close


సేవ/స్ఫూర్తి/జ‌న‌ర‌ల్

ఇప్పటికీ భయం వేస్తుంది!  

 

వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీల రికార్డుని తన పేరున రాసుకున్న క్రికెటర్‌ రోహిత్‌ శర్మ. తాజాగా ఆసియా కప్‌లో బ్యాట్స్‌మెన్‌గానూ, కెప్టెన్‌గానూ రాణించాడు.  రోహిత్‌ గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన  విషయాలు అతడి మాటల్లో!

 

కిట్‌ పోయింది

 చిన్నపుడు శిక్షణ కోసం ముంబయిలోని బొరోవలి నుంచి చర్చిగేట్‌కి లోకల్‌ ట్రైన్లో వెళ్లేవాణ్ని. కిట్‌ పట్టుకుని లోకల్‌ ట్రైన్లో వెళ్లిరావడం నరక ప్రాయమే. ఓసారి రైలు ఎక్కాక నా కిట్‌ చేతిలోంచి జారిపోయింది. తర్వాత స్టేషన్లో దిగి మళ్లీ వెనక్కి వచ్చి చూస్తే కిట్‌ లేదు. ఇలాంటి అనుభవాలు ఇంకా చాలానే ఉన్నాయి.


నాకు నచ్చని పదం

 

 

టాలెంటెడ్‌... నాకు నచ్చని పదం ఇది. నేను చాలా టాలెంటెడ్‌ అనీ, నాకు బ్యాటింగ్‌ నైపుణ్యం చాలా సహజంగా వచ్చిందనీ చాలామంది విశ్లేషకులు అంటారు. కానీ వాస్తవం వేరు. నేను కెరీర్‌ మొదలుపెట్టింది ఆఫ్‌ స్పిన్నర్‌గా. తర్వాత కోచ్‌ ప్రోత్సాహంతో బ్యాట్‌ పట్టాను. ఆయనే నన్ను స్కూల్‌ జట్టులో ఓపెనర్‌ని చేశారు. రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో కూడా ఆల్‌రౌండర్‌గా ఆడాను. తర్వాత వేలికి గాయమై బౌలింగ్‌ మానేసి పూర్తిగా బ్యాటింగ్‌మీద దృష్టిపెట్టి శ్రమించాను. 


రోహిత్‌ గార్డెన్స్‌

నా మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లోనే ఆడాను. రెండు ఐపీఎల్‌ కప్‌లు అందుకున్నదీ, వన్డేల్లో 264 పరుగుల రికార్డు సాధించిందీ అక్కడే. 264 రన్స్‌ చేసిన ముందురోజు రాత్రి ఫ్యాన్స్‌ వచ్చి హోటల్‌ లాబీలో కలిశారు. వాళ్ల చేతిలో ఉన్న ప్లకార్డు మీద ఈడెన్‌ గార్డెన్స్‌ ఫొటోమీద ‘రోహిత్‌ గార్డెన్స్‌’ అని రాసుంది. కొన్నాళ్లు జట్టుకి దూరమైన నాకు, వాళ్లని కలిశాక ‘మనం ఆడుతున్నది ఈడెన్‌’లో అన్న భరోసా వచ్చింది.

 

 

పావ్‌భాజీ 

మంచి ఆహారం ఆకలిని తీర్చడమే కాదు, ఆరోగ్యాన్నీ, ఆహ్లాదాన్నీ ఇస్తుంది. ఇప్పుడంటే దేశవిదేశాలకు చెందిన వంటకాల్ని తినే అవకాశం వస్తోంది. చిన్నపుడు గ్రౌండ్‌ వెలుపలి దుకాణాల్లో పావ్‌ భాజీ, సేవ్‌ పూరీ, వడాపావ్‌లతో ఆకలి తీర్చుకునేవాళ్లం. ఇప్పటికీ అవి నాకు చాలా ఇష్టం. 

శిఖర్‌తో జోడీ...

టీమ్‌ ఇండియాలో ఓపెనింగ్‌ స్థానం నాకు బాధ్యతని నేర్పింది. గట్టి పునాది వేస్తే జట్టుకు ఎంత మేలు జరుగుతుందో చూశాక వికెట్‌ విలువ అర్థమైంది. శిఖర్‌, నేనూ అండర్‌-19 నుంచీ కలిసి ఆడుతున్నాం. వికెట్ల మధ్య పరుగెత్తడంలో మా మధ్య మంచి అవగాహన ఉంది.

డేంజర్‌...  జడేజా

  దక్షిణాఫ్రికా పర్యటనలో ఓసారి నేనూ, అజింక్య రహానే మా భార్యల్ని తీసుకుని సఫారీకి వెళ్లాం. మాతోపాటు రవీంద్ర జడేజా వచ్చాడు. మేం జీప్‌ దిగి నడుస్తున్నాం. మా ముందు మూడు చిరుత పులులున్నాయి. వాటిని గమనిస్తుండగా, జడేజా నోటితో వాటిని పిల్చినట్టు శబ్దం చేశాడు. మాకు ఊపిరి ఆగినంత పనైంది. అవి ఓసారి మావైపు చూసి ముందుకు వెళ్లిపోయాయి. ‘మా వైపు వచ్చుంటే’ అని ఇప్పటికీ భయమేస్తుంది!

యువీ చూడొద్దన్నాడు

రితికాను మొదటిసారి ఓ యాడ్‌ షూట్‌కి వెళ్లినపుడు చూశాను. ఆ యాడ్‌లో యువరాజ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఉన్నారు. షూట్‌కి వెళ్లి యువీని పలకరించగానే ‘అక్కడ మా చెల్లి ఉంది. పిచ్చి వేషాలేం వెయ్యకు. అసలు అటువైపు చూడకు’ అని సీరియస్‌గా చెప్పాడు. ఇదేంటి ఇలా అంటున్నాడూ అనుకున్నా. అప్పటికి బయటి ప్రపంచం అంతగా తెలీదు. యాడ్‌లో  
నా వంతు వచ్చేవరకూ వెయిట్‌ చేస్తుంటే, ‘ఏమైనా హెల్ప్‌ కావాలంటే అడగండి’ అని రితికా వచ్చి మాట కలిపింది. రితికా కూడా పంజాబీ అనీ,. యువీవాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అనీ తర్వాత తెలిసింది. యువరాజ్‌ మరో రెండు యాడ్‌ షూట్‌లకి కలిసి చేశాక తను నా మేనేజర్‌ అయింది. ఆ ప్రయాణంలో మా మధ్య అనుబంధం ఏర్పడింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు