close

దోచింది.. దాచింది.. చాలా ఉంది 

రఫేల్‌ ఒప్పందంతో పది వేల ఉద్యోగాలు హుష్‌ 
  కేంద్రంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి ధ్వజం 

ఈనాడు, దిల్లీ: రఫేల్‌ ఒప్పందంలో... దాచింది, దోచింది చాలా ఉందంటూ కేంద్రంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రక్షణ శాఖను అడగకుండానే ప్రధాని మోదీ 2015, ఏప్రిల్‌ 14న ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్‌ వర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ సమయంలో నిజాయతీపరుడైన ఆశారాం సిహాగ్‌ రక్షణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ఆయన ఒప్పందాన్ని అంగీకరించరని మోదీ సర్కారుకు తెలుసు. దీంతో ఆయన్ను తప్పించి స్మితా నాగరాజ్‌ను ఆ స్థానంలోకి తీసుకున్నారు. ఆమె రాజీవ్‌ వర్మ అభ్యంతరాలను తోసిపుచ్చి ఒప్పందానికి అనుమతి ఇచ్చేశారు. దీనికి ప్రతిఫలంగా ఆమెను యూపీఎస్సీ సభ్యురాలిగా చేశారు.’’ అని జైపాల్‌ రెడ్డి వివరించారు.

కొందరికి బెదిరింపులు 
‘‘తప్పుడు ఒప్పందాన్ని మెప్పించేందుకు రక్షణ శాఖలోని కొందరు అధికారులను బెదిరించారు. మరికొందరికి రివార్డులూ ఇచ్చారు. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తో విచారణ చేపట్టమంటే తప్పించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తనకు, తన పార్టీకి ప్రయోజనం కలిగిస్తారనే భావంతో ప్రధాని అనిల్‌ అంబానీకి భారీ ప్రయోజనం కల్పించారు. హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌కు రఫేల్‌్ ఒప్పందం దక్కుంటే.. కనీసం కొత్తగా పది వేల ఉద్యోగాలు వచ్చుండేవి. దీన్ని రిలయన్స్‌ డిఫెన్స్‌కు అప్పగించడంతో ఆ ఉద్యోగాలను కోల్పోయాం. హెచ్‌ఏఎల్‌కు అనుభవమేలేదని.. అనిల్‌ అంబానీ కంపెనీకి సామర్థ్యం ఉందని చెప్పడం హాస్యాస్పదం. దీంతోనే వాళ్లు ఎంత తప్పు చేశారో అర్థం చేసుకోవచ్చు’’అని తెలిపారు. తాను పార్లమెంట్‌కు పోటీ చేస్తానని. తెలంగాణ శాసనసభ బరిలోకి దిగనని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు