close


ఫ్యాషన్/వెరైటీ/కొత్తగా

జాబిల్లితో సెల్ఫీ...  

 

 

 

వెన్నెల కురిపించే అందాల చందమామను దగ్గర నుంచీ చూడలన్న ఆశతో పసిపిల్లలప్పటి నుంచే రారమ్మని పిలుస్తుంటాం. కానీ, నిజంగానే నేలకు దిగివచ్చిన చందమామా ఒకటుంది. దానితో మనం ఎంచక్కా ఫొటోలు కూడా దిగొచ్చు. ‘మ్యూజియం ఆఫ్‌ మూన్‌’గా పిలిచే ఈ కళాఖండాన్ని యూకేకు చెందిన లూక్‌ జెరామ్‌ అనే కళాకారుడు తయారు చేశాడు. నాసా వాళ్లు తీసిన చందమామ ఫొటోలూ వీడియోల ఆధారంగా అచ్చం అలాగే ఉండేలా ఒక పెద్ద గాలి బుడగ మీద త్రీడీ ఇమేజరీ సాయంతో చందమామ రూపాన్ని సృష్టించాడు. లోపల జాబిల్లిని తలపించేలా వెలుగులు చిమ్మే లైట్లను అమర్చాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎన్నో ఎగ్జిబిషన్లలో దీన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఇది భారత్‌ సహా, ఫ్రాన్స్‌, బెల్జియం, నెదర్లాండ్స్‌, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా లాంటి ఎన్నో ప్రపంచ దేశాల్ని చుట్టి వచ్చింది. చందమామ గురించిన విశేషాలు చెప్పే కార్యక్రమాలూ, ఆటలూ కూడా ఈ ఎగ్జిబిషన్లలో ఉంటాయి.

 

 

 ఎప్పటికీ జోకర్‌లానే...

 

 రంగురంగుల బట్టలూ, చిత్రంగా0 ఉండే జుట్టుతో కనిపించే జోకర్లని చూడటం అంటే కొందరికి ఇష్టం, ఇంకొందరికి అలాంటి వేషం వేసుకోవడం అంటే ఇష్టం. కానీ అమెరికాకు చెందిన రిచీకి మాత్రం తాను అచ్చంగా జోకర్‌లా మారిపోవాలనేది కోరిక. అంటే మేకప్‌ లేకపోయినా జోకర్‌లాగే కనిపించాలన్నది అతని ఆశ. అందుకే ఎప్పటికీ నిలిచిపోయే టాటూలతో జోకర్‌ మేకప్‌లాగే డిజైన్‌ వేయించుకున్నాడు. కనుబొమ్మలు ఎత్తుగా కనిపించేందుకు ఇంప్లాంట్లు పెట్టించుకున్నాడు. తలకు ఇరువైపులా మాత్రమే జుట్టు ఉండేలా కత్తిరించుకుని రంగేసుకున్నాడు. చివరికి తను అనుకున్నట్టే చూడగానే జోకర్‌లా కనిపించేలా తయారయ్యాడు. ఇలాంటి రూపంలోనే హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఎవరి పిచ్చి వాళ్లకానందం మరి! 

సముద్రంలో ఏడువారాలు...

 

ఒక్కళ్లమే సముద్రం మధ్యలో చిక్కుకుపోతే... రాత్రీపగలూ ఒక చిన్న పడవలాంటి దాని మీద గడపాల్సి వస్తే... ఇలాంటి సందర్భాన్ని తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ! కానీ ఇండోనేషియాకు చెందిన పందొమ్మిదేళ్ల యువకుడు మాత్రం ఇదే పరిస్థితుల్లో ఒకటీ రెండూ కాదు ఏకంగా ఏడు వారాల పాటు బతికాడు. చివరికి నావికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అల్దీ నావెల్‌ అదిలాంగ్‌ అనే అబ్బాయి చేపల్ని పట్టేందుకు పసిఫిక్‌ సముద్ర తీరం వెంట లైటింగ్‌ను ఏర్పాటు చేసేవాడు. అందుకోసం పడవలోపల చిన్న చెక్క ఇల్లు నిర్మించుకున్నాడు. ఒకరోజు అలల తాకిడీ గాలీ ఎక్కువవడం వల్ల పడవకు వేసిన లంగరు తెగిపోయి సముద్రంలో చిక్కుకున్నాడు. 49 రోజుల పాటు అలా నీళ్ల మీద తేలుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఒక పెద్ద నౌక కెప్టెన్‌ ఇతన్ని గుర్తించడంతో బతికి బట్టకట్టాడు. అన్నాళ్లూ సముద్రంలోని చేపలు పట్టుకుంటూ ప్రాణం నిలుపుకున్నాడట.

ఇది కార్టూన్‌ హోటల్‌!

 

సినిమా థియేటర్‌ని తలపించేలా, అడవి వాతావరణాన్ని గుర్తుతెచ్చేలా ముస్తాబవుతున్న రకరకాల హోటళ్ల గురించి మనం వినే ఉంటాం. కానీ సియోల్‌లో ఉన్న ‘ఎవోనమ్‌డాంగ్‌ 239 20’ కెఫేకి వెళితే మాత్రం అచ్చం కార్టూన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. అక్కడి గోడలూ, కిటికీలూ, కబోర్డులూ, బల్లలూ, కుర్చీలూ అన్నీ తెల్లకాగితం మీద నల్ల పెన్నుతో గీసిన బొమ్మల్లాగే కనిపిస్తాయి మరి! లోపలికి వెళ్లగానే మరో ప్రపంచాన్ని తలపించేలా రూపుదిద్దిన ఈ కెఫేలోకి వెళ్లేందుకు కార్టూన్లని బాగా ఇష్టపడేవాళ్లతో పాటు కొత్త కొత్త చోట్ల ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి ఆనందించే టెక్‌జనమూ చాలా ఆసక్తి కనబరుస్తున్నారట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు