close

సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యం 

సీపీఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నేతల పిలుపు 

ఈనాడు, హైదరాబాద్‌: మాయా కూటమితో తెరాస, మహా కూటమితో కాంగ్రెస్‌ ఎన్నికల్లో ప్రజల ముందుకొస్తున్నాయనీ, ఆ రెండింటినీ ప్రజలు తరిమికొట్టాలని సీపీఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యంతో వస్తున్న బహుజన వామపక్ష కూటమి(బీఎల్‌ఎఫ్‌)ని అక్కున చేర్చుకోవాలని కోరారు. ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ ప్రకటించని సరికొత్త రాజకీయ విధానాలతో బీఎల్‌ఎఫ్‌ ప్రజల ముందుకు వస్తుందన్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో బుధవారం ప్రారంభమైన సమావేశానికి సీతారాములు, జ్యోతి, మిడియం బాబూరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ‘‘గత నాలుగున్నర ఏళ్లల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను విధ్వంసం చేసింది. ఇలాంటి విధ్వంసకర శక్తుల్ని అధికారంలోంచి తొలగించకపోతే మరింత తీవ్ర ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. హిందూత్వ, సంఘ్‌పరివార్‌ శక్తుల్ని దెబ్బతీయడానికి రానున్న ఎన్నికలు ఓ మంచి అవకాశం. దేశాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తానని 2014లో అధికారంలోకి వచ్చిన భాజపా ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ప్రజాస్వామ్యాన్ని బలపర్చకపోగా.. ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసి ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థకు విలువ లేకుండా చేసింది. నోట్ల రద్దుతో అవినీతి అంతమవుతుందని ప్రకటించినా అది ఏ మాత్రం తగ్గలేదు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైంది. రైతులు, అసంఘటిత కార్మికులు, చిరువ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఉపాధి అవకాశాలు అడుగంటాయి. జీఎస్టీ అమలులోనూ తీవ్రమైన లోపాలు ఎదురయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఏడాదికి కోటి ఉద్యోగాలన్న మాట అట‌కెక్కింది. రక్షణ రంగంలోకి కూడా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కేంద్రం విఫలమైంది. అవినీతి తాండవిస్తోంది. దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కేంద్రంలో భాజపాను, రాష్ట్రంలో తెరాసను ఓడించడమే మన ప్రధాన కర్తవ్యం. అలా అని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే సమస్యే లేదు’’ అని రాఘవులు తెలిపారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం: తమ్మినేని 
ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే వాటిని సమర్థంగా తిప్పిగొట్టాల్సింది పోయి ముందుగా ఎన్నికలకు వెళ్లానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ‘‘పార్లమెంటుకు, శాసనసభకు ఒకేసారి ఎన్నికలకు వెళ్లకూడదనే దురుద్దేశపూరిత వ్యూహంతోనే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నానని చెబుతున్నా.. పాతబస్తీలో ఎంఐఎంతో, దిల్లీలో భాజపాతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందుకే తెరాస ఒక మాయాకూటమి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమికి స్పష్టమైన విధానం లేదు. ప్రజల బతుకులు బాగుపర్చే ప్రణాళికలు రూపొందించడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదు. కుల, మతోన్మాదాన్ని భాజపా రెచ్చగొడుతోంది. ఈ ఎన్నికలు ధన రాజకీయాలకూ, జన రాజకీయాలకూ మధ్య జరుగుతున్న పోరు’’ అని తమ్మినేని అన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎస్‌.వీరయ్య, చుక్క రాములు,  నర్సింహారెడ్డి, బి.వెంకట్‌, సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు