close

అమృతాశయం నెరవేరింది

మృతురాలి గర్భసంచితో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ 
ప్రపంచంలోనే ఇది మొదటిసారి 

గర్భాశయ సంబంధ లోపాలతో మాతృత్వాన్ని పొందలేకపోతున్న మహిళలకు శుభవార్త! మృతదేహం నుంచి సేకరించిన గర్భాశయాన్ని పొందిన ఒక మహిళ గర్భం ధరించి, ప్రపంచంలోనే తొలిసారిగా ఈ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీన్నిబట్టి మృతుల నుంచి సేకరించిన గర్భాశయాలు కూడా ఉపయోగపడతాయని రుజువైంది. 
బ్రెజిల్‌లోని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన డేనీ ఎజెన్‌బర్గ్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనత సాధించింది.

వాషింగ్టన్‌: గర్భాశయ మార్పిడి ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా 2013లో స్వీడన్‌లో ఒక మహిళ సంతానాన్ని పొందింది. అయితే అది సజీవ దాత నుంచి సేకరించిన గర్భసంచి. మొత్తంమీద ఇలాంటి ప్రక్రియ వల్ల 11 మంది శిశువులు జన్మనిచ్చారు. గర్భాశయ మార్పిడి వైద్యపరంగా ఒక మైలురాయే అయినప్పటికీ దాతను పొందడం కష్టమవుతోంది. అర్హులైన కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల్లో చాలా అరుదుగానే దాతలు ముందుకొస్తున్నారని పరిశోధకులు తెలిపారు. అయితే ఇదే సమయంలో మరణానంతరం అవయవ దానానికి ముందుకొస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మృత దాతల నుంచి గర్భాశయాలను సేకరించి, అవసరమైన మహిళలకు అమర్చడంపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.

గతంలో 10 సందర్భాల్లో మృత దాతల నుంచి గర్భాశయ మార్పిడికి ప్రయత్నాలు అమెరికా, చెక్‌ రిపబ్లిక్‌, టర్కీ వంటి చోట్ల జరిగాయి. అయితే ఈ ప్రక్రియ ఫలించి బిడ్డకు జన్మనివ్వడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారి. 
తాజాగా మృతురాలి గర్భాశయాన్ని పొందిన బ్రెజిల్‌ మహిళ (32)కు మేయర్‌-రోకిటాన్‌స్కీ-కుస్తెర్‌-హాసర్‌ (ఎంఆర్‌కేహెచ్‌) సిండ్రోమ్‌ వల్ల పుట్టుకతోనే గర్భాశయం లేదు. 
మెదడులో రక్తస్రావంతో చనిపోయిన 45 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని సేకరించి ఈమెకు అమర్చారు. 
గర్భాశయ మార్పిడికి నాలుగు నెలల ముందు గ్రహీత నుంచి అండాలు సేకరించి ఒకసారి ఐవీఎఫ్‌ చేశారు. దీనివల్ల 8 అండాలు ఫలదీకరణ చెందాయి. వీటిని శీతల వ్యవస్థలో భద్రపరిచారు. 
గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్స 2016 సెప్టెంబర్‌లో జరిగింది. పదిన్నర గంటల పాటు సాగింది. 
కొత్తగా వచ్చిన అవయవానికి శరీర రోగనిరోధక వ్యవస్థ నుంచి తిరస్కరణ ఎదురు కాకుండా ఆమెకు ఐదు రకాల ఔషధాలు ఇచ్చారు. బిడ్డకు జన్మనిచ్చేవరకూ వాటిని కొనసాగించారు. 
మార్పిడి శస్త్రచికిత్స జరిగిన ఐదు నెలల తర్వాత కూడా గర్భాశయంలో ఎలాంటి తిరస్కరణ సంకేతాలు, లోపాలు కనిపించలేదు. గ్రహీతకు సాధారణంగానే రుతుక్రమం అవుతోంది. 
ఏడు నెలల తర్వాత.. ఫలదీకరణ చెందిన అండాలను ఆమె గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. పది రోజుల్లో ఆమె గర్భం ధరించింది. 
35 వారాల మూడు రోజుల తర్వాత సిజేరియన్‌ సెక్షన్‌ ద్వారా ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ శస్త్రచికిత్స సమయంలోనే ఆమె గర్భాశయాన్ని తొలగించారు. గర్భాశయంలో ఎలాంటి లోపాలు లేవని గుర్తించారు. 
సజీవ, మృత దాతల నుంచి సేకరించిన గర్భాశయాల పనితీరు, ప్రభావాలను ఇంకా పోల్చి చూడాల్సి ఉంది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు