close

అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య పోరు

 టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: ‘శాసనసభ ఎన్నికలు సీఎం కేసీఆర్‌ అహంకారానికి, కొడంగల్‌ ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరు’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పదిరోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన బుధవారం వికారాబాద్‌ జిల్లా, దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని కరవు నుంచి శాశ్వతంగా ఎదుర్కొనేందుకు నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి చెరువులన్నీ నింపుతామన్నారు. రేవంత్‌ రాక సందర్భంగా ఆయా గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి డప్పులు, మేళాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింగ్‌భాన్‌సింగ్‌, వెంకట్‌రెడ్డి, వెంకట్‌రావు, సత్యపాల్‌ తదితరులున్నారు.

రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదు 
మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దూషణలు చేసిన రేవంత్‌ రెడ్డిపై మహబూబాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. నవంబరు 29న జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో రేవంత్‌రెడ్డి సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల అధికారులు ప్రసార మాధ్యమాల ఆధారంగా విచారణ నిర్వహించారు. రేవంత్‌ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని సంబంధిత ఎన్నికల నోడల్‌ అధికారులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 17/(జి), 504, 181 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు