close

ఆత్మ గౌరవానికి పరీక్ష

 భారీ మెజారిటీ వస్తే  దిల్లీ పగ్గాలు 
మన చేతిలో రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌ 

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ‘‘కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారు. దేశం యావత్తు మన రాష్ట్రంవైపు తిరిగి చూసేలా చేసుకున్నాం. రాష్ట్ర విభజనకు ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మీకు సరైన నాయకత్వం ఉందా? రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఉందా అన్నారు. దానికి ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నిదర్శనం’’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలో బుధవారం జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. డిసెంబరు 7న జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర ఆత్మగౌరవానికి జరుగుతున్న పరీక్షగా భావించాలని ప్రజలను కోరారు. దేశంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్‌, భాజపాలు అధికారంలో ఉన్నాయి. వారి పాలనలో ఇంకా దేశంలోని వేల గ్రామాలకు విద్యుత్తు, రహదారి, తాగునీరు వంటి మౌలిక వసతుల్లేవన్నారు. వారి పాలన సక్రమంగా జరిగితే దేశంలో ఇంకా ఎందుకీ దురవస్థ నెలకొందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తెరాస 100 సీట్లు గెలిస్తే.. అప్పుడు దిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలని నిర్ణయించే అధికారం తెలంగాణ ప్రజల చేతిలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దిల్లీ పాలనను అదుపు చేసే సత్తా తెరాసకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ రాహుల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కూటమికి ఓటు వేస్తే పాలనను దిల్లీలో తాకట్టు పెడతారని విమర్శించారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు