close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిధులు మళ్లించి... డిపాజిట్లు కొల్లగొట్టి 

156 డొల్ల సంస్థలను తెరిచిన అగ్రిగోల్డ్‌ యాజమాన్యం 
అన్నింటిలోనూ కుటుంబసభ్యులు, బంధువులే డైరెక్టర్లు 
సంబంధం లేని వ్యాపారాల్లోకి రూ.942 కోట్ల మళ్లింపు 
ఐటీ, సెబీ ముందస్తు హెచ్చరికలు బేఖాతరు 
అగ్రిగోల్డ్‌కు సంబంధించి 14 కేసుల్లో సీఐడీ అభియోగపత్రాలు 
ఈనాడు - అమరావతి 

వివిధ ఆకర్షణీయ పథకాల పేరుతో డిపాజిట్‌దారుల నుంచి సేకరించిన సొమ్మును సంబంధం లేని వ్యాపారాల్లోకి మళ్లించారు. డైరెక్టర్ల కుటుంబసభ్యులు, బంధువులకు కమీషన్ల రూపంలో భారీ మొత్తాలను కట్టబెట్టారు. సంస్థ సొమ్మును కొందరు డైరెక్టర్లు తమ వ్యక్తిగత ఖాతాల్లో వేసుకుని సందేహాస్పద చెల్లింపులకు తెరలేపారు. భూముల విలువను వాస్తవ ధర కన్నా అనేక రెట్లు ఎక్కువగా చూపి అనుచిత లబ్ధి పొందారు. ఇలాంటి మోసపూరిత చర్యలతోనే అగ్రిగోల్డ్‌ యాజమాన్యం భారీ కుంభకోణానికి తెరలేపిందని సీఐడీ నిగ్గు తేల్చింది. ఆ సంస్థపై పలు జిల్లాల్లో నమోదైన 15 కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. మూడున్నరేళ్లుగా దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు ఒక్కటి మినహా మిగతా అన్ని కేసుల్లోనూ అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్‌ నాలుగో తేదీ నుంచి ఈనెల నాలుగో తేదీ మధ్య ఆయా కేసులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో 14 అభియోగపత్రాలు దాఖలు చేశారు. మొత్తం నాలుగు సంస్థలు, 22 మందిని ఈ కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారు.

ప్రధాన అభియోగాలివి. 
లేని ప్లాట్లకు డిపాజిట్ల సేకరణ 
స్థిరాస్తి వ్యాపారం నిర్వహించిన అగ్రిగోల్డ్‌ సంస్థ.. గోల్డ్‌లైన్‌, గ్రీన్‌ షైన్‌, టాప్‌లైన్‌, గ్రీన్‌వేస్‌, సిల్వర్‌లైన్‌ వంటి పథకాల పేరిట 2014 నవంబరు 30 నాటికి మొత్తం 18,57,249 ప్లాట్లకు ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించింది. వాస్తవంగా ఆ సమయానికి సంస్థ వద్ద 5,76,599 ప్లాట్లే ఉన్నాయి.

156 డొల్ల సంస్థలు.. 
పన్నుల ఎగవేత, నిధుల మళ్లింపు, భూపరిమితి చట్టం నుంచి రక్షణ కోసం అగ్రిగోల్డ్‌ యాజమాన్యం 156 డొల్ల సంస్థలను నెలకొల్పింది. అగ్రిగోల్డ్‌ ఫార్మ్‌ ఎస్టేట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అగ్రిగోల్డ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డ్రీమ్‌ల్యాండ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అగ్రిగోల్డ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు అనుబంధంగా ఈ సంస్థలను ఏర్పాటుచేసింది. వీటన్నింటిలోనూ తమ కుటుంబసభ్యులు, బంధువులనే డైరెక్టర్లుగా పెట్టుకుంది. వీటిని అడ్డుపెట్టుకుని స్థిరాస్తి వ్యాపారంతో సంబంధం లేని రంగాల్లోకి మొత్తం రూ.942.96 కోట్లు (ప్రత్యక్షంగా రూ.244.48 కోట్లు, పరోక్షంగా రూ.698.47 కోట్లు) మళ్లించింది. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు తమ భార్యలు, సమీప బంధువులకు కమీషన్ల రూపంలో రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను రూ.11.15కోట్ల భారీ మొత్తాలను కట్టబెట్టారు. ఇదే తరహాలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైరెక్టర్లు కమీషన్‌ రూపంలో రూ.2.23 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. ఎలాంటి వివరాలు పొందుపరచకుండానే అగ్రిగోల్డ్‌ సంస్థ నిధులను డైరెక్టర్లు తరచూ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.

అగ్రిగోల్డ్‌ మోసం విలువ ఇది 
దేశవ్యాప్తంగా 
డిపాజిట్‌దారుల సంఖ్య: 19,18,865 
క్లెయిమ్‌ల సంఖ్య: 32,02,628 
అగ్రిగోల్డ్‌ వసూలు చేసిన మొత్తం: రూ.6,380.48 కోట్లు

ఏయే రాష్ట్రాల్లో మోసం చేశారంటే? 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఒడిశా

బ్యాంకులకు అగ్రిగోల్డ్‌ బకాయిలు: రూ.548.04 కోట్లు (2014 నవంబరునాటికి) ప్రస్తుతం అవి రూ.613.92 కోట్లకు చేరాయి. 
*  మోసం బయటపడిందిలా..: కాలపరిమితి ముగిసిన డిపాజిట్‌దారులకు రూ.700 కోట్లకు ఇచ్చిన పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

నిందితులైన సంస్థలు.. వ్యక్తులు 
* సంస్థలు: అగ్రిగోల్డ్‌ ఫార్మ్‌ ఎస్టేట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అగ్రిగోల్డ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డ్రీమ్‌ల్యాండ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అగ్రిగోల్డ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (వరుసగా ఏ1-ఏ4 వరకూ)

వ్యక్తులు: అవ్వా వెంకటరామారావు, అవ్వా హేమసుందర వరప్రసాద్‌, అవ్వా వెంకటశేషు నారాయణరావు, తంగిరాల సుందర్‌కుమార్‌, శివరాజు నరసింహారావు, ఇమ్మడి సదాశివవరప్రసాద్‌, కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, పటన్‌లాల్‌ అహ్మద్‌ఖాన్‌, సవడం శ్రీనివాస్‌, డొప్ప రామ్మోహన్‌రావు, అవ్వా సీతారామారావు, అవ్వా సత్యవెంకటేశ్వరరావు, అవ్వా ఉదయ్‌భాస్కర్‌రావు, అవ్వా వెంకట శివరామకృష్ణ, అవ్వా వెంకట సుబ్రమణ్యేశ్వరశర్మ, మోగంటి భానూజీరావు, బెజవాడ వీర వెంకటబాబు, కాజ కిషోర్‌, చిన్నప్ప శ్రీనివాసరెడ్డి, జేఎస్‌ఆర్‌ దుర్గాప్రసాద్‌, వావిలాల ఉమాపతి (వరుసగా ఏ5-ఏ26 వరకూ)

ఐటీ, సెబీ ముందే హెచ్చరించినా 
అగ్రిగోల్డ్‌ ఫార్మ్‌ ఎస్టేట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన ఖాతాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఐటీ సెటిల్‌మెంట్‌ కమిషన్‌ ఈ కుంభకోణం వెలుగుచూడటానికి కొన్నేళ్లముందే హెచ్చరించింది. సంస్థ సమర్పించిన వివరాల్లో స్థిరత్వం లేదని, యాజమాన్యం అభిమతం మేరకు లెక్కలు సిద్ధం చేసినట్లు అనిపిస్తోందని పేర్కొంది. 
అగ్రిగోల్డ్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో చెప్పాలని సెబీ 2012లోనే ఆ సంస్థను కోరింది. తదుపరి విచారణలో అగ్రిగోల్డ్‌ సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో కొత్తగా డిపాజిట్లు సేకరించొద్దంటూ సెబీ ఆ సంస్థను 2015 ఫిబ్రవరిలో ఆదేశించింది.

మరిన్ని

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

రుచులు