close


పరిశోధన

తేయాకు క్యాన్సర్‌కీ మందే!

 

తేయాకులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువనీ అందుకే గ్రీన్‌ టీ ఆరోగ్యానికి మంచిదనీ మనకు తెలిసిందే. అయితే వాటితోపాటు ఉండే పాలీఫినాల్స్‌, అమైనో ఆమ్లాలు, విటమిన్ల కారణంగా ఈ ఆకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను 80 శాతం నివారిస్తుందని లండన్‌కి చెందిన స్వాన్‌సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వాళ్లు ఆ ఆకుల్లోని ఔషధాలను నానోపార్టికల్స్‌ రూపంలో సేకరించి క్యాన్సర్‌కణాల మీద ప్రయోగించి చూడగా అవన్నీ దాదాపు చనిపోయాయట. పైగా ఇతర క్యాన్సర్‌ మందులతో పోలిస్తే తేయాకు నుంచి సేకరించిన పదార్థాల వల్ల ఎలాంటి దుష్ఫలితాలూ తలెత్తవని కూడా తేలింది. ఇతర రసాయన పదార్థాలతో పోలిస్తే దీనికయ్యే ఖర్చూ తక్కువ. కాబట్టి త్వరలో తేయాకును క్యాన్సర్‌ మందుగా రూపొందించేందుకు సదరు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.


ప్లేట్‌లెట్స్‌ పెరగాలంటే...!

 

విషపూరిత వైరల్‌ జ్వరాలు ముఖ్యంగా డెంగీ వంటి వాటి కారణంగా చాలామందిలో ప్లేట్స్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడం, చావు అంచులవరకూ వెళ్లడం వింటూనే ఉన్నాం. కారణాలేమయినా కొందరిలో వీటి సంఖ్య తక్కువగా ఉండటంతో రోగనిరోధకశక్తి తగ్గిపోతోంది. అలా పడిపోకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలని సూచిస్తున్నారు పోషక నిపుణులు. 
* ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తక్కువగా ఉన్నవాళ్లకి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. పండుతోబాటు ఆకుల్ని మరిగించి ఆ నీటిని రోజుకి రెండుసార్లు తాగడం వల్ల వాటి సంఖ్య పెరిగినట్లు మలేషియాలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. 
* క్లోరోఫిల్‌ ఎక్కువగా ఉండే గోధుమగడ్డి వల్ల ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరిగినట్లు తేలింది. ఇందుకోసం ఓ అరకప్పు గోధుమగడ్డి రసంలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి రోజూ తాగితే ఫలితం ఉంటుంది.

 

* దానిమ్మగింజల్లోని యాంటీఆక్సిడెంట్లూ ప్లేట్‌లెట్స్‌ వృద్ధి కారకాలే. ఫలితంగా రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. అలాగే విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే చేపనూనె క్యాప్సూల్స్‌తోబాటు గుమ్మడి రసంవల్ల కూడా ఫలితం ఉంటుంది. వీటన్నిటితోబాటు విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఇతరత్రా పండ్లూ కూరగాయలూ ఆకుకూరలూ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. 
* విటమిన్‌-బి12 ఎక్కువగా ఉండే పాలు, ఉడికించిన గుడ్ల వల్ల కూడా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య బాగా పెరుగుతుంది. విటమిన్‌-కె ఎక్కువగా ఉండే బ్రస్సెల్‌ స్ప్రౌట్స్‌ కూడా ప్లేట్‌లెట్స్‌ వృద్ధికి ఎంతో మేలు.


బ్లాక్‌హెడ్స్‌ బాధిస్తున్నాయా?

 

బ్లాక్‌హెడ్స్‌ చాలామందిని తెగ చికాకు పెడుతుంటాయి. ఇవి ముక్కు, చుబుకం, వీపు, భుజాలమీద కూడా వస్తుంటాయి. స్వేదగ్రంథుల నుంచి నూనె అధికంగా ఉత్పత్తి కావడం, శరీరంమీద బ్యాక్టీరియా చేరడం వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. వీటిని చాలామంది గిల్లుతూ ఉంటారు. దాంతో సమస్య మరింత పెరుగుతుంది. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా వాటిని నివారించవచ్చు. అవేమంటే...గుడ్డు తెల్లసొనతో ఈ సమస్యను  తొలగించుకోవచ్చు. ఇందుకోసం రెండు గుడ్ల తెల్లసొనల్ని తీసుకుని, అందులో రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని వాటిమీద పూసి ఆరనివ్వాలి. మళ్లీ పూయాలి. ఆరాక మళ్లీ మూడోసారి పూయాలి. ఇలా నాలుగైదు సార్లు రాసి బాగా ఆరాక ఆ పొరల్ని వేళ్లతో లాగేస్తే ఆ పొరతోబాటు బ్లాక్‌హెడ్స్‌ కూడా వచ్చేస్తాయి. 
* అరటీస్పూను నిమ్మరసంలో అరటీస్పూను తేనె కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌మీద పూసి సుమారు పావుగంట ఉంచి, గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి నాలుగైదుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. తేనెలోని 
యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలవల్ల బ్లాక్‌హెడ్స్‌కి కారణమైన బ్యాక్టీరియా పోతుంది. పైగా ఈ రెండింటి సమ్మేళనం ఆస్ట్రిజెంట్‌లానూ పనిచేస్తుంది. 
* టీస్పూను ఉప్పులో టీస్పూను తెల్ల టూత్‌పేస్టు వేసి బాగా కలిపి ముక్కుమీద పట్టించి ఆరనివ్వాలి. ఎండిపోయాక వేళ్లను తడిచేసుకుని మర్దన చేసినట్లుగా మృదువుగా ఆ పేస్టుని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినా ఫలితం ఉంటుంది. ఇందులోని ఆస్ట్రిజెంట్‌ గుణాలవల్ల చర్మరంధ్రాలు తెరచుకుని, బ్యాక్టీరియాని నివారిస్తాయి. ఇక, ఆవిరి పట్టడం వల్ల కూడా చాలావరకూ సమస్య తగ్గుతుంది.


టూకీగా...

డి-విటమిన్‌ శరీరంలోని కండరాలూ ఎముకల దృఢత్వానికి తోడ్పడటంతోబాటు కొన్ని రకాల క్యాన్సర్లనీ అరికడుతుందన్నది తెలిసిందే. ఇది గుండె కణజాలానికీ ఎంతో మంచిది అంటున్నారు ఆస్ట్రేలియాకి చెందిన నిపుణులు. ఒకసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చినవాళ్లు క్రమం తప్పక డి-విటమిన్‌ తీసుకోవడంవల్ల హృద్రోగ మరణాల సంఖ్యని బాగా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.
* చిన్నతనంలో వచ్చే ఊబకాయంవల్ల పెద్దయ్యాక కాలేయ వ్యాధులూ మధుమేహం వచ్చే అవకాశం ఉందని టెక్సాస్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు