close


సినిమా

తొలిసారి కామెడీ చేశా..!

ఆకాంక్షాసింగ్‌... నాగార్జున-నానీల ‘దేవదాస్‌’లో జాహ్నవిగా ‘ఆహా’ అనిపించింది. నాగ్‌కి జోడిగా మంచి మార్కులే కొట్టేసింది. కామెడీ పండించడం పది చిత్రాల పెట్టు అంటారు. తెలుగులో తన రెండో సినిమాతోనే దాన్ని సునాయాసంగా సాధించిన ఆకాంక్షకి సంబంధించిన ఆసక్తికరమైన సంగతులివి...

పెళ్ళయ్యాకే తెరపైకి...

సినిమా రంగానికి సంబంధించి మనలో కొన్ని స్టీరియో టైపు ఆలోచనలుంటాయి. అమ్మాయిలు పెళ్లైయ్యాక ఇందులోకి రాలేరని... వచ్చినా కథానాయికగా రాణించలేరనీ... ఇలా! ఆకాంక్షకి అవేవీ వర్తించవు. నాలుగేళ్ల కిందట, తన చిరకాల మిత్రుడు కునాల్‌ సేన్‌ని పెళ్లి చేసుకుందామె. ఆయనది మార్కెటింగ్‌ రంగం. ఆయన ప్రోత్సాహంతోనే హిందీ చిత్రం ‘బద్రినాథ్‌కి దుల్హనియా’లో ఆలీయాభట్‌కి స్నేహితురాలిగా తెరంగేట్రం చేసింది.

రంగస్థలం నుంచే...

ఆకాంక్షది జైపూర్‌. తల్లి అక్కడ పేరున్న రంగస్థల నటి. అక్కయ్య కూడా అదేరంగంలోకి వెళ్లినా ఆకాంక్షకేమో... డ్యాన్సులపైనే మోజుండేది. అన్నిరకాల నృత్యాలూ నేర్చుకుంది. అనుకోకుండా ఓ రోజు రంగస్థలంలో నటించాల్సి రావడం... అది చూసి ఓ టీవీ సీరియల్‌ నిర్మాణ సంస్థవాళ్లు పిలవడంతో ఆకాంక్ష జీవితం మారిపోయింది.

మౌనమేలనోయి...

‘మళ్లీ రావా...’ సినిమాలో నటించకముందే ఆకాంక్ష తెలుగు టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె నటించిన హిందీ సీరియల్‌ ‘నా బోలే తుమ్‌ నా మైనే కుచ్‌ కహా’ తెలుగులో ‘మౌనమేలనోయి...’గా డబ్‌ అయి రెండేళ్లపాటు ప్రసారమైంది. ఆ సీరియల్‌ ప్రారంభించినప్పుడు ఆకాంక్ష వయసు 21 ఏళ్లు. ఇద్దరు చిన్నపిల్లలున్న ముప్పైయేళ్ల వితంతు కథానాయిక పాత్రని చేసి శభాష్‌ అనిపించింది.

నాగార్జున ప్రశంస...

‘మళ్లీ రావా...’ తర్వాత నాగార్జునగారి సినిమా అనగానే నాకు నోటమాటరాలేదు. ఆయన మాత్రం స్పాట్‌లో చాలా కూల్‌గా నాకు తెలుగు పదాలు ఎలా పలకాలో నేర్పించారు. ‘పదాలు రాకున్నా చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా చేస్తున్నావ్‌!’ అని మెచ్చుకున్నారు. ఆ ప్రశంస కన్నా ఆడియో రిలీజప్పుడు ‘చాలాకాలం తర్వాత ఆకాంక్ష రూపంలో ఓ అందమైన అమ్మాయిని నా కోసం తెచ్చారు’ అని వేదికపై కితాబిచ్చి నవ్వించారు..’ అని హాయిగా గుర్తుచేసుకుంటుంది ఆకాంక్ష.

ఫిజియోథెరపిస్టు...

ఆకాంక్షలో నటి మాత్రమే కాదు... మంచి గాయని కూడా ఉంది. ‘మళ్లీ రావా...’ సినిమా ప్రీరిలీజప్పుడు ‘తెలిసి తెలిసి వేకువ..’ పాటని అనుభవమున్న గాయనిలా పాడి చుట్టుపక్కలున్నవాళ్లని ఫిదా చేసేసింది. సినిమా పాటలే కాకుండా సొంతంగా కొన్ని ఆల్బమ్‌లూ చేసింది. వీటన్నింటితోపాటూ తను ఫిజయోథెరపిస్టు కూడా! ఆ కోర్సులో ‘రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం’ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.

గుర్రపు స్వారీ...

‘సినిమాల్లోకి వచ్చాక నేను కొత్తగా రెండు విషయాలు నేర్చుకున్నా. మొదటిది... గుర్రపుస్వారీ. ఎప్పటికైనా యుద్ధం నేర్చిన యువరాణి పాత్రని చేయాలన్నది నా కల. అందుకోసమే స్వారీ నేర్చుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు బాగా పట్టుసాధించేశా. రెండో విషయం... కామెడీ చేయడం. ఇదివరకు కాస్త ముక్తసరిగా మాట్లాడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఎదుటివాళ్లని నవ్వించడం మొదలుపెట్టా.‘దేవదాస్‌’లో అది బాగా ఉపయోగపడింది..’ అంటోందీ ముద్దుగుమ్మ.

ప్రతిరోజూ ఓ ‘వాలెంటైన్స్‌ డే’...

‘ఇంటర్‌ చదివేటప్పుడే కునాల్‌ నాకు పరిచయమయ్యాడు. ఆ ఏడాది వాలెంటైన్స్‌ డే రోజు ప్రపోజ్‌ చేశాడు. అప్పటికి ఒప్పుకోలేదు కానీ... తర్వాతి వాలెంటైన్స్‌ డే రోజూ అడిగేటప్పటికి కాదనలేకపోయా. పదేళ్లపాటు ప్రేమికులుగా.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. పెద్దల్ని ఒప్పించి నాలుగేళ్లకిందట పెళ్లి చేసుకున్నాం. మా పనుల వల్ల ఒకరికొకరం దూరంగా ఉండాల్సి వస్తున్నా, ప్రతిరోజూ వాలెంటైన్స్‌ డే అన్నట్లుగానే గడుస్తోంది ఇద్దరికీ’ అని నవ్వేస్తుంది ఆకాంక్ష.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు