close

రాజకీయ వర్గాల్లో ‘మీ టూ’ దుమారం 

మహిళల ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలన్న కేంద్ర మంత్రి మేనకా గాంధీ 
ఎం.జె.అక్బర్‌ సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్‌ పట్టు 
దిల్లీ, ఈనాడు-దిల్లీ

‘మీ టూ’ ఉద్యమం కుదిపేస్తోంది. ప్రముఖుల చేతిలో తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ పలువురు మహిళలు తమ వ్యధాభరిత గాథలను బయట పెడుతుండటంతో పెద్ద దుమారమే చేలరేగుతోంది. దీంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి మేనకాగాంధీ బుధవారం స్పందించారు. మహిళలు చేసే ఆరోపణలను తీవ్రంగా పరిగణించాల్సిందేనని చెప్పారు. ‘‘బాధితురాళ్లు తమకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేరు. నలుగురికీ తెలిస్తే తమ గురించి చెడుగా మాట్లాడుకుంటారని భయపడతారు. అలాంటిది వారు ధైర్యంగా ముందుకొచ్చి, ఫలానా వ్యక్తులు తమను వంచించారనీ, వేధించారనీ చెబితే... కచ్చితంగా వాటిని తీవ్రంగా పరిగణించాల్సిందే. రాజకీయాల్లోనూ, మీడియాలోనే కాదు... కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న పురుషులు ఇలాంటి పనులు చేస్తుంటారు’’ అని ఆమె అన్నారు. పాత్రికేయునిగా ఉన్నప్పుడు చాలామంది మహిళలను లైంగికంగా వేధించారంటూ విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో... మేనకాగాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే విషయమై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను విలేకరులు ప్రస్తావించగా, ఆమె స్పందించకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: కమిషన్‌ 
‘మీ టూ’పై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. చాలామంది బాధితులు తమను వేధించిన వారి వివరాలను బయటపెట్టి, వారిని బద్నాం చేయాలని అనుకోవట్లేదని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఓ ప్రకటనలో కోరింది.

ప్రధాని స్పందించాలి: జైపాల్‌రెడ్డి 
కేంద్ర సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సంతృప్తికర సమాధానం చెప్పాలనీ, లేదంటే రాజీనామా చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన సమాధానం చెప్పకుండా ఉండడం మాత్రం సరికాదన్నారు. ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు స్పందించాలన్నారు. మరో అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... తమ నేతలపై కొందరు ఆరోపణలు చేసి వదిలేశారనీ, అక్బర్‌ విషయంలో మాత్రం అన్ని వివరాలూ చెబుతున్నందున వెంటనే విచారించి, తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. అక్బర్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో మోదీ, సుష్మాలు స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ డిమాండ్‌ చేశారు.

నాపై నిరాధార ఆరోపణలు: సోలీ సొరాబ్జీ 
తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధార, కాల్పనిక, అనుచిత నిందలేనని కొట్టి పారేశారు. తనపై ఆరోపణలు చేసిన మహిళకు ఇతరులపై బురద చల్లడం బాగా అలవాటనీ... గతంలోనూ ఎంతోమంది హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఆమె ఇలాంటి ఆరోపణలే చేశారన్నారు. సోరాబ్జీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళా న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసిన సంగతి తెలిసిందే.

అలాంటివి నాకెప్పుడూ ఎదురు కాలేదు: సింధు 
లైంగిక వేధింపుల గురించి మహిళలు బహిరంగంగా వెల్లడించడం అభినందనీయమనీ, దానిని తాను గౌరవిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు అన్నారు. ‘సఖి’ సేవలను ప్రారంభిస్తూ వొడాఫోన్‌ బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. క్రీడా రంగంలో సీనియర్లు, కోచ్‌లు మహిళా క్రీడాకారులపై వేధింపులకు పాల్పడుతుంటారా అని ప్రశ్నించగా- ఆ విషయం తనకు తెలియదన్నారు. తనకెప్పుడూ అలాంటివి ఎదురుకాలేదనీ, తన కెరీర్‌ సాఫీగా సాగిపోతోందన్నారు. అయితే, ఆమె సహచర క్రీడాకారిణి గుత్తా జ్వాలా మాత్రం... ఓ కోచ్‌ తనను మానసికంగా వేధించాడంటూ మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు