close

తాజా వార్తలు

ఆలయాలు కాదు.. పాఠశాలలు కావాలి

దిల్లీ: రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. కుశ్వాహా ఈరోజు బిహార్‌లోని చంపారన్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపాపై, రాష్ట్రంలోని జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలు కట్టించాల్సింది ఆలయాలు కాదని.. వాటికి బదులుగా రాష్ట్ర ప్రజలకు చక్కని విద్యను అందించేలా పాఠశాలలు కట్టించాలని కుశ్వాహా పేర్కొన్నారు. రాష్ట్రానికి విద్య చాలా అవసరమని, చదువుకునేందుకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సరిపడినంత మంచి ఉపాధ్యాయులు లేరని అన్నారు. విద్యా రంగం అభివృద్ధి చేసేందుకు తాను ప్రతిపాదించిన 25 పాయింట్ల అజెండాను జేడీయూ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి తోడ్పడే తన డిమాండ్లను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అంగీకరిస్తే ఆయన తనను ‘నీచమైన వ్యక్తి’ అన్నమాటలను కూడా క్షమిస్తానని కుశ్వాహా వెల్లడించారు. కొద్ది వారాల క్రితం నితీ‌శ్‌ కుమార్‌ కుశ్వాహా ‘నీచమైన వ్యక్తి’ అని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల కోసం బిహార్‌లో ఎన్డీయే కూటమి పార్టీల సీట్ల కేటాయింపు విషయంలో కుశ్వాహా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపు ఖరారు చేయాలని నవంబరు 30వ తేదీకి డెడ్‌లైన్‌ ఇచ్చారు. కానీ ఎన్డీయే నుంచి ఎలాంటి స్పందన లేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో కుశ్వాహా పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్ల గెలిచింది. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 23చోట్ల పోటీ చేసి 21చోట్ల ఓడిపోయింది. దీంతో ఆర్‌ఎల్‌ఎస్‌పీ విజయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా తాజాగా సీట్ల కేటాయింపు వివాదాల నేపథ్యంలో ఆయన ఎన్డీయేను వీడి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుశ్వాహా జేడీయూను వీడిన శరద్‌ యాదవ్‌తో చర్చలు జరిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు