close

రూ. లక్ష కోట్ల లూటీ

 తెరాస పాలనలో జరిగిందిదే 
తెతెదేపా అధ్యక్షుడు రమణ ధ్వజం 

జగిత్యాల, న్యూస్‌టుడే: తెరాస పాలనలో రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల లూటీ జరిగిందని తెతెదేపా అధ్యక్షుడు రమణ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డితో కలిసి రమణ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..53 నెలల తెరాస పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం రూ.50 వేల కోట్లు దోచుకుందని, ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌ కుటుంబ సభ్యుల అనుచరులు మరో రూ.50 వేల కోట్లు లూటీ చేశారని అన్నారు. అభివృద్ధి పేరిట ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ.. ఆఖరికి పేద ఆడ బిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనూ కేసీఆర్‌ కుటుంబం కక్కుర్తికి పాల్పడిందన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్‌ కుంభకోణాలకు పాల్పడటమే కాకుండా పుర్రె గుర్తుతో బీడీ కార్మికుల పొట్ట కొట్టారని ఆరోపించారు. ఎంపీగా కవిత చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కుటుంబం కబంధ హస్తాల నుంచి నాలుగు కోట్ల ప్రజలను విముక్తి చేసేందుకే ప్రజాకూటమి ఏర్పడిందని తెలిపారు.

ఓటమి అంచున తెరాస: రావుల 
ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ఓటమి అంచున ఉందని, అలంపూర్‌ సభలో ప్రజలపై కేసీఆర్‌ చూపిన ఆవేశం దీనికి సంకేతమని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. తెరాస నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు