close

ప్ర‌త్యేక క‌థ‌నం

‘మీ టూ’ ప్రకంపనలు 

మౌనం వీడి ఉద్యమిస్తున్న నటీమణులు 
తనుశ్రీ బాటలోనే కంగన, చిన్మయి 
లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ధైర్యంగా బయటకొస్తున్న మహిళలు 
ఆరోపణల సుడిలో మీడియా సంస్థలు 

హిళలు మౌనం వీడి.. సామాజిక మాధ్యమ వేదికల మీదికి వచ్చి.. తమపై జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై అంతర్జాతీయంగా ఆరంభించిన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు మన దేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో ఆరంభమైన ఈ ‘మీ టూ’ సంచలనం చలనచిత్ర పరిశ్రమను పట్టి కుదిపేస్తోంది. మరోవైపు ఇది దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలనూ ఉక్కిరిబిక్కిరి చేయటం ఆరంభించింది. తనుశ్రీ ఆరంభించిన ట్విటర్‌ సందేశ పరంపరను చూసి మరికొంతమంది నటీమణులు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టటం మొదలుపెట్టారు. ‘క్వీన్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ఉత్తరాది నుంచి ‘మీ టూ’ ఉద్యమంలో దూకితే దక్షిణాదికి చెందిన గాయని చిన్మయి, నటి ఆషా శైనీ తామూ లైంగికంగా వేధింపులకు గురయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పత్రిక ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’లో పని చేసిన ఒక మహిళా ఉద్యోగి తమ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు తనను లైంగికంగా వేధించాడని వెల్లడించటంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం.

2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌ ’ చిత్రం షూటింగ్‌ సమయంలో నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో బాలీవుడ్‌ ప్రముఖుల్లో కొందరు తనుశ్రీకి మద్దతుగా, కొందరు నానాకు మద్దతుగా వ్యాఖ్యానాలు చేయటం ఆరంభించటంతో పరిస్థితి మరింతగా వేడెక్కింది. గతంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో బయటపెడుతూ ఆరంభమైన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాదు, వివిధ మీడియా సంస్థలనూ చేరుకుంది. ‘మీ టూ’ నేపథ్యంలో కొందరు నటులు బాహాటంగా, మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.

ఈ వ్యవహారంలో కంగనను నమ్మలేమంటూ సోనమ్‌ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. తనుశ్రీ తనపై చేసిన ఆరోపణలను నానాపటేకర్‌ తోసిపుచ్చారు. ఆ చిత్ర నిర్మాత సమీ సిద్దిఖీ ఆయనకు మద్దతుగా నిలిచారు. తనుశ్రీ చెబుతున్నట్టు షూటింగ్‌ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదంటూ ఆ చిత్ర దర్శకుడు రాకేష్‌ సారంగ్‌.. ‘‘ఆమె నానాపటేకర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సెట్లో ఎంతోమంది ఉంటారు. ఆమె చెప్పినట్టు నానాకు వేధించే ఉద్దేశం ఉంటే అందరి ముందు ఎందుకు చేస్తారు?’’ అని ప్రశ్నించారు.

కంగనా... సోనమ్‌ మాటల యుద్ధం 
‘క్వీన్‌’ చిత్ర దర్శకుడు వికాస్‌ భల్‌ తనను లైంగికంగా వేధించాడంటూ కంగనా రనౌత్‌ చేసిన ఆరోపణలు మరికొంతమందిని ఈ వివాదంలోకి లాగాయి. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సోనమ్‌ మాట్లాడుతూ ‘‘తనపై జరిగిన లైంగిక వేధింపులను తనుశ్రీ ధైర్యంగా బయటపెట్టింది’’ అంటూనే, వికాస్‌ భల్‌పై కంగనా చేసిన ఆరోపణలను మాత్రం తోసిపుచ్చింది. ‘‘కంగనా చాలా విషయాలు చెబుతుంటారు. ప్రతి దాన్ని సీరియస్‌గా తీసుకోలేం. అక్కడ ఏం జరిగిందో నాకూ తెలియదు. తనకు జరిగిన అన్యాయాన్ని కంగనా ధైర్యంగా చెప్పడం అభినందనీయమే. అది నిజమైతే వేధింపులకు పాల్పడినవాళ్లు శిక్ష అనుభవిస్తారు’’ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా మాటలు సీరియస్‌గా తీసుకోలేమనటంలో అర్థమేంటి? లైగింక వేధింపులకు గురైన బాధితులందరిలాగే నాకు జరిగిన అన్యాయాన్నీ చెప్పుకున్నాను. తప్పో.. ఒప్పో నిర్ణయించడానికి ఆమె ఎవరు? ఇలాంటి వాళ్లకు నా గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫాంటమ్‌ ఫిలిమ్స్‌లో ‘క్వీన్‌’ చిత్రం తెరకెక్కిన సమయంలో ఆ చిత్ర దర్శకుడు వికాస్‌ భల్‌ తనను కొన్ని నెలలపాటు లైంగికంగా వేధించాడు అంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ఆరోపించిన విషయం తెలిసిందే. దాని మీద స్పందిస్తూ ‘అది నిజమే. వికాస్‌ నన్నూ వేధించాడు’ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో కలకలం రేపాయి. ‘అతడు నన్ను చాలా బలంగా హత్తుకునేవాడు. నా జుట్టు వాసన చూసేవాడు. అతడి నుంచి విడిపించుకోవడం చాలా కష్టమయ్యేది. నీ శరీరం నుంచి వచ్చే వాసన అంటే నాకు ఇష్టం అని చెప్పేవాడు’’ అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.

మహిళలకు రక్షణ ఉంటేనే... 
తనుశ్రీ ఆరోపణలపై బాలీవుడ్‌ నటి సోనాక్షి స్పందిస్తూ ‘‘పనిచేసే చోట మహిళలకు రక్షణ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మంచి వాతావరణం ఉంటేనే మహిళలు బాగా పనిచేయగులుగుతారు’’ అని వ్యాఖ్యానించింది.

చిన్మయి ఆరోపణలపై... 
‘మీ టూ’ ఇచ్చిన ధైర్యంతో గాయని చిన్మయి ఎనిమిదేళ్ల వయసులోనే తను వేధింపులకు గురయ్యానని బయటపెట్టారు. చిన్నతనం నుంచి తనకు ఎదురైన పలు చేదు అనుభవాల్ని ఆమె గుర్తు చేసుకొన్నారు. యూట్యూబ్‌ సినిమా విశ్లేషకుడు ప్రశాంత్‌పైనా ఆమె ఆరోపణలు చేశారు. దీనికి ప్రశాంత్‌ స్పందిస్తూ ‘‘గతంలో ఆమెపై లీక్స్‌ వచ్చినప్పుడు మానసిక ధైర్యం కలిగించడానికే డియర్‌ అనే పదం వాడాను. అంతకుమించి నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అన్నారు. 
 

దోషులకు శిక్షలు పడాల్సిందే: హృతిక్‌ రోషన్‌

సీనియర్‌ నటుడు రజత్‌ కపూర్‌పైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ పాత్రికేయురాలు అతనితో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. దీంతో అతను బహిరంగ క్షమాపణలు చెప్పాడు. బాలీవుడ్‌లో చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై ప్రముఖ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ కూడా పెదవి విప్పారు. ‘‘ఇది రహస్యంగా దాచాల్సిన విషయం కాదు. వేధింపుల విషయంలో దోషులుగా తేలినవారందరికీ శిక్షలు పడాలి. బాధితులకు నిర్భయంగా మాట్లాడగలిగే శక్తినివ్వాల’’ని ట్వీట్‌ చేశారు హృతిక్‌. ప్రస్తుతం ఆయన వికాస్‌ భల్‌ దర్శకత్వంలోనే ‘సూపర్‌ 30’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ‘‘వేధింపులకు గురిచేసే వ్యక్తితో కలసి నేను పనిచేయలేను. ‘సూపర్‌ 30’ నిర్మాతలు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి అవసరమైతే కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నానని’’ కూడా వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలపై కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ స్పందిస్తూ.. ‘‘మన దేశంలోనూ మీ టూ ఉద్యమం ప్రారంభమైంది, లైంగిక వేధింపులపై అనేక మంది మహిళలు ధైర్యంగా మాట్లాడటం చాలా సంతోషకరం’’ అని వ్యాఖ్యానించారు.

మీడియా సంస్థల్లోనూ...

మీడియా సంస్థలు కూడా ‘మీ టూ’ సుడిలో చిక్కుకుంటున్నాయి. తాజాగా హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు ప్రశాంత్‌ ఝాపై సంస్థ మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన రాజీనామా సమర్పించినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే వినోద కార్యక్రమాలను రూపొందించే ‘ఏఐబీ’ సంస్థ వ్యవస్థాపకుల్లో ఇద్దరు కూడా ఇవే ఆరోపణల సుడిలో చిక్కుకొని, సెలవు మీద వెళ్లిపోయారు. ‘మీ టూ’ ట్విటర్‌ పరంపరలో ప్రముఖ పత్రికా సంస్థలకు చెందిన మరికొందరు పాత్రికేయుల పైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు