close


రుచి-అభిరుచి

చేపలకూర తింటున్నారా..!

చేప ఇగురు

కావలసినవి 
చేపముక్కలు: అరకిలో, ఉల్లిపాయలు: నాలుగు, పచ్చిమిర్చి: ఆరు, కారం: 2 టీస్పూన్లు, జీలకర్రపొడి: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, పసుపు: టీస్పూను, టొమాటో: రెండు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: అరకప్పు, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం 
ముందుగా చేపముక్కల్ని కడిగి వాటికి అరటీస్పూను చొప్పున పసుపు, ఉప్పు, కారం పట్టించి అరగంటసేపు నాననివ్వాలి. తరవాత కాగిన నూనెలో ముక్కల్ని వేయించి తీయాలి. 
అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, జీలకర్రపొడి, దనియాలపొడి, అల్లంవెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తరవాత టొమాటోముక్కలు, ఉప్పు వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. వేయించిన చేపముక్కలు వేసి సుమారు పది నిమిషాలపాటు దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే సరి.

మసాలా ఫ్రైడ్‌ ఫిష్‌

కావలసినవి 
చేపముక్కలు: అరకిలో, పసుపు: కొద్దిగా, నిమ్మరసం: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, దనియాలు: 2 టీస్పూన్లు, లవంగాలు: నాలుగు, ఎండుమిర్చి: నాలుగు, అల్లం: రెండు అంగుళాలముక్క, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, చింతపండుగుజ్జు: టీస్పూను, బొంబాయిరవ్వ లేదా బ్రెడ్‌పొడి: అరకప్పు, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం 
ముల్లులేని చేపముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, నిమ్మరసం పట్టించాలి. జీలకర్ర, దనియాలు, లవంగాలు వేయించి తీయాలి. మిక్సీలో ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, వేయించిన మసాలా దినుసులు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు దీన్ని  
చేపముక్కలకు పట్టించి పావుగంటసేపు నాననివ్వాలి. ఈ ముక్కల్ని బొంబాయిరవ్వ లేదా బ్రెడ్‌పొడిలో దొర్లించాలి. బాణలిలో నూనె వేసి కాగాక చేపముక్కలను వేసి వేయించి తీయాలి.

చేపల వేపుడు

కావలసినవి 
చేపముక్కలు: అరకిలో, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, ఉల్లిపాయముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: అరటీస్పూను, కారం: టీస్పూను, పసుపు: అరటీస్పూను, నిమ్మరసం: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా, మసాలాకోసం: కారం: అరటీస్పూను పసుపు: పావుటీస్పూను, బియ్యప్పిండి: 2 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌: 2 టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి: టీస్పూను, జీలకర్రపొడి: టీస్పూను, నిమ్మరసం: టీస్పూను

తయారుచేసే విధానం 
ముందుగా మసాలాకోసం తీసుకున్నవన్నీ బాగా కలిపి ముక్కలకు పట్టించి ఓ గంటసేపు ఉంచాలి.  
తరవాత బాణలిలో నూనె వేసి ముక్కలు వేయించి తీయాలి. ఇప్పుడు ఎక్కువగా ఉన్న నూనె అంతా వంపేసి ఓ రెండు టీస్పూన్లు ఉంచి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత దనియాలపొడి, కారం, పసుపు వేసి బాగా కలిపి చేపముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికించి చివరగా నిమ్మరసం చల్లి అందించాలి.

చేప-కొబ్బరికూర

కావలసినవి 
చేపముక్కలు: అరకిలో, టొమాటోలు: రెండు, ఉల్లిపాయలు: నాలుగు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: కప్పు, చింతపండుగుజ్జు: 2 టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపాలు: కప్పు, వెల్లుల్లిరెబ్బలు: ఎనిమిది, కొబ్బరి తురుము: 2 కప్పులు, జీలకర్ర: 2 టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, మెంతులు: చిటికెడు, దనియాలు: 3 టీస్పూన్లు, మిరియాలు: టీస్పూను, ఎండుమిర్చి: నాలుగు, కరివేపాకు: నాలుగు రెబ్బలు

తయారుచేసే విధానం 
బాణలిలో మెంతులు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, దనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి తీయాలి. తరవాత టీస్పూను నూనె వేసి కాగాక సగం ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వెల్లుల్లి, కొబ్బరి తురుము కూడా వేసి ఓ నిమిషం వేగనిచ్చి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటికీ తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బాలి.  
మసాలా దినుసులు వేయించిన బాణలిలోనే మిగిలిన నూనె వేసి కాగాక మిగిలిన ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి వేగాక, రుబ్బిన మసాలా వేసి నూనె బయటకు వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసి పది నిమిషాలపాటు ముక్కలను వేగనివ్వాలి. తరవాత చింతపండు గుజ్జు, ఉప్పు, కొబ్బరిపాలు పోసి బాగా కలిపి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించేముందు కొత్తిమీర తురుము చల్లాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు