close

తాజా వార్తలు

ఆలోక్‌ వర్మ కేసులో తీర్పు రిజర్వు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తనను సెలవుపై పంపించడాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆలోక్‌ వర్మ, కేంద్రం, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్, తదితరు‌ల వాదనలను నేడు ముగించింది. సీబీఐ చీఫ్‌ను సెలవుపై పంపడాన్ని వ్యతిరేకించడమే కాకుండా సీబీఐ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్జీఓ కామన్‌ కాజ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు వాదనలు విన్నది. దాదాపు మూడు గంటల పాటు వాదనలు జరిగాయి.

ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. విచారణలో.. సీబీఐ అధికారులు కీచులాటతో దర్యాప్తు సంస్థ ప్రతిష్ఠ మసకబారిపోతోందని, దీంతో వారిని సెలవుపై పంపాల్సి వచ్చిందని కేంద్రం కోర్టుకు వెల్లడించింది. అనుకోని పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సీవీసీ తగిన విధంగా స్పందించాల్సి వస్తుందని, లేదంటే సీవీసీ ప్రభావ రహితంగా మారుతుందని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ వాదించింది. అయితే ఆలోక్‌, అస్థానాలను రాత్రికి రాత్రి ఎందుకు సెలవుపై పంపారని, ఈ విషయంపై సెలక్షన్‌ కమిటీని ఎందుకు సంప్రదించలేదని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టుకు ఎలాగైతే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉండకూడదో.. సీబీఐకి కూడా తాత్కాలిక డైరెక్టర్‌ ఉండకూడదని ఆలోక్‌ వర్మ కోర్టులో వెల్లడించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు