close

తాజా వార్తలు

ఓటేసి మీ బాధ్యత నిరూపించుకోండి!

మనకెందుకులే అనే ఆలోచన వద్దు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 119 శాసనసభా నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఓటు ప్రాముఖ్యత గురించి పంచుకున్నారిలా...

‘‘గత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది అభివృద్ధికి మంచి సంకేతం కాదు. పౌరులుగా మన భాద్యతను మనం నెరవేర్చాలి. నగరంలో చాలామందిలో నాకెందుకు? నాకేంటి అనే భావన పెరిగిపోతోంది. ‘ఓటేస్తే మనకు ఏం వస్తుంది.. హాయిగా ఇంట్లో కూర్చుందాం’ అనే ఆలోచన నుంచి బయటికి రావాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రసార మాధ్యమాలు సైతం ఇందుకోసం ప్రయత్నిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. ఇటువంటి వింత ధోరణితో భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందని ప్రజలు ఆలోచించాలి. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో మన హక్కు. ఈ విషయంలో తల్లిదండ్రులు సైతం పిల్లలకు ఆదర్శవంతంగా ఉండాలి. ఓటు వేయడం వల్ల లాభమేంటని మాట్లాడేవారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు. - తరుణ్‌ భాస్కర్‌, సినీ దర్శకుడు

చుట్టుపక్కల వారినీ ప్రోత్సహించండి!

‘‘చాలామంది ఓటు ఎందుకు వేయాలని భావిస్తుంటారు. అది చాలా తప్పు. గంటసేపు క్యూలో నిల్చొని మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల అయిదేళ్లు హాయిగా ఉండొచ్చు. నా ఒక్క ఓటు వల్ల ఏమీ మారదు కదా అన్న భావన అసలే వద్దు. ఒక్కో పరుగు కలిస్తేనే శతకం సాధించొచ్చు. మీరు ఓటేయండి. మీ చుట్టుపక్కల వారినీ ప్రేరేపించండి. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కును అంతా వినియోగించుకుందాం.’’ - సుమంత్‌, సినీహీరో

ప్రతి ఓటూ విలువైనదే!

‘‘ఓటు అనేది దేశ, రాష్ట్ర భవిష్యత్తును మార్చగల ఆయుధం. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు, అధికారాన్ని కోల్పోతాం. ప్రతి ఓటూ విలువైనదే. అందుకే అందరూ ఈ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. వేసే ముందు ఆలోచించి అర్హుడైన అభ్యర్థిని ఎన్నుకోవాలి’’ - రకుల్‌ప్రీతిసింగ్‌, నటి

విజన్‌ ఉన్న నేతలకే..

‘‘ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ప్రజలు వారి ఆలోచనలను బట్టి నాయకులకు ఓటేయాలి. అది ఎవరైనా కావచ్చు. ఓటేయకుండా.. నాకు పరిపాలన నచ్చలేదు అని విమర్శించే హక్కు ఎవరికీ ఉండదు. ఫలానా అభ్యర్థి అయితే నియోజకవర్గానికి న్యాయం చేయగలరు.. దూరదృష్టితో అభివృద్ధిపై శ్రధ్ద పెడతారు. నియోజకవర్గ, మహిళల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసి ఓటేయడం వల్ల అంతిమంగా నియోజకవర్గానికి మేలు జరుగుతుంది. ఓటు వేయడం ఒకెత్తు.. ఎవరికి వేస్తున్నామనేది మరోఎత్తు. చదువు, నిబద్ధత, విజన్ ఉన్న నాయకుడికి ఓటేయాలి. ఈ నాలుగు రోజులూ మాటలతో సంబరపరిచే వారిని కాకుండా అయిదేళ్లూ మనల్ని ఎలా పాలించగలరో ప్రజలు గుర్తించాలి’’ - శంకర్‌, సినీ దర్శకుడు

ఇది మనందరి బాధ్యత

‘‘18 ఏళ్లు దాటి, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. ఓటు వేయకుండా సమస్యల గురించి నాయకులను ప్రశ్నించలేం. తొలిసారి ఓటు వేసిన సమయంలో నేను చాలా అనుభూతి చెందాను. ఒక నాయకుడిని ఎన్నుకోవడంలో నా పాత్ర కూడా ఉందన్న భావన కలిగింది’’ - ఆర్యన్‌ రాజేష్, సినీహీరో

హక్కును వినియోగించుకోండి

‘‘వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈ మధ్యనే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లోనే మొదటిసారి వేయబోతున్నాను. అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాతనే నాకు ఓటు హక్కు వచ్చింది. నాతో పాటు నగర ప్రజలు, ముఖ్యంగా ఇటీవల ఓటరు గుర్తింపు కార్డు అందుకున్న యువత తమ హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నా’’ - శ్రీనివాస్‌ అవసరాల, దర్శకుడు, నటుడు

అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం నిలుస్తుంది

‘‘గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ఇది అంత మంచి విషయం కాదని నేను భావిస్తున్నాను. ఓటేయడం చాలా ముఖ్యం. ప్రతి పౌరుడు ఎన్నికల్లో ఆ హక్కును వినియోగించుకోవాలి. ఎవరికి ఓటు వేయాలి..? ఎందుకు వేయాలి? అని ఆలోచించి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలుస్తుంది. డిసెంబరు 7వ తేదీ అందరూ గుర్తు పెట్టుకోండి’’ - అమల, సినీ నటి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు