close

తాజా వార్తలు

నా ఆఫర్‌ను దానితో ఎందుకు ముడిపెడుతున్నారు

విజయ్‌ మాల్యా

లండన్‌: భారతీయ బ్యాంకులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానంటే దాన్ని తన అప్పగింత అంశానికి ఎందుకు ముడిపెడుతున్నారని ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా ప్రశ్నిస్తున్నారు. తాను ఎక్కడ ఉన్నా డబ్బులు చెల్లిస్తానని, తనపై వేసిన ఎగవేతదారు ముద్రను చెరిపేసుకోవాలనుకుంటున్నానని మాల్యా మరోసారి స్పష్టం చేశారు.

‘నన్ను భారత్‌కు అప్పగించే విషయం లేదా దుబాయి నుంచి మిషెల్‌ను భారత్‌కు తీసుకురావడం లాంటి అంశాలతో నా సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ను ఎలా, ఎందుకు ముడిపెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ ఉన్నా సరే నా విజ్ఞప్తి ఒక్కటే.. దయచేసి డబ్బు తీసుకోండి. డబ్బు దోచుకున్నాను అంటూ నాపై వస్తున్న వార్తలను ఆపాలని అనుకుంటున్నాను’ అని మాల్యా ఈ ఉదయం ట్వీట్‌ చేశారు.

భారతీయ బ్యాంకులకు ఇవ్వాల్సిన నూరుశాతం ప్రజాధనాన్ని తిరిగి చెల్తిస్తానంటూ మాల్యా బుధవారం పలు ట్వీట్లలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డబ్బును తీసుకోవాలంటూ బ్యాంకులు, ప్రభుత్వాన్ని కోరారు. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్న ఆయనను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు ఈ నెల పదో తేదీన తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మరోవైపు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల ఒప్పందంలో మధ్యవర్తి గా వ్యవహరించిన బ్రిటన్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిషెల్‌ను యూఏఈ ఇటీవలే భారత్‌కు అప్పగించింది. దీంతో మాల్యాను కూడా లండన్‌ అధికారులు భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయని, అందుకే భారత్‌లో తనపై సానుభూతిని పెంచుకునేందుకు మాల్యా ఈ ఆఫర్లు చేస్తున్నారంటూ నిన్న వార్తలు వచ్చాయి. వీటిపై మాల్యా పైవిధంగా స్పందించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు