close

తాజా వార్తలు

గాలీ నీరూ విషం ఎవరికీ పట్టదు ఏమాత్రం! 

న్నికల్లో జనం సమస్యలకు పెద్దపీట వేయడమంటే ఓట్లు దండుకునే తాయిలాలను విచ్చలవిడిగా ప్రకటించడం కాదు. ప్రజల బతుకు, మెతుకుతో ముడివడిన సమస్యలపై నిజాయతీగా చర్చించడం, సహేతుక పరిష్కారాలను అన్వేషించడం, పౌర సమాజం అండగా వాటిని అమల్లో పెట్టడమే జనం బాగోగులపట్ల రాజకీయ పార్టీల చిత్తశుద్ధికి నిదర్శనం. దురదృష్టవశాత్తూ ఏ ఎన్నికల్లోనూ నిజమైన అంశాలు చర్చకు రావడం లేదు. మరీ ముఖ్యంగా పుడమి సహజ సూత్రాలను తిరగరాస్తూ సాగుతున్న పర్యావరణ విధ్వంసంపై దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ నోరు మెదపకపోవడం దిగ్భ్రాంతిపరచే విషయం. ఎన్నికల ప్రణాళిక పత్రాల్లో ఎక్కడో అడుగు బొడుగున తప్ప పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తిస్తూ పార్టీలు తమ అజెండాను వెల్లడించడం లేదు. దేశంలో కనీసం నాలుగోవంతు పార్టీలైనా తమ ఎన్నికల ప్రణాళికల్లో పర్యావరణ స్పృహను ప్రకటించకపోవడం బాధాకరం. 21వ శతాబ్దపు విజ్ఞానం పాలకుల అజ్ఞానం ముందు నిర్వీర్యమైపోతోంది. భూమిని ఆవరించి జీవాధారంగా ఉన్న సన్నటి పొర అయిన పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న స్పృహ పాలకుల్లో ఏ కోశానా కనబడటం లేదు. పర్యావరణమే భూమిని సజీవ గ్రహం చేసింది. నాగరిక సమాజం పర్యావరణాన్ని ప్రాణ ప్రదాతగా కాకుండా- ఇష్టానుసారం వినియోగించుకోవడానికి అవసరపడే వనరుగా చూడటమే వినాశానికి బాటలు పరచింది. సమస్య గురించి, దాని తీవ్రత గురించిన అవగాహన ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నా- భారత్‌లో ఏ స్థాయిలోనూ ఆ చైతన్యం కనిపించకపోవడమే నిర్వేదం కలిగించే పరిణామం!

ఎన్నికల ప్రణాళికల్లో కానరాని పర్యావరణ చైతన్యం 
ఈ భూమ్మీద వ్యవసాయ సమాజాలు పదివేల ఏళ్లుగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల తాత్కాలికంగా ఆయా సమాజాలు సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ- తిరిగి మరో రూపంలో అవి నిలదొక్కుకోగలిగాయంటే పర్యావరణ జీవ సామర్థ్యం కల్పించిన అవకాశమే అందుకు కారణం. పారిశ్రామిక నాగరికత పేరిట వనరులను ధ్వంసం చేస్తున్న కారణంగా నేల కరిగిపోతోంది. అడవులు ఎడారులుగా మారుతున్నాయి. సారవంతమైన భూములు ఉత్పత్తులకు పనికిరానివిగా తయారవుతున్నాయి. జర్మనీ, ఇటలీలలో అడవులు సమృద్ధిగా ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు 5-6 డిగ్రీల సెంటిగ్రేడ్ల వేడి ఇనుమడించింది. భయానకంగా పెరిగిన భూతాపమే అందుకు నిదర్శనం. వ్యాపార విస్తరణ, లాభార్జన, సంపద కేంద్రీకరణ లక్ష్యంగా సాగిన ప్రకృతి విధ్వంసం- మనిషి బతుకును ప్రశ్నార్థకంగా మార్చింది. నెత్తిన పెనుముప్పు ఉరుముతున్నా దేశంలోని ఏ పార్టీకీ అది పట్టని విషయంగా మారడమే దారుణం. భూతాప సంక్షోభంపై పోలెండ్‌లో ప్రస్తుతం అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.

మానవ అస్తిత్వం ప్రమాదంలో పడిన ప్రస్తుత తరుణంలో, సంక్షోభంనుంచి బయటపడే దారులు అంతకంతకూ కుదించుకుపోతున్నాయని, ఏం చేసినా మరో పన్నెండేళ్లకాలమే మిగిలి ఉందని శాస్త్రీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఉరుముతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాజకీయ పార్టీల వైఫల్యానికి నిరసనగా అనేక దేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారు. ప్రకృతి హననాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాల భంగపాటును ఎత్తిచూపుతూ వివిధ దేశాల్లో ఉద్యమం విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యమం 12 దేశాల్లో జోరుగా సాగుతోంది. ఒకవైపు ఈ ప్రభుత్వాలు తమకు భవిష్యత్తు లేకుండా చేస్తూ మరోవైపు బడికి వెళ్ళి చదువుకోమంటూ తియ్యటి కబుర్లు చెప్పడాన్ని నిరసిస్తూ కొన్నిచోట్ల బడిపిల్లలూ సమ్మెకు దిగుతున్నారు. స్వీడన్‌కు చెందిన 15ఏళ్ల బాలిక గ్రెట థున్‌బెర్గ్‌... ఇందుకు ఆద్యురాలు. ‘ఆటిజం’తో బాధపడుతున్న ఈ బాలిక ఇంతటి మహోద్యమానికి నేతృత్వం వహించడం విశేషం. గాలిలో కర్బన వాయువులు రెట్టింపైతే ఉష్ణోగ్రత ఏమేరకు పెరుగుతుందో మొదటగా లెక్క కట్టిన స్వీడిష్‌ రసాయన శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత స్వాంటే అర్హేనియస్‌ ఘనవారసత్వానికి కొనసాగింపు అన్నట్లుగా గ్రెట థున్‌బెర్గ్‌ నేతృత్వంలో స్వీడన్‌లోనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మొదలవడం చెప్పుకోదగిన విషయం. ఈ ఏడాది సెప్టెంబరులో స్వీడన్‌ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా గ్రెట థున్‌బెర్గ్‌ బడికి వెళ్ళకుండా ఒంటరిగా తరలివచ్చి- ఆ దేశ పార్లమెంటు ముందు మూడువారాల పాటు కూర్చుని నిరసన తెలిపింది. సంపన్న దేశమైన స్వీడన్‌ భూతాపాన్ని నిరోధించడంలో చేయగలిగిన స్థాయిలో కృషి సాగించడం లేదని గ్రెటా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఉన్నత స్థానాల్లోనివారి నిష్క్రియకు నిరసన తెలుపుతూ నైతిక బాధ్యతగా చేతనైంది చేస్తున్నానని ఆ బాలిక వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించాలని, భూతాపాన్ని కట్టడి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని ఆ బాలిక గట్టిగా డిమాండ్‌ చేస్తోంది.

‘మా పెద్దలు చేసిన తప్పులకు భూమి నేడు పొగలు, సెగలు కక్కుతోంది. వ్యర్థాలు పేరుకుపోయి సర్వత్రా కాలుష్యం నిండింది. వారి బాధ్యతారాహిత్యం భూమిని చెత్తకుప్పగా మార్చింది. ఆ చెత్తనంతా ఊడ్చేయాల్సిన పెను భారాన్ని నేటితరం మోయాల్సివస్తోంది. ఇది ఏమాత్రం సరికాదు. అందరూ మారాలి. మా తరంపై శ్రద్ధపెట్టండి అని వేడుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. మార్పు వస్తోంది... వచ్చి తీరాలి అని శాసించేందుకే వచ్చాను’ 
- డిసెంబరు 3న పోలండ్‌ పర్యావరణ సదస్సులో 15 ఏళ్ల గ్రెట థున్‌బెర్గ్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ సుమారు పదికోట్ల బ్యారెళ్ల చమురును వాడుతున్నారని అంచనా. ఇంధనాన్ని ఈ స్థాయిలో హరించకుండా నిలువరించే రాజకీయాలే నేడు కనిపించడం లేదు. గ్రెట థున్‌బెర్గ్‌ అందించిన స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకోసం పాఠశాల పిల్లలు వేల మంది ఆస్ట్రేలియావ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. 2018 నవంబరు 29ని సమ్మె దినంగా ప్రకటించిన ఆ బాల సమూహం- దేశంలోని ఆదాని బొగ్గుగని మూసివేయడంతోపాటు, శిలాజ ఇంధనాలకు తక్షణం స్వస్తి పలికి పునరుత్పాదక ఇంధనంవైపు మరలాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బడిపిల్లల నిరసనలను ఎద్దేవా చేస్తూ పాఠశాలలను పార్లమెంట్లుగా మార్చవద్దు అంటూ ఆ దేశ ప్రధాని పేర్కొనడం దురదృష్టకరం. ఆ దేశానికే చెందిన మరో ఎంపీ నిరుద్యోగ భృతికోసం బారుల్లో నిలబడేందుకు బడిపిల్లలు ఇప్పటినుంచే అభ్యాసం చేస్తున్నారంటూ ఎగతాళి చేశారు. ప్రకృతిని కాపాడమంటూ పిల్లల ప్రపంచం వినిపిస్తున్న నినాదాలను చెవికెక్కించుకోని రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో నిలువ నీడలేని రోజువస్తే తప్ప ఈ తరహా నిర్లక్ష్యానికి తెరపడదు. భూమిని కాపాడే చర్యలు తీసుకోవడం మీకు చేతకాకపోతే తప్పుకోండి అంటూ బాలల సమూహం చేస్తున్న హెచ్చరికలను ప్రపంచదేశాలన్నీ తప్పనిసరిగా చెవినపెట్టాలి. ధోరణి మార్చుకోవడమా... ప్రకృతి ప్రకోపానికి గురై మలిగిపోవడమా తప్ప మరో మధ్యేమార్గం లేని దశలో మనం ప్రస్థానిస్తున్నామన్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి.

అన్ని దేశాల్లో పర్యావరణ స్పృహ పరవళ్లు తొక్కుతోంది. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దుష్పరిణామాలపై చర్చలు ఊపందుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా మన దేశంలో మాత్రం సమస్యను గుర్తించేందుకే రాజకీయ పార్టీలకు తీరికలేకుండా ఉంది. పార్టీల ఎన్నికల ప్రణాళికలలో పర్యావరణానికి చోటే ఉండటం లేదు. భూతాపం ప్రస్తావనే కనిపించడంలేదు. ఏ నాయకుడి ఎన్నికల ప్రసంగంలోనూ మనిషి ఎదుర్కొంటున్న పెనువిపత్తు గురించిన మాటే వినపడటం లేదు. చైతన్యం రేకెత్తించి ప్రజలను శక్తిమంతంగా రూపొందించాల్సిన రాజకీయ పార్టీలు- వారిని కేవలం లబ్ధిదారులుగానో, ఎప్పటికీ చేయిచాపి అడుక్కునేవారిగానో మాత్రమే మిగులుస్తున్నాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలు వనరుల పరిమితికి అనుగుణంగానే విస్తరించాలి. పరిమిత వనరులు ఉన్న భూమిపై అపరిమిత వృద్ధి అసాధ్యమన్న భౌతిక సత్యాన్ని అవి గుర్తించాలి. ఈ మౌలిక అంశాన్ని అర్థం చేసుకోకుండా ప్రమాదకరమైన నిరంతర వృద్ధి విధానాలను పార్టీలన్నీ ప్రజలపై రుద్దుతున్నాయి. 2018 సెప్టెంబరులో ఐరోపాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 238 మంది అధ్యాపకులు ఒక కీలక ప్రకటన చేశారు. ‘వృద్ధికి కాలం చెల్లింది... ప్రత్యామ్నాయాలను అన్వేషించకపోతే అది రాజకీయ నాయకుల, విధాన నిర్ణేతల బాధ్యతారాహిత్యమే అవుతుంది’ అని వారు గట్టి హెచ్చరిక చేశారు. అవధుల్లేని అభివృద్ధిని ఆశించి కర్బనాలను విచ్చలవిడిగా వెలువరించిన ఫలితంగానే భూతాపం బెంబేలెత్తిస్తోంది! ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రాజకీయాలు సాగాలి.

మొండివైఖరి వీడాలి 
స్వీయ ప్రయోజనాలకు అనువుగా లేకపోతే రాజకీయం ఎంతకైనా తెగిస్తుంది అనేందుకు పారిస్‌ ఒప్పందంనుంచి వైదొలగుతూ గతంలో అమెరికన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనే ఉదాహరణ. స్వయంగా తన ప్రభుత్వానికి చెందిన సంస్థలే వెలువరించిన జాతీయ పర్యావరణ మదింపు నివేదికను సైతం ట్రంప్‌ కొట్టిపారేయడం మూర్ఖత్వానికి, మొండితనానికి పరాకాష్ఠ. బొగ్గును భూమిలోనే ఉంచాలని సైన్స్‌ నిర్ద్వందంగా చెబుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లోనూ, భారత్‌లోనూ జరుగుతోంది ఇందుకు భిన్నం. బొగ్గు ఆధారిత విద్యుత్తుకు వ్యతిరేకంగా ఉద్యమించిన సామాన్యులపట్ల ప్రభుత్వాలు దమనకాండకు దిగిన ఉదాహరణలకు లెక్కలేదు. విద్యుత్‌ వెలుగుల వెనక పరచుకుంటున్న చీకట్లో మలిగిపోతున్న జనం జీవితాలకు విలువ ఇవ్వని రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలి. జన క్షేమాన్ని పక్కకు నెట్టి వాణిజ్యావసరాలే ప్రాతిపదికగా విధానాలను వండి వార్చే రాజకీయాలకు ముగింపు చెప్పాలి. ఎవరికైనా వ్యాపారం చేసే హక్కు ఉంటుందని- కానీ అది కొన్ని షరతులకు కట్టుబడి సాగాలని న్యాయస్థానాలు ఎప్పుడో చెప్పాయి. వ్యాపార, వాణిజ్యాలకోసం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల జీవించే హక్కును హరించి వేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సామాజిక, ఆర్థిక అసమానతలను పెంచి పోషించే రాజకీయ విధానాలకు స్వస్తి చెప్పాల్సిన తరుణం తరుముకొస్తోంది. మానవాళి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి ప్రాధాన్యమిచ్చే రాజకీయాలకు తెరలేపాలి. అందుకు ప్రకృతే ప్రేరణ కావాలి!

- డాక్టర్‌ కలపాల బాబూరావు 
(రచయిత పర్యావరణ ఉద్యమవేత్త)

Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు