close

తాజా వార్తలు

ఎన్టీఆర్‌ కోసమే ఆ సినిమా ఒప్పుకొన్నా

సీనియర్‌ అంటే కొట్టేస్తారేమో..: ఈషా రెబ్బా

హైదరాబాద్‌: త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కోసమే ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు ఒప్పుకొన్నానని అంటున్నారు ఈషా రెబ్బా. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్‌ జాగర్లమూడి దర్శకుడు. సుమంత్‌ ప్రధాన పాత్రలో నటించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఈషా పాల్గొన్నారు. ‘అరవింద సమేత..’ చిత్రంలోని తన పాత్ర గురించి, ‘సుబ్రహ్మణ్యపురం’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కోసమే..

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా త్రివిక్రమ్‌ సర్‌ కోసం, ఎన్టీఆర్‌ కోసం ఒప్పుకొన్నాను. నాకు ఆ పాత్ర కూడా నచ్చింది. ఇది పెద్ద స్టార్‌ ఉన్న చిత్రం. అందరూ ఎన్టీఆర్‌ కోసమే సినిమా చూడటానికి వస్తారు. నా పాత్ర చిన్నదే అన్న భావన ఏమీ లేదు. చేసినంతవరకు నేను సంతోషంగానే ఉన్నాను. ఈ పాత్ర ఉపయోగపడిందా? లేదా? అని కాదు. ఆ పాత్ర నచ్చి చేశాను.

అందుకే ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రానికి ఒప్పుకొన్నా..

నాకు థ్రిల్లర్‌ చిత్రాలంటే చాలా ఇష్టం. దర్శకుడు సంతోష్‌ ఈ చిత్రం గురించి నాకు మెయిల్‌ చేశారు. ఆ తర్వాత ఓ కాఫీ షాప్‌లో కలిశాం. ఈ సినిమా స్క్రిప్ట్‌ గురించి చెప్పారు. కథ నచ్చింది. వెంటనే ఓకే చేశాను. ఇందులో నా పాత్ర గురించి ఎక్కువగా చెప్పలేను కానీ .. కొంచెం చెప్తాను. సినిమాలో నా పాత్రకు దేవుడంటే చాలా భక్తి. తన ఊరన్నా, తల్లిదండ్రులన్నా చాలా ఇష్టం. సుమంత్‌ పాత్ర నా పాత్రకు పూర్తిగా భిన్నం. అతను అసలు దేవుడిని నమ్మడు. ఇందులో ఆలయాల శాస్త్రవేత్త పాత్రలో సుమంత్‌ కనిపిస్తారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలో నేనెప్పుడూ నటించలేదు. ఇలాంటి పాత్ర కూడా ఎప్పుడూ చేయలేదు.

అదే నిజమైతే సంతోషిస్తా..

నేను అలనాటి నటుడు ఎన్టీ రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘యన్‌టిఆర్’ చిత్రంలో నటిస్తున్నానని వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఇక ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలోనూ నాకు అవకాశం దక్కిందని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే నా అంత సంతోషించేవారు మరొకరుండరు.

సీనియర్‌ అంటే నన్ను కొట్టేస్తారు

సుమంత్‌ నా సీనియర్‌ అంటే ఆయన నన్ను కొట్టేస్తారు. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఆయన నా సీనియర్‌ అనగానే నన్ను అదోలా చూశారు. అనుభవపరంగా ఆయన నాకు సీనియరనే చెప్పాలి. ఆయన సినిమాలు నాకు చాలా నచ్చుతాయి. ఆయన నటన కూడా సర్కిల్డ్‌గా చాలా బాగుంటుంది. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రీకరణ సాఫీగా సాగిపోయింది.

ఈ ప్రశ్న ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు..

తెలుగు అమ్మాయిలను చిత్రపరిశ్రమ ఎక్కువగా పట్టించుకోదు కదా.. ఈ ప్రశ్న నన్ను ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో అడిగారు. కానీ మీకు ఇంతవరకు సమాధానం తెలీకపోవడం గమనార్హం. ‘తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు ఉండవు. తమిళం, కన్నడలో ప్రయత్నించండి..’ ఇలా చాలా మంది నాకు ఉచిత సలహాలు ఇచ్చారు. ‘టాక్సీవాలా’లో ప్రియాంక జవాల్కర్‌ మరాఠీ అమ్మాయే అయినా తెలుగు ప్రాంతంలోనే పెరిగింది. మరి ఆ అమ్మాయికి విజయ్‌ దేవరకొండతో కలిసి నటించే అవకాశం వచ్చింది కదా..? ఇప్పుడు నిర్మాతలు, దర్శకుల ఆలోచనా విధానం మారుతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు