధించిపెట్టిన సంకల్ప్‌రెడ్డి దర్శకుడు. వరుణ్‌ తేజ్‌ హీరో. సహజత్వానికి దగ్గరగా ఉండేలా బల్గేరియా దేశంలో ‘జీరో గ్రావిటీ’ వాతావరణాన్ని కల్పించి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 21న విడుదలవుతుంది. 
ఆదిత్య 999 : తెలుగు సినిమా తెరకి తొలిసారి సైన్స్‌ ఫిక్షన్‌ని పరిచయం చేసిన ‘ఆదిత్య 369’కి ఇది సీక్వెల్‌. నాలుగేళ్లకిందటే ఈ సినిమాకి సంబంధించిన ‘స్టోరీ బోర్డు’ సిద్ధమైపోయిందని చెబుతున్నారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. మొదటి భాగంలో నటించిన బాలకృష్ణే ఇందులోనూ హీరో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు