close

మోసాల కేసీఆర్‌ 

ఎన్నికల హామీలేవీ నెరవేర్చలేదు 
దళితుల కుటుంబాలకు సూది మోపినంత స్థలమైనా ఇవ్వలేదు 
2 లక్షలమందికి ఇళ్లిస్తామన్నారు..  అయిదు వేలూ కట్టలేదు.. 
రాష్ట్రంలో 2 లక్షల ఖాళీలున్నాయి 
ఒక్క లెక్చరర్‌ పోస్టునూ భర్తీచేయలేదు 
మాకొక అవకాశం ఇవ్వండి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం 
చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసినా తెరాసకు ప్రత్యామ్నాయం కాలేరు 
కరీంనగర్‌ బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 
ఈనాడు - కరీంనగర్‌

లోక్‌సభతో పాటు కాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలపై కోట్లాది రూపాయల భారం మోపుతున్నారు. లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్‌కు మోదీని చూడగానే భయం పుడుతుంది. అందుకే ఎన్నికలను ముందుకు తీసుకువచ్చారు.

దేశప్రధాని నరేంద్రమోదీని చూస్తే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని, అందుకే లోక్‌సభతో పాటు కాకుండా ముందస్తుగా శాసనసభ ఎన్నికలకు వచ్చారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆయన తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి దళితుణ్ని సీఎం చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు లేదని.. తన కొడుకునో, కుమార్తెనో సీఎం చేయాలని భావిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కలిసినా తెరాసకు ప్రత్యామ్నాయం కాలేదని, తెరాసతో పాటు వీరెవరూ ఒవైసీతో కొట్లాడలేరని స్పష్టంచేశారు. ఒవైసీ బారి నుంచి తెలంగాణను విముక్తి చేయాలని, మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్‌బాబా అండ్‌ కంపెనీ, తెదేపా, తెరాస, సీపీఎం, సీపీఐ అన్ని పార్టీలు దేశాన్ని విభజించాలని చూస్తున్నాయని, మోదీ మాత్రం దేశాన్ని నిర్మించే పనిలో ఉన్నారని తెలిపారు. దేశాన్ని విభజించేవారి వైపు ఉంటారా? లేదా దేశాన్ని నిర్మించే వారివైపు ఉంటారా? అని ప్రజలను ప్రశ్నించారు. బుధవారమిక్కడ అంబేడ్కర్‌ మైదానంలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. మోదీ నాయకత్వంలో భాజపాకు ఒకసారి అవకాశమిస్తే ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు.

మీ తరువాతైనా చేస్తారా? 
‘‘అధికారంలోకి వస్తే దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని గత ఎన్నికల్లో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దళితుణ్ని గద్దెనెక్కించలేదు. ఇప్పుడు కూడా చేయాలనుకోవడం లేదు. మీ తరువాత దళితుణ్ని సీఎం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నా. అప్పటికీ, ఇప్పటికీ ఆయనకు సీఎం చేయాలన్న ఉద్దేశం లేదు. కుమార్తెనో, కుమారుణ్నో సీఎం చేయాలని మాత్రమే అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయలేదు. దళితులకు మూడెకరాల భూమి మూలనపడింది. రాష్ట్రంలో 7 లక్షల మంది పేద దళిత కుటుంబాలకు సూది మోపే జాగాను కూడా ఇవ్వలేదు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పి భర్తీ చేయలేదు. డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు, చప్రాసీలు ఇలా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

‘‘తెలంగాణలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సరైనదేనా? వాటికి మీరంతా ఒప్పుకుంటారా? రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తొలగించి ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎవరి కోటాను తగ్గిస్తారో చెప్పండి’’

ఇక్కడకు వస్తే బుద్ధి చెబుతారు.. 
తెలంగాణ కోసం 1200 మంది యువత బలిదానం చేశారు. తెలంగాణ వచ్చింది. కేసీఆర్‌ సీఎం అయ్యారు. అమరవీరుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ 800 కుటుంబాలు ఉద్యోగాల కోసం చూస్తున్నాయి. వారికి కొలువులు ఇవ్వకుండా మోసం చేశారు. కేసీఆర్‌.. ఈ మైదానంలోకి రండి. అమరవీరుల కుటుంబాలు, యువకులు మీకు బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో 2 లక్షలమంది పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇప్పటివరకు కనీసం 5,000 కూడా కట్టించలేదు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం మోదీ పంపించిన నిధులను ఖర్చుచేయలేదు.

4500 మంది రైతుల ఆత్మహత్య.. 
నిధులిచ్చినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. రైతులకు సాగునీరు అందలేదు. మిషన్‌ కాకతీయ కింద రూ. 1200 కోట్లు ఖర్చుచేశారు. ఈ ప్రాజెక్టుతో చెరువులు శుద్ధికాకపోగా.. ఇంకా పాడుచేశారు. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాలను తీసుకుంటే అందులో తెలంగాణ కూడా ఉంటుంది. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్‌ ఇచ్చిన 150 హామీల వివరాలన్నీ ఉన్నాయి. ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. నాలుగున్నరేళ్లలో ఒక్క లెక్చరర్‌ పోస్టు భర్తీ చేయలేదు. విద్యార్థులే పాఠాలను బోధించుకుంటున్నారు.

‘‘తెలంగాణలో తెరాసకు కాంగ్రెస్‌ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. చంద్రబాబుతో కలిసినా అది సాధ్యం కాదు. ఇక రాహుల్‌బాబా నేతృత్వంలో ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దేశంలో దుర్భిణీ వేసి చూసినా ఆ పార్టీ కనిపించడం లేదు. భాజపా మినహా వీరెవరూ ఒవైసీకి వ్యతిరేకంటా పోరాటం చేయరు.’’

అధికారంలోకి వస్తే ‘విమోచన’ 
రజాకార్ల దురాగతాలను తెలంగాణ ప్రజలు మరచిపోరు. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని ఎందుకు చేయడం లేదు? ముస్లిం ఓటు బ్యాంకు భయంతో కేసీఆర్‌.. కనీసం అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించకుండా హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని బంద్‌ చేశారు. రజాకార్లపై పోరాడిన తెలంగాణ ప్రజలను మరిచిపోయారు. తెలంగాణలో భాజపాకు ఒక అవకాశాన్ని ఇస్తే.. విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఇక కాంగ్రెస్‌ చరిత్ర ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. ఇటీవల మాజీ ప్రధాని అటల్‌జీ మరణిస్తే అంతిమ సంస్కారంలో ప్రధాని పాల్గొని ఘనంగా నిర్వహించారు. అదే తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చనిపోతే.. దిల్లీలో అంత్యక్రియలు చేయలేదు. అప్పట్లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. అంతిమ సంస్కారం అక్కడ చేయనీయలేదు. కనీసం పార్టీ కార్యాలయానికి తీసుకురానివ్వలేదు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నిలదీయాలి.

రాజకీయాల కోసం పేదలకు అన్యాయం.. 
రాజకీయాల కోసం తెలంగాణ పేదలకు కేసీఆర్‌ అన్యాయం చేశారు. తెలంగాణ పేదలకు రూ.5 లక్షల వరకు సహాయం చేసేందుకు వీలుగా ఆయుష్మాన్‌భవ పేరిట మోదీ పథకం తీసుకువచ్చారు. కానీ ఒక్క పేదకూ ఈ సహాయం అందదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఆ పథకంలో చేరలేదు. తెలంగాణ ప్రజలకు పైసలు కావాలా? వద్దా? ఈ పథకం అమల్లోకి వస్తే మోదీ అందరికీ మరింత ప్రియమైన వ్యక్తి అవుతారన్న ఉద్దేశంతో పథకం లబ్ధి అందకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంది. యూపీఏ సర్కారు తెలంగాణకు 13వ ఆర్థిక సంఘం కింద రూ. 16,597 కోట్లు ఇస్తే, మోదీ సర్కారు 14వ ఆర్థిక సంఘం కింద రూ. 1,15,900 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పాటు వివిధ ప్రాజెక్టుల కింద మరో రూ. 1,15,000 కోట్లు ఇచ్చాం.

‘‘కేసీఆర్‌ కుటుంబం, రాహుల్‌గాంధీ అండ్‌ కంపెనీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. వీరంతా దేశాన్ని విభజించే (బ్రేకింగ్‌ ఇండియా) పనిలో ఉన్నారు. మోదీ దేశాన్ని నిర్మించే (మేకిన్‌ ఇండియా) ప్రక్రియలో ఉన్నారు. దేశాన్ని విభజించే వారితో ఉంటారా? నిర్మించే వారితో ఉంటారా? ప్రజలు నిర్ణయించుకోవాలి.’’

కాంగ్రెస్‌ ‘కనిపించుట లేదు’ 
దేశంలోకి వచ్చిన అక్రమ చొరబాటుదారులు ఇక్కడే ఉండాలని రాహుల్‌బాబా కంపెనీలు, ఇతర పార్టీలు కోరుకుంటున్నాయి. వీరిని ఇక్కడే ఉండేలా అనుమతించాలా..? ప్రజలు జవాబివ్వాలి. దాదాపు 40 లక్షలమంది చొరబాటుదారులను వెనక్కు పంపించేందుకు ప్రయత్నిస్తుంటే ఆ పార్టీలు అడ్డుకుంటున్నాయి. 2019లో మోదీ సర్కారు వస్తే అక్రమ చొరబాట్లు జరగకుండా చూస్తాం. అలాంటి వారిని వెంటనే వెనక్కు పంపిస్తాం. 2018లో తెరాసను గద్దెదించడం ఖాయం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

 

ఇవేం తీర్పులు! 
హిందూధర్మంపై ప్రభావం చూపుతాయి 
అమిత్‌షా వద్ద సాధుసంతుల ఆవేదన 

ఈనాడు, హైదరాబాద్‌: స్వలింగ సంపర్కం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, వివాహేతర సంబంధాలు వంటి అంశాలపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు హిందూమత విశ్వాసాలు, ధర్మాలపై ప్రభావం చూపేలా ఉన్నాయంటూ సాధువులు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయంలో అయినా భారత పౌరులందరికీ ఒకే చట్టం అమలవ్వాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌ కాచిగూడలోని శ్యాంబాబా మందిర్‌ను సందర్శించిన అమిత్‌షా అక్కడి సాధుసంతులతో సమావేశమయ్యారు. మతమార్పిడులను నిరోధించాలని.. ఆలయాలు, ఆశ్రమాల ఆస్తుల ఆక్రమణలను అడ్డుకోడానికి తగిన చట్టాలు తీసుకురావాలని వారు కోరారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అమిత్‌షా సాధువులకు హామీ ఇచ్చారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు