close

ప్రభుత్వంలో చేరే ఆలోచనలేదు

 కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం 
  ఆ 8 చోట్ల మినహా రాష్ట్రవ్యాప్తంగా తెరాసకే మజ్లిస్‌ మద్దతు 
  మహాకూటమి ఈస్టిండియా కంపెనీ-2018 
  మాది బీ, సీ టీమ్‌ కాదు.. హైదరాబాద్‌ టీం 
  మమ్మల్ని ఓడించడానికి చేసే ప్రయత్నాలు పనిచేయవు 
  ‘మీట్‌ ది ప్రెస్‌’లో అసదుద్దీన్‌ ఒవైసీ 

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పునరుద్ఘాటించారు. ఎంఐఎం పోటీచేస్తున్న ఎనిమిది స్థానాల్లో మాత్రమే తెరాస తమకు ప్రత్యర్థి అని చెప్పారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అయితే, ప్రభుత్వంలో చేరే ఆలోచన తమకు లేదని వెల్లడించారు. కాంగ్రెస్‌, తెదేపాలది ప్రజాకూటమి కాదని.. ఈస్టిండియా కంపెనీ-2018 అని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి గెలిస్తే మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు ఆ విషయమిప్పుడు అప్రస్తుతమన్నారు. బుధవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’లో పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు అసదుద్దీన్‌ సమాధానాలిచ్చారు. అవి ఆయన మాటల్లోనే..

చంద్రబాబుకు ఇక్కడి రాజకీయాలా? 
పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలను నియంత్రించలేరు. ఎప్పుడూ పేరు వినని సంస్థలు కూడా సర్వేలు విడుదల చేసి రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. వీటిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.

ప్రాంతీయ పార్టీలే కీలకం.. 
రాహుల్‌గాంధీ చెబుతున్నట్లు మాది బీ, సీ టీమ్‌ కాదు.. మాది హైదరాబాద్‌ టీమ్‌. నన్ను ఒక్కడిని ఎదుర్కోవడానికి అందరూ ఏకమయ్యారు. టీం హైదరాబాద్‌ను ఓడించడానికి రాహుల్‌-అమిత్‌షా, బాబు-యోగి కాంబినేషన్లు ఇక్కడ పనిచేయవు. కాంగ్రెస్‌, భాజపాలు ప్రజల్లో విభజన తీసుకొస్తున్నాయి. 2019లో కేంద్రంలో, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర. కేంద్రంలో ఏర్పడే థర్డ్‌ఫ్రంట్‌, ఫెడరల్‌ ఫ్రంట్‌లలో చేరుతారా? అన్న ప్రశ్నకు ఇప్పుడే ఏమీ చెప్పలేము.

అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది 
పాతబస్తీ మెట్రోకు మేం అడ్డంకులు సృష్టిస్తున్నామనేది అవాస్తవం. అలా అయితే మా నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ వద్ద మెట్రో ఎలా సాధ్యమవుతుంది? మత ప్రాతిపదికన ఓటింగ్‌ జరుగుతుందన్న వాదనను నేను నమ్మను. ఎంఐఎం ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధే ఎన్నికల్లో మమల్ని గెలిపిస్తుంది.

నన్ను విమర్శిస్తే వాళ్ల గ్రాఫ్‌ పెరుగుతుంది 
నా పేరు ప్రస్తావిస్తే భాజపా నాయకులకు శక్తి వస్తుంది. అందుకే తెలంగాణలో నిర్వహించిన ప్రతి సభలో అసదుద్దీన్‌ అనే పేరు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదు. నాయకుల గ్రాఫ్‌ పడిపోతున్న సమయంలో నన్ను విమర్శిస్తే వారి గ్రాఫ్‌ పెరుగుతుంది.. దేశంలో అలాంటి నాయకుడిని నేను ఒక్కడినే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నన్ను అందరూ భాయీజాన్‌(పెద్దన్న) అని పిలుస్తారు.. ఎంఐఎం అందరికీ పెద్దన్న అని ఓ సభలో అక్బరుద్దీన్‌ అంటే దాన్ని రాద్ధాంతం చేశారు. కాంగ్రెస్‌, భాజపాలు ఎప్పుడూ తామే పెద్దన్నలుగా ఉండాలని చూస్తున్నాయి. అలాగైతే మేం కచ్చితంగా పెద్దన్నలమే.

ఇదేనా ‘సబ్‌ కా సాత్‌’ అంటే?

ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, తొమ్మిదేళ్లు పాలించిన తెదేపా మైనార్టీలకు చేసిందేమీ లేదు. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ రంగాల్లో ముస్లింలకు న్యాయమైన వాటా దక్కాలి. నన్ను ఇక్కడి నుంచి తరిమికొట్టాలని ప్రధాని మోదీ, అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌ అంటున్నారు.. మేము ఇక్కడి హక్కుదారులం, పౌరులమన్న విషయం మర్చిపోవొద్దు. జిన్నా ప్రతిపాదనను వ్యతిరేకించిన మేం భారతదేశాన్ని మాతృభూమిగా ఎంచుకుని ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాం. భాజపా ముస్లింలను ద్వితీయ శ్రేణి వారిగా పరిగణిస్తోంది. తలలు నరుకుతామంటూ సవాల్‌ విసురుతున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని ఎలా ప్రచారం చేస్తారు? ఇదేనా ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ అంటే?’
-ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు