close


సెంట‌ర్ స్ప్రెడ్

పగడపు వన్నెలు.. ఫ్యాషన్‌ చిన్నెలు..!

నాకు తెలుపంటే ఇష్టం అని ఒకరంటే, నాకు మాత్రం నలుపంటేనే ఇష్టం అని మరొకరూ, కాదు నీలం అని ఒకరూ, ఎరుపే అని ఇంకొకరూ... ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అయితే ఆ రంగుల్ని ఇష్టపడేవాళ్లు ఎంతమందో వాటిని మెచ్చనివాళ్లూ అంతమందే ఉంటారు. కానీ ‘నాకు నచ్చదు’ అని ఎవరూ చెప్పలేని ఆహ్లాదకరమైన రంగులు కొన్ని ఉంటాయి. కోరల్‌... కచ్చితంగా అలాంటిదే. చూడగానే ఆహా అనిపించే అందమైన ఫ్యాషన్‌ కలర్‌! 
చినుకుతడి ఆరుతూ శీతగాలి తిరిగే వేళ... నులివెచ్చని కోరల్‌ కలర్‌ మనసుకి ఆహ్లాదాన్నీ ఒంటికి వెచ్చదనాన్నీ అందిస్తుంది అంటారు కలర్‌ థెరపిస్టులు. నిజానికి ఫ్యాషన్‌ కావచ్చు, సైన్స్‌ కావచ్చు... ఏదైనా మనిషి ప్రకృతి నుంచే నేర్చుకుంటాడు. చలిదేశాల్లో శీతవేళ ఉష్ణోగ్రతలన్నీ క్రమంగా పడిపోతుంటాయి. ఆ సమయంలో చెట్ల ఆకులన్నీ ముదురాకుపచ్చ నుంచి ఎరుపూ నారింజా పసుపు రంగుల్ని పులుముకుని వర్ణరంజితంగా కనిపిస్తాయి. అంటే ఆ కాలంలో అవి తమని తాము కాపాడుకునే క్రమంలోనే ఆ రంగుల్ని అద్దుకుంటాయి. ఈ ప్రకృతి సూత్రాన్ని అనుసరించే చలికాలంలో కాంతిమంతమైన రంగులు ఎంత ఎక్కువ ధరిస్తే అంత మంచిది అంటారు కలర్‌ సైకాలజిస్టులు. ఎందుకంటే పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరానికి సరైన ఎండ తగలక మనసులో ఒకలాంటి దిగులు మొదలవుతుంది. అందుకే ఆ సమయంలో ప్రకాశవంతమైన రంగుల్ని ఎక్కువగా చూడటంవల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎరుపూ నారింజా పసుపు వర్ణాలు, ఈ కోవలోకే వస్తాయి. వాటిలా మరీ అంత కొట్టొచ్చినట్లు కాకుండా అవన్నీ కలగలసినట్లుండే కోరల్‌ కలర్‌ మాత్రం చూడ్డానికి ఎంతో హాయిగా అందంగా ఉంటుంది. అందుకే పాశ్చాత్యదేశాల్లో ఫ్యాషనిస్టులయినా ప్రాచ్యదేశాల్లోని ఫిలాసఫిస్టులయినా బద్ధకాన్నీ డిప్రెషన్‌నీ కలిగించే చలికాలంలో ఈ రంగుని ఎంత ఎక్కువగా ధరిస్తే అంత మంచిది అని చెబుతారు. అయితే, సమ్మర్‌ ఫ్యాషన్లలోనూ కోరల్‌ సందడి ఎక్కువే. 
వేడుకల వేళ..! 
కాలంతో సంబంధం లేకుండా పాశ్చాత్యదేశాల్లో థీమ్‌ పార్టీ కలర్‌గానూ కోరల్‌ ప్రాచుర్యం పొందింది. అందుకే అక్కడి పెళ్లి వేడుకల్లో దుస్తులతోబాటు వేదిక అలంకరణలోనూ ఈ రంగు ఎక్కువగా కనిపిస్తుంటుంది. టేబుల్‌మీద అమర్చే నాప్‌కిన్‌ల నుంచి వేజుల్లో కనిపించే పూలవరకూ అన్నీ కోరల్‌ రంగుల్ని సంతరించుకుంటాయి. దాంతో ఈమధ్య మనదగ్గరా పెళ్లి మండపాల్లో పగడపు రంగు గులాబీలు గుబాళిస్తున్నాయి. రిసెప్షన్‌ వేడుకలో ధరించే లాంగ్‌గౌన్లూ పొడవాటి అనార్కలీలూ లెహంగాలూ లంగాఓణీలూ; పెళ్లి వేడుకల్లో ధరించే చీరలూ అన్నీ కోరల్‌ షేడ్స్‌లో అందంగా కనువిందు చేస్తున్నాయి. అమ్మాయిలతోబాటు అబ్బాయిల టీషర్టులూ కోట్లూ టైలూ కూడా పగడపు ఛాయల్లో కళ్లను కట్టిపడేస్తున్నాయి. పైగా ఈ రంగు ధగధగలాడే దీపకాంతుల మధ్యే కాదు, పగటి వేళల్లోనూ ఎంతో అందంగా కనిపిస్తుంది. అందుకే పార్టీవేర్‌తోబాటు క్యాజువల్‌ డ్రెస్సుల్లోనూ అమ్మాయిలంతా పగడపు రంగుకి ఫిదా అయిపోతున్నారు. డ్రెస్సులొచ్చాక యాక్సెసరీలు రాకపోతే ఎలా? సో, గాగుల్స్‌ నుంచి శాండల్స్‌ వరకూ అన్నీ కోరల్‌ కలర్‌లో కోమలాంగుల్ని ఆకర్షిస్తున్నాయి. 
సూపర్‌ జోడీ! 
పీచ్‌ కలర్‌కి కాస్త ఎక్కువ, కాషాయానికి కాస్త తక్కువ అన్నట్లు మధ్యలో ఉండే కోరల్‌, ఏ రంగుతోనయినా చక్కగా జోడీ కట్టేస్తుంది. నీలమూ పచ్చా కలగలిసినట్లుండే మయూరవర్ణం కోరల్‌కి జిగినీ దోస్త్‌. ఆ రెండింటి కాంబినేషన్‌ చూడ్డానికి అందంగానే కాదు, ఆహ్లాదాన్నీ అందిస్తుంది. తరవాత వరసగా తెలుపూ నలుపూ ఊదా నీలం, గులాబీ... ఇలా అన్నింటితో ఇది చక్కగా జోడీ కట్టేస్తుంది. అందుకే హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలెబ్రిటీలంతా తరచూ మోడ్రన్‌ ఫ్యాషన్‌ కలర్‌ అయిన కోరల్‌ కాంబినేషన్లతో సందడి చేస్తుంటారు. 
సన్యాసులూ ఆధ్యాత్మికవాదులు సైతం కాషాయ రంగుకి దగ్గ్గరగా ఉండే ముదురు కోరల్‌ రంగుని ఎక్కువగా ధరిస్తుంటారు. ఈ రంగు జ్ఞానాన్ని ప్రబోధిస్తుందనేది వాళ్ల విశ్వాసం. మొత్తమ్మీద పగడపు రంగు... ప్రశాంతతకి ప్రతీక అని చెప్పవచ్చు. 


 

ఎక్కడిదీ రంగు? 
వర్ణపటకంలో ఎరుపూ నారింజ వర్ణాల మధ్యలో వచ్చే మిశ్రమ వర్ణమే కోరల్‌. ఇంకా చెప్పాలంటే రెండొంతుల ఎరుపూ ఒక వంతు పసుపూ లేదా ఆరెంజ్‌లో పింక్‌ కలగలిసిన రంగే కోరల్‌ ఉరఫ్‌ పింకిష్‌ ఆరెంజ్‌. సముద్రంలో పెరిగే కోరల్స్‌ నుంచే ఈ రంగుకి ఆ పేరు వచ్చింది. కోరల్‌ అంటే గ్రీకు భాషలో సముద్ర పుత్రిక అని అర్థం. 
నిజానికి కోరల్‌ అనేది ఒక జీవి కాదు. అనేక జీవుల సమూహం. అందుకే అవన్నీ ఒకదాంతో ఒకటి అతుక్కుని సమూహాల్లా నివసిస్తాయి. అలా అతుక్కునేందుకు కెరోటిన్‌తో కూడిన కాల్షియం కార్బొనేట్‌ని స్రవిస్తాయి. అది గట్టిపడి మొక్కలా మారి వాటన్నింటికీ ఊతాన్ని అందిస్తూ అదంతా ఒకే ప్రాణిలా కనిపించేలా చేస్తుంది. ఈ సమూహంలో పాతజీవులు చనిపోతుంటే కొత్తజీవులు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటి నుంచి వెలువడే స్రావం కారణంగానే మొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. 
ఆ మొక్కనే శుద్ధి చేసి పగడాలు తయారుచేస్తారు. ఈ కారణంతోనే పగడం ఎంతో గొప్పదనీ దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయనీ చెబుతారు. ఆగ్నేయ, దక్షిణాసియా దేశాల్లో పగడాన్ని బుద్ధుడి అవతారంగానూ భావిస్తారు. పగడం ధరిస్తే పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందనీ భయమూ ఒత్తిడీ తొలగిపోతాయనీ అంటారు. కుజదోషంతోబాటు ఇతర గ్రహదోషాలనూ పగడం దరిచేరనీయదనీ విశ్వసిస్తారు భారతీయులు. దీన్నుంచి వెలువడే పసుపురంగు కిరణాలు కీళ్లనొప్పులూ జననాంగసమస్యల్నీ మానసిక సమస్యల్నీ తొలగిస్తాయని అంటారు జ్యోతిషులు. అందుకే క్రీ.పూ. నుంచీ దీన్ని నగల్లో ధరిస్తున్నారు. 
అయితే ముత్యం, పగడం కలిపి గుచ్చిన దండల్ని పాతకాలం నగలుగా భావించి పక్కన పెట్టేసినా, అచ్చంగా పగడాలతో గుచ్చిన దండల్ని ధరించడం కొత్త ఫ్యాషన్‌గా మారింది. అంతేకాదు, విభిన్న రూపాల్లో వస్తోన్న పగడాలమీదా మోజు పెంచుకుంటోంది నవతరం. దాంతో సహజ పగడాలతోబాటు ఆ రంగు పూసలతో చేసిన నెక్లెస్సులూ బ్రేస్‌లెట్లూ చెవిజుంకీలూ అమ్మాయిలకి తెగ నచ్చేస్తున్నాయి. పైగా ఇవి ఆ రంగు డ్రెస్సులతోబాటు ఇతర రంగులమీదకీ చక్కగా నప్పేస్తాయి. వైట్‌ డ్రెస్సులమీదకయితే కొట్టొచ్చినట్లుగా మరీ అందంగా కనిపిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే కెంపులకి పచ్చల్లా ముత్యానికి పగడం ఎవర్‌ గ్రీన్‌ 
కాంబినేషన్‌... అది డ్రెస్సులైనా, నగలైనా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు