close

ఓటర్ల జాబితాకు ఓకే 

12న ప్రచురణకు హైకోర్టు అనుమతి 
బూత్‌ల వారీగా పేర్కొనాలని ఈసీకి స్పష్టీకరణ 
ఈనెల 5నాటి నిలుపుదల ఉత్తర్వులు ఎత్తివేత 
అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు వెసులుబాటు 
విచారణ రేపటికి వాయిదా.. 
నకిలీ ఓట్లు ప్రజాస్వామ్యానికి చేటని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఓటర్ల తుది జాబితా వెల్లడికి మార్గం సుగమమయ్యింది. ఈనెల 12న జాబితాను ప్రచురించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) హైకోర్టు అనుమతిచ్చింది. దీనికి సంబంధించి ఈనెల 5న జారీ చేసిన నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేసింది. బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలని స్పష్టం చేసింది. తప్పుల సవరణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించింది. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే రోజు(తేదీ) మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటర్ల జాబితాపై వచ్చే అభ్యంతరాల్ని పరిష్కరించాలని తేల్చిచెప్పింది. జాబితాలో చేర్పులు, తొలగింపులకు అనుసరిస్తున్న విధివిధానాలు, మార్గదర్శకాలు, షెడ్యూల్‌ వివరాల్ని సమర్పించాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక వివరాల్ని ప్రమాణపత్రం రూపంలో సమర్పించాలని ఈసీఐని ఆదేశించింది. విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం.. బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఓటర్ల జాబితాలో భారీగా నకిలీ (డూప్లికేట్‌) ఓట్లు ఉన్నాయని, అర్హులను తొలగించారని పేర్కొంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఈనెల 5న విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత (ఈనెల 10) వరకు ఓటర్ల జాబితాను ప్రకటించొద్దని  ఆదేశించింది. దీనిలో భాగంగానే బుధవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపిస్తూ.. అలిపిరి వద్ద ఏపీ సీఎం చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేసినప్పుడు.. సానుభూతి కలిసివస్తుందన్న అంచనాతో ముందస్తు ఎన్నికల కోసం సిఫారసు చేశారన్నారు. ఓటర్ల సవరణ ప్రక్రియ జరుగుతున్నందున అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ లింగ్డో అందుకు నిరాకరించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని మొత్తం ఓట్లలో 30శాతం వరకు అనర్హమైనవి ఉన్నాయన్నారు. 68 లక్షలు ఓట్లు నకిలీ (డూప్లికేట్‌)వని తెలిపారు. ఈ అవకతవకలను ఈసీఐ దృష్టికి తీసుకెళ్లగా నిజమేనని ఒప్పుకున్నప్పటికీ ఆ లోపాల్ని సవరించేందుకు చర్యలు తీసుకోలేదన్నారు. నకిలీ ఓట్లు ఉన్న మాట నిజమేనంటూ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్‌ అంగీకరించిన అంశంపై ‘ఈనాడు’ హైదరాబాద్‌ మినీ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. ఒకే ఇంటి నంబరులో వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. దీంతో ధర్మాసనం.. ఓటరు నమోదు, సవరణ, తదితర అంశాల్లో దరఖాస్తు నమూనాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎన్నికల్లో పారదర్శకతే ప్రామాణికమని స్పష్టంచేసింది.

పాత జాబితా ఆధారంగానే ఆరోపణలు 
ఈసీఐ తరఫున న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో తప్పులను సవరించామని, ఆ విషయాన్ని తెలుసుకోకుండా పిటిషనర్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారని వివరించారు. పాత ఓటర్ల జాబితాపై ఆధారపడి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించాక అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ 33.14 లక్షల దరఖాస్తులు రాగా ముంగళవారం(9వతేదీ)నాటికి 799 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. వాటినీ పరిష్కరిస్తామన్నారు. న్యాయస్థానం తదుపరి ఉత్తర్వుల ఆధారంగా 12న తుది జాబితాను ప్రచురించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

వారు వసతి గృహ విద్యార్థులు 
ఒకే ఇంటి నంబరులో వందల సంఖ్యలో ఓటర్లు ఉండటంపై న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ స్పష్టత ఇస్తూ.. ఒకే వసతి గృహంలో వందల మంది విద్యార్థులున్నప్పుడు వారికి ఓటు హక్కు కల్పించామన్నారు. పాతబస్తీలో ఓ గృహ సముదాయానికి ఒకే ఇంటి నంబరు ఉండడంతో ఓటు హక్కు కల్పించామన్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియని, నామినేషన్‌ దాఖలు చేసే చివరి తేదీ వరకు ఆ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. జాబితాలో తప్పులను సవరించే అవకాశం నామినేషన్‌ ఉపసంహరణ రోజు వరకూ ఉన్నందున తుదిజాబితాను ప్రచురించవచ్చని పేర్కొంది. వ్యాజ్యాన్ని పెండింగ్‌లో ఉంచుతామని వ్యాఖ్యానించింది. అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటిపై దృష్టిసారించాల్సిన బాధ్యతఈసీఐపై ఉందని పేర్కొంది. ఓటర్ల జాబితాపై ఈ నెల 5న తామిచ్చిన నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు