close

అతితీవ్ర తుపానుగా తిత్లీ 

ఈనాడు, విశాఖపట్నం, శ్రీకాకుళం, గోపాలపూర్‌, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తిత్లీ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. అది మరింత బలపడి పెనుతుపానుగా మారనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయం అవసరమైన వారి కోసం అత్యవసర నంబరుగా 1100 అధికారులు ఏర్పాటు చేశారు. ఒడిశాలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడ్రాఫ్‌, కోస్టుగార్డుల సేవలను వినియోగిస్తున్నారు. తీరప్రాంత ప్రజలను పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తిత్లీ తుపాను బుధవారం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగానూ మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. తుపాను వాయవ్యదిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వెల్లడించారు.  ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని..ఒక్కోసారి అత్యధిక వేగం 165 కిలోమీటర్లకు చేరుతుందని తెలిపారు. తిత్లీ ప్రస్తుత గమనాన్ని మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గోపాల్‌పూర్‌, కళింగపట్నం ప్రాంతాల మధ్య గురువారం ఉదయం 5.30-11.30 మధ్య తీరం దాటే అవకాశం ఉందని గోపాలపూర్‌ డాప్లార్‌ రాడార్‌ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. దీని ప్రభావంతో ఒడిశాలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. సముద్రంలో అలలు 3 నుంచి 4.4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడతాయని, తీరప్రాంతాల్లోని వారు నివాసాల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నౌకాశ్రయాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. కళింగపట్నం, భీమిలి పోర్టుల్లో అతిపెద్ద ప్రమాద హెచ్చరిక అయిన ‘10వ నంబరు’ను, విశాఖపట్నం, గంగవరం నౌకాశ్రయాల్లో 8వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

అప్రమత్తమైన ఒడిశా 
తీరాన్ని దాటిన తరువాత తిత్లీ ఉత్తరకోస్తా మీదుగా పశ్చిమ్‌బంగకు చేరుకోనుందని ఐఎండీ అధికారి ఉమాశంకర్‌దాస్‌ తెలిపారు. దీని ప్రభావంతో సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ పరిస్థితి సమీక్షించి తుపాను ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలని, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. భద్రతా దళాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడ్రాఫ్‌, కోస్టుగార్డ్‌, గోపాలపూర్‌ ఆర్మీ జవాన్లను అత్యవసర సేవలకు వినియోగిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఆదిత్యప్రసాద్‌ పాఢి బుధవారం విలేకర్లకు చెప్పారు.

సిక్కోలులో అప్రమత్తం 
భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌.కు చెందిన ఒక బృందం శ్రీకాకుళం జిల్లాకు చేరింది. రెండో బృందం కూడా టెక్కలి ప్రాంతానికి వెళ్లనుంది. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

 

 

విమాన సర్వీసులకు ఆటంకం!

విశాఖపట్నం, న్యూస్‌టుడే:  తిత్లీ తుపాను కారణంగా వీస్తున్న బలమైన గాలులు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బుధవారం  ఓ విమానం దిగకుండానే వెళ్లిపోగా.. మిగిలినవి ఆలస్యంగా నడిచాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు