close

హైకోర్టు ఆగ్రహం

 కొడంగల్‌ వ్యవహారంలో పోలీసుల తీరును తప్పుపట్టిన ఉన్నత న్యాయస్థానం 
అధికార పార్టీ నాయకుడైతే ఇలాగే వ్యవహరిస్తారా! 
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తీరు ఇలాగేనా ఉండేది? 
అసలు రేవంత్‌ అరెస్టుకు డీజీపీ ఆమోదం ఎక్కడ? 
తేదీ.. సంతకం.. ముద్ర లేకుండానే ఆదేశాలా? 
ఆ లేఖను నమ్మలేం.. ఇప్పుడే సృష్టించినట్లుంది 
పోలీసు లేదా ప్రభుత్వం దీనిని సమర్థించుకోలేవు 
రేవంత్‌రెడ్డి అరెస్టుపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు 
న్యాయస్థానం ఆదేశాలతో స్వయంగా హాజరైన డీజీపీ 

ప్రభుత్వ కార్యాలయం నుంచి తేదీ.. సంతకం.. ముద్ర లేకుండానే ఉత్తర్వులు జారీ చేస్తారా? ఒకవేళ ఇలాంటి ఉత్తర్వులు అందితే ధ్రువీకరించుకోకుండా అరెస్టు చేస్తారా? ఎవరు పంపారు? ఎందుకు పంపారో కూడా తెలుసుకోరా? రేపు ఎవరు లేఖ రాసినా ఎవరినైనా అరెస్టు చేస్తారా? ఇదేనా పోలీసు పనితీరు?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదా? మాట్లాడితే ఇలాగే నిర్బంధిస్తారా? రేవంత్‌రెడ్డి స్థానంలో అధికార పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉండి.. ఇలాగే వ్యాఖ్యానిస్తే మీరు ఇలాగే చర్య తీసుకునేవారా? ప్రజాస్వామ్య ప్రభుత్వ తీరు ఇదేనా? ఈ చర్యను ప్రభుత్వమూ, పోలీసులూ సమర్థించుకోలేరు. ఇది అధికార దుర్వినియోగమే
-ఉమ్మడి హైకోర్టు

 ఈనాడు, హైదరాబాద్‌:రేవంత్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలిని ఉమ్మడి హైకోర్టు మరోసారి తప్పుబట్టింది. ఆయన అరెస్టుపై సమర్పించిన పత్రాలు ఇప్పటికిప్పుడు సృష్టించినట్లున్నాయని వ్యాఖ్యానించింది. ఎస్పీ ఆదేశాలకు డీజీపీ ఆమోదం ఎక్కడని నిలదీసింది. పోలీసులది అధికార దుర్వినియోగమేనని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా నిర్బంధానికి దిగడమేనా? అని ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డి వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనుకుంటే హెచ్చరించాలి, లేదంటే గృహ నిర్బంధంలో ఉంచవచ్చు. అంతేగానీ ఇలా నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేస్తారా? అసలు అరెస్టు చేయాలని ఆదేశించిన అధికారి ఎవరో తెలియాలని స్పష్టంచేసింది. తెరాస ఫిర్యాదుపై ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల్లోనూ సంతకం లేకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. సీఈఓ సంతకం లేకుండా గుమస్తా పంపే లేఖలపై ఇంత తీవ్ర చర్యలు తీసుకుంటారా? అని నిలదీసింది. రేవంత్‌రెడ్డి నిర్బంధానికి నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలు, వికారాబాద్‌ ఎస్పీ, జిల్లా ఎన్నికల అధికారుల మధ్య వ్యవహారాలకు సంబంధించిన పత్రాల్లో కనీసం తేదీ, ప్రభుత్వ ముద్ర, సంతకాలు లేకపోవడం పట్ల న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అక్రమ నిర్బంధానికి సంబంధించి కారణాలు, బాధ్యులు తేలాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ కాగితాలన్నీ సృష్టించినట్లున్నాయి.. 
రేవంత్‌రెడ్డి అక్రమ నిర్బంధం విషయంలో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. రేవంత్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం విడుదల చేశామని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బి.ఎస్‌.ప్రసాద్‌ తెలుపుతూ కొన్ని పత్రాలను సమర్పించారు. సీఎం సభను జరగనివ్వనని రేవంత్‌ ప్రకటించారని, గొడవలు సృష్టించాలని చూశారని.. అందుకే నిర్బంధంలోకి తీసుకున్నామని తెలిపారు. ఆ పత్రాలను పరిశీలించిన ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. వీటిని ఇప్పటికిప్పుడు సృష్టించినట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. తెల్లకాగితంపై ఎలాంటి ముద్ర, సంతకం, తేదీ లేకుండా ఇలాంటి ఉత్తర్వులు ఇస్తారా? అని ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డిలాగే అధికార పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాట్లాడితే ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించింది. నిర్బంధానికి ఎవరు ఆదేశాలిచ్చారో తెలుసుకోవాల్సి ఉందన్న కోర్టు డీజీపీని హాజరుకావాలని ఆదేశించింది. ఆయన ఎన్నికల పనుల్లో ఉన్నారని ఏజీ చెప్పగా.. అయినా హాజరుకావాల్సిందేనని స్పష్టంచేసిన కోర్టు కేసును మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది.

సంతకాల్లేకుండా ఉత్తర్వులిస్తారా? 
న్యాయస్థానం ఆదేశాల మేరకు మధ్యాహ్నం డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. మొదట ఎస్పీకి ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చే ఏ ఉత్తర్వుకైనా ముద్ర, తేదీ, సంతకం ఉంటాయి కదా.. ఇక్కడ అవేవీ లేవేమిటని నిలదీసింది. ఎస్పీ ఇచ్చిన ఉత్తర్వులకు డీజీపీగా మీ ఆమోదం ఎక్కడని ప్రశ్నించింది. ఇలాంటివి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని వ్యాఖ్యానించింది. అంతర్గత మెమోల్లోనే సంతకాలు ఉంటాయని, మిగిలినవైతే ఇలాగే సమాచారం పంపుతామని డీజీపీ తెలిపారు. మరి అలాంటి మెమోను అధికారికమైనదని ఎలా భావించాలి; ఎవరైనా ఇలాంటి లేఖను పంపితే చర్య తీసుకుంటారా? ఎక్కడి నుంచి వచ్చిందో ధ్రువీకరించుకోరా? అని ప్రశ్నించింది. పోలీసు పనితీరు ఇదేనా అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

సీఈఓ సంతకమూ అంతేనా? 
డీజీపీకి సీఈవో పంపిన లేఖపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఈఓ సంతకం లేకుండా సెక్షన్‌ ఆఫీసర్‌ పంపిన లేఖపై డీజీపీగా ఎలా స్పందిస్తారని ప్రశ్నించింది. ఇందుకు డీజీపీ సమాధానమిస్తూ ఈనెల 3న జిల్లా ఎన్నికల అధికారితో ఎస్పీ సమావేశమైనప్పుడు అన్నీ చర్చించారన్నారు. సభను అడ్డుకుంటామని రేవంత్‌రెడ్డి ప్రకటిస్తే పిలిపించి హెచ్చరించరా? అలాకాకుండా అర్ధరాత్రి నిర్బంధంలోకి తీసుకోవడమేమిటి? అని కోర్టు ప్రశ్నించింది. ఈ చర్యను ప్రభుత్వంకానీ, పోలీసులు కాని సమర్థించుకోజాలరని పేర్కొంది. ఏ అధికారి ఆదేశాలిచ్చారో చెప్పాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ దశలో ఏజీ జోక్యం చేసుకుంటూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి డీజీపీ ఆదేశించారనగా.. ధర్మాసనం స్పందిస్తూ ఏమిటా పరిస్థితులని ఎదురు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేసింది.

త్వరలో వివరాలిస్తామన్న ఏజీ 
తేదీ లేనంత మాత్రాన ప్రభుత్వంపై విశ్వాసం సడలించరాదని, గడువిస్తే నిర్బంధానికి దారి తీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు అందజేస్తామని ఏజీ అభ్యర్థించారు. దీంతో ఈనెల 12, 13 తేదీల్లోపు కౌంటరు అందజేయాలని చెబుతూ హైకోర్టు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు