close

తాజా వార్తలు

హోటల్‌ గదిలో రహస్య కెమెరాతో నగ్నవీడియోలు

రూ. 700కోట్లకు దావా వేసిన అమెరికా మహిళ

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ హోటల్‌గా పేరొందిన హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌పై ఓ మహిళ 100 మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 700కోట్లకు పైమాటే) దావా వేసింది. హోటల్‌ గదిలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించారని, అనంతరం ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్లలో పోస్టు చేశారని బాధిత మహిళ ఆరోపించారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఇటీవలే తెలుసుకున్న మహిళ వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

షికాగోకు చెందిన ఓ మహిళ బార్‌ పరీక్షల నిమిత్తం 2015 జులైలో న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ అల్బనీలోని హాంప్టన్‌ ఇన్‌ అండ్‌ సూట్స్‌ హోటల్‌(ఇది హిల్టన్‌ గ్రూప్‌నకు చెందిన మరో బ్రాండ్‌ హోటల్‌)లో గది తీసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళ గదిలో స్నానం చేస్తుండగా అక్కడే ఉన్న రహస్య కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయం తెలియని మహిళ తిరిగి షికాగో వెళ్లిపోయారు.

అయితే మూడేళ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో ఆ మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. ‘ఈ వీడియోలో ఉన్నది మీరే కదా’ అంటూ అశ్లీల వెబ్‌సైట్ లింక్‌ను ఆ వ్యక్తి ఈ-మెయిల్‌లో పంపారు. దీని ద్వారా ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోను ఇతర సైట్లలో కూడా పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హిల్టన్ హోటళ్లపై 100 మిలియన్‌ డాలర్లకు దావా వేశారు.

కాగా.. ఘటనపై హిల్టన్ గ్రూప్‌ స్పందించింది. హోటల్‌కు వచ్చే అతిథుల భద్రత, ప్రైవసీపై తాము సీరియస్‌గా ఉంటామని.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు మేం అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు