close

ప్ర‌త్యేక క‌థ‌నం

మృగరాజు.. మరణమృదంగం 

గిర్‌ అభయారణ్యంలో 20 రోజుల్లో 23 సింహాల మృతి 
మరణాలకు కారణాలపై భిన్నాభిప్రాయాలు 
పరస్పర దాడులా? వైరస్‌లే కారణమా? 
అరుదైన సింహాల మృతిపై ఆందోళన 
హైదరాబాద్‌ జంతు ప్రదర్శనశాలలో 20 సింహాలు 
అధ్యయనానికి వెళ్లిన అటవీశాఖ ఉన్నతాధికారులు 
ఈనాడు - హైదరాబాద్‌ 

అడవికి రాజయిన సింహానికే ఆపద వచ్చింది.. ఆఫ్రికా సింహాల తర్వాత అంతటి పేరొందిన ఆసియా సింహాలకు ఆలవాలమైన గుజరాత్‌ గిర్‌ అభయారణ్యంలో మరణమృదంగం మోగుతోంది. మూడు వారాల్లోనే ఏకంగా 23 సింహాలు  చనిపోవడం కలవరం రేపింది. అరుదైన ఈ సింహాల మరణాలపై అటవీ అధికారులు, వన్యప్రాణి ప్రేమికులే కాదు.. సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సింహాల మరణానికి కారణాలేంటి? మిగిలిన సింహాల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దేశంలో జంతు ప్రదర్శనశాలల్లో ఉంటున్న మృగరాజుల పరిస్థితిపై ‘ఈనాడు’ కథనం. 
దేశంలో సింహాలు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతం ఒక్క గిర్‌ అభయారణ్యమే. శతాబ్దం క్రితం ఇక్కడ 20 సింహాలే ఉండేవి. 2015 నాటికి వీటి సంఖ్య 523కి చేరింది. 1980- 90ల్లో వీటిలో కొన్నింటిని హైదరాబాద్‌ జూకు తీసుకువచ్చారు. ఇక్కడ సంతానోత్పత్తితో పుట్టిన కూనల్ని దేశంలో ఇతర జూలకు అందిస్తున్నారు. అయితే గిర్‌ అభయారణ్యంలో 20 రోజుల్లో 23 సింహాలు మరణించడం తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా ఒక కుటుంబంలోని సింహాలు కనీసం 5 నుంచి 15 వరకు గుంపులుగా తిరుగుతాయి. ఒక గుంపుపై మరో గుంపు అప్పుడప్పుడు దాడులు చేసుకుంటాయి. తొలుత 13 సింహాలు మరణించినప్పుడు కొట్లాటలోనే చనిపోయాయని గుజరాత్‌ అటవీశాఖ చెప్పింది. అయితే ఆ ప్రాంతంలోనే కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ (సీడీవీ)ను గుర్తించారు. 4 నుంచి 5 సింహాలు ఈ సీడీవీ వల్లే చనిపోయాయని భారతవైద్య పరిశోధన మండలి, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (పుణె) ధృవీకరించాయి. దీంతో మిగిలిన సింహాల్ని రక్షించడానికి గుజరాత్‌ ప్రభుత్వం అమెరికా నుంచి ‘కెనైన్‌ ఫెర్రైట్‌’ వ్యాక్సిన్‌ తెప్పించి సింహాలకు వేయిస్తున్నట్లు సమాచారం. మిగతావాటికి వ్యాధి సోకకుండా కొన్నింటిని ఇతర ప్రాంతాల్లో జూలకు తరలించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి.
ఏమిటీ కెనైన్‌ డిస్టెంపర్‌? 
ఇది ప్రమాదకరమైన వైరస్‌. రేసుకుక్కలు, తోడేళ్లకు ఎక్కువగా సోకుతుంది.  కుక్కలు చొంగ కార్చినప్పుడు వైరస్‌ బయటకు వచ్చి గాల్లో కలిసి ఇతర జీవులకు వ్యాపిస్తుంది.

ప్రోటోజోవా ఇన్‌ఫెక్షన్‌ 
సింహాల మరణానికి ప్రోటోజోవా ఇన్‌ఫెక్షన్‌ కూడా కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. రక్తం ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న ఎద్దులు, కుక్కలు వంటి జీవుల్ని సింహాలు వేటాడి తిన్నప్పుడు వాటి ద్వారా సింహాలకూ సోకి ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అనారోగ్యం బారిన పడ్డాయని అనుమానం ఉన్న 31 సింహాలు చికిత్సలో ఇస్తున్న మందుకు స్పందిస్తుండటంతో ప్రొటోజోవా ఇన్‌ఫెక్షనే కారణమని పశువైద్య నిపుణులు చెప్పినట్లు తెలిసింది.

ఆవాసం చాలకపోవడమే సమస్య 
గిర్‌ అభయారణ్యం విస్తీర్ణం తక్కువగా ఉండటంతో సింహలు తరచూ బయటికి వస్తుంటాయి. సమీప గ్రామాలతోపాటు దాదాపు 50 కి.మీ. దూరంలోని రాజ్‌కోట్‌లో ఉన్న జూ వరకూ రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో పశువులపై, రేసుకుక్కలపై దాడులు చేసి తింటుంటాయి. ఆ జంతువుల్లో ఉండే కెనైన్‌ డిస్టెంపర్‌ లాంటి వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లు సింహాలకు వ్యాపించి అవి చనిపోతున్నాయని భావిస్తున్నారు.

 

మన సింహాలు ఎంత సురక్షితం? 
హైదరాబాద్‌లో జూలో 20 సింహాలున్నాయి. వీటిలో ఇటీవల ఒకటి వయసు మళ్లి చనిపోయింది. మిగిలినవన్నీ సురక్షితమేనని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గిర్‌ అడవుల్లో మరణాల నేపథ్యంలో తెలంగాణ ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ప్రశాంత్‌కుమార్‌ ఝా గుజరాత్‌ వెళ్లారు. సింహాల మరణానికి కారణాలపై ఆరా తీశారు. ప్రోటోజోవా ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన కారణమని వారు చెప్పారు. దీంతో హైదరాబాద్‌ జూలోని సింహాలకు అలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా వ్యాక్సిన్లు పంపాలని గుజరాత్‌ అధికారులను తెలంగాణ అటవీశాఖ కోరింది.

దేశంలో ఇదే తొలిసారి 

హైదరాబాద్‌ జూలో సింహాలు బోనులో ఉండడంతో వైరస్‌ సోకే అవకాశాలు దాదాపుగా ఉండవు. కాబట్టి వీటికి ముప్పు లేదు. ఆడ సింహం ఒక్కో విడతలో 3-6, జీవితకాలంలో గరిష్ఠంగా 16 వరకు పిల్లలకు జన్మనిస్తుంది. సింహాలు అడవుల్లో అయితే 15 ఏళ్లు, జూలో అయితే 18 సంవత్సరాలు బతుకుతాయి. ఆఫ్రికాలో కెనైన్‌ డిస్టెంపర్‌తో వైరస్‌తో 1990ల్లో దాదాపు వెయ్యి సింహాలు మరణించాయి. మన దేశంలో అలాంటి మరణాలు నమోదవడం ఇదే తొలిసారి.

- డాక్టర్‌ మద్దిశెట్టి నవీన్‌కుమార్‌,హైదరాబాద్‌ జూ కన్సల్టెంట్‌

జీవవైవిధ్యానికి తీరని నష్టం 

పదుల సంఖ్యలో సింహాలు మరణించడం జీవ వైవిధ్యానికి తీరని నష్టం. అవి తీసుకునే ఆహారంలో, నీళ్ల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తోంది. వేటలో దొరికే జింకలు, దున్నల వంటి జంతువుల శరీరంలో ఏదైనా వైరస్‌లు ఉంటే సింహాల ప్రాణాలకూ ముప్పే. అంతరించిపోతున్న పెద్దపులులు, సింహాల సంతతి పెంచేలా డీఎన్‌ఏ నమూనాలతో పరిశోధనలు చేపట్టాలి.

- ప్రొఫెసర్‌ హంపయ్య, మాజీ ఛైర్మన్‌, జీవ వైవిధ్య మండలి

మరిన్ని

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

రుచులు