close


సమీక్ష

విలక్షణ శైలి

 

కన్నడ రచయిత వసుధేంద్ర విలక్షణ రచనాశైలికి ఇదొక మచ్చుతునక. ఆంగ్ల, మలయాళ భాషలతో పాటు స్పానిష్‌లోనూ వెలువడిన ఈ సంపుటిలో ఆడ, మగ కాని వ్యక్తి జీవిత కోణాలన్నీ కనిపిస్తాయి. చిరకాల సహచరుడు దూరం కావడంతో పాటు మరెన్నో వ్యధాభరిత జ్ఞాపకాలు తనను చితిలా కాల్చేస్తుంటాయి. ఆ గాయాలూ, భయాలూ, అవమానాలూ, నిరాశల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నమే దీని  ఇతివృత్తం. లైంగికతకు తోడు నగరీకరణ సమస్యలు, విభిన్న వర్గ సంఘర్షణలనూ అనువాదకులు నేరుగా కన్నడ నుంచి తెలుగులోకి అక్షరీకరించారు. మూలం ఆత్మకథలా గోచరించే నేపథ్యంలో- ‘చిక్కుముడి’తో ఆరంభించి కొనసాగించిన ఈ కథనమంతా...  ఒక పుస్తకంలా కాదు, మండుతున్న కాగడాలా ఉంటుంది. మానసిక కుంగుబాటు నుంచి ఆత్మశోధన దిశగా మళ్లిన జీవనయానాన్ని పాఠకుల కంటిముందు నిలుపుతుంది.  

మోహనస్వామి (కథలు) 
రచన: వసుధేంద్ర  
అనువాదం: రంగనాథ రామచంద్రరావు 
పేజీలు: 245; వెల: రూ.299/  
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు

- శరత్‌బాబు 

ఒకరికొకరుగా...

 


చదువు, సంస్కారంతో ఒద్దికగా ఎదిగి  జీవితంలో స్థిరపడిన ముగ్గురు స్నేహితురాళ్లు కాలేజీ రోజుల్లో తమకు దూరమైన నాలుగో మిత్రురాలిని వెతికి పట్టుకుంటారు. స్త్రీలోలుడైన ఆమె భర్తకు తగిన గుణపాఠం చెబుతారు. ఆధునికత,  సంప్రదాయాల కలబోతగా  ఈ నవల సాగుతుంది.  కుటుంబంలోని ఆప్యాయతలూ, బంధుత్వాల్లోని సొగసులను సందర్భానుసారం చెప్పటమే కాకుండా ఒకరికొకరు తోడుగా నిలిస్తే ఆ మాధుర్యమే వేరన్న అభిప్రాయాన్ని బలంగా ప్రకటించారు. చాలాకాలం క్రితం దూరమైన తండ్రి ఆచూకీ కనుగొనటానికి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రయత్నించిన కొడుకును మనకు  పరిచయం చేస్తారు. మంచితనానికి నిలువెత్తు రూపాలుగా కనిపిస్తాయి ఇందులోని పాత్రలు.

తోడొకరుండిన (నవల) 
రచన: పోలంరాజు శారద 
పేజ0ీలు: 208; వెల: రూ. 120`/- 
ప్రతులకు: ఫోన్‌- 80963 10140

- పార్థు

అక్షర దీపాలు

 

వస్తువైవిధ్యం, శిల్పవైశిష్ట్యం, సౌందర్యాత్మక భావజాలాల సమ్మేళనం గోపీ కవిత్వం. సృజనశీలత, దార్శనిక దృక్పథం, మానవీయ పరిమళాలు గుబాళిస్తున్న ఈ సంకలనం వర్తమాన బతుకు చిత్రానికి దర్పణం. ‘మట్టికీ మనిషికీ అద్వైతమే కవిత్వం’ అంటూ కవిత్వపు అసలు రహస్యాన్ని వెల్లడించారు. ‘తాపత్రయాలొద్దు... ఆఖరికేం మిగలదు.  నీ మరణవార్తను నువ్వే చదువుకోలేవు’ అంటూ పారమార్థిక చింతనాసారాన్ని తేల్చిచెప్పారు. ‘ప్రేమలేఖ... మడతల మధ్య వొదిగిన మహాకావ్యం’ అంటూ ప్రేమలేఖలో జాలువారిన అక్షర పారిజాతాల్ని కవిత్వంలో వెదజల్లారు. ఎన్నో జ్ఞాపకాలూ, మరెన్నో అనుభూతుల రసవాహినిగా ఈ కవితాస్రవంతి ప్రవహిస్తుంది. 

ఎవరి దుఃఖమో అది! (కవిత్వం) 
రచన: డా.ఎన్‌.గోపి 
పేజీలు: 150; వెల: రూ.150/- 
ప్రతులకు: ఫోన్‌ 040-27037585

- రాజేశ్‌ 

అనుభపంచిన కథలువం

 

గొప్పగొప్ప మలుపులు కన్పించవు. అయోమయంలోకి నెట్టేసే కథలు అసలే కావు. చాలా సరళంగా అమ్మో, అమ్మమ్మో  ఓ సాయంకాలంపూట మన దగ్గర కూర్చుని తన అనుభవాలు పంచుకున్నంత హాయిగా ఉంటాయీ కథలు. ‘మా అత్త బంగారం’, ‘కాలమిచ్చిన తీర్పు’ వంటివన్నీ మన చుట్టూ ఉన్న జీవితాలే. రచయిత్రి వాటిని ఏర్చికూర్చి చక్కని అక్షరమాలలుగా అందించడం బాగుంది. జన్మమెత్తితిరా, రుణానుబంధ రూపేణ, బుణానుబంధం వంటి కథలు జంతువుల చుట్టూ  తిరుగుతూ మెత్తని హాస్యాన్ని పండించడంతో పాటు ఆలోచింపచేస్తాయి. శకునాలు, కులాలు అంటూ వెంపర్లాడే సూర్యం కులంకాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న తన కూతురు గురించి చివరిగా అన్నమాలేంటో తెలుసుకోవాలంటే ‘గుండెల్లో గోదారి’ కథలు చదవాల్సిందే.

  గుండెల్లో గోదారి (కథలు) 
 రచన: చెంగల్వల కామేశ్వరి
పేజీలు: 156; వెల: రూ.120/- 
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు

- ఆజాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు