close

ప్ర‌త్యేక క‌థ‌నం

చల్లచల్లని మంచు ఆరోగ్యాన్ని ముంచు 

పండ్ల రసాల తయారీలో అపరిశుభ్రమైన ఐస్‌ 
నమూనాల్లో మలం, పురుగుమందుల అవశేషాలు 
వేసవిలో విచ్చలవిడి వాడకం 
మానవ వినియోగానికి పనికిరాదంటున్న నిపుణులు 
హైదరాబాద్‌ వ్యాప్తంగా నమూనాలు తీసి పరీక్ష చేయించిన ‘ఈనాడు’ 
నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి.. 
ప్రమాణాలపై దృష్టిపెట్టని ఆహార పరిరక్షణాధికారులు 
ఐ.ఆర్‌. శ్రీనివాసరావు 
ఈనాడు - హైదరాబాద్‌
ఆహార పదార్థాల కల్తీ ప్రజారోగ్యాన్ని రోజురోజుకూ ప్రమాదంలోకి నెడుతోంది. కార్బైడ్‌ రూపంలో పండ్లకు పట్టిన చీడ ఇంకా తొలగిపోకముందే మలినాలతో కూడిన ఐస్‌ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. ఇలాంటి మంచు ముక్కల్ని చెరుకు, పండ్ల రసాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వీటిని తాగితే వేసవితాపం తగ్గడం సంగతి దేవుడెరుగు.. ఆరోగ్యానికే ఎసరు వచ్చే దుస్థితి దాపురించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చెరుకురసం, పండ్ల రసాల దుకాణాల్లో వినియోగిస్తున్న మంచు ముక్కల నమూనాలను ‘ఈనాడు’ సేకరించి పరీక్షలు చేయిం చగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వేర్వేరు చోట్ల సేకరించిన ఐసు నమూనాల్లో అన్నింటిలోనూ ప్రమాదకర ‘మల కలుషితాలు’ ఉన్నట్లుగా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే కలుషిత ఐస్‌ వినియోగం ఉంటుందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. తినడానికి ఉపయోగించే ఐస్‌ తయారీలో నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించే వ్యవస్థ లోపభూయిష్ఠంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితిపై ‘ఈనాడు’ పరిశోధన కథనం...

రాష్ట్రంలో రెండు రకాల ఐస్‌ ఉత్పత్తి సంస్థలున్నాయి. మొదటిది తినడానికి ఉపయోగించేది కాగా రెండోది చేపలు, రొయ్యలు తదితరాలు వాటిని ఎగుమతి చేయడానికి, మృతదేహాలను భద్రపరచడానికి వినియోగించేది. 
* తినడానికి వినియోగించే ఐస్‌ తయారీలో కచ్చితంగా నాణ్యత ప్రమాణాలను పాటించాలి. దీనికి వాడే నీరు పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. ఇందులో ఏ రకమైన బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, ఇతర రసాయనాలూ, మలినాలు ఉండకూడదు. పరీక్షలు చేసి ఇవేమీ లేవని నిర్ధారించుకున్నాకే ఆ నీటిని ఐస్‌ ఉత్పత్తికి వాడాలి.
* రెండో రకం ఐస్‌ తయారీకి కూడా శుద్ధమైన నీటినే వినియోగించాలి.

* రాష్ట్రంలో తినడానికి వినియోగించే మంచును కూడా అతి సాధారణ 
నీటితోనే, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఎక్కువగా బోరు నీటితో తయారుచేస్తున్నారు. మృతదేహాలను భద్రపర్చడానికి ఉపయోగించే ఐస్‌ముక్కలను కొని చెరుకు, పండ్ల రసాల్లో ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిర్లక్ష్యం నీడన ఆహార పరిరక్షణ 
తెలంగాణలో ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల చట్టం అమలుకు సిబ్బంది కొరత పెద్ద శాపంగా మారింది. 
* హైదరాబాద్‌ మినహా మిగిలిన జిల్లాలన్నింటిలో మొత్తం 20 ఆహార పరిరక్షణాధికారుల పోస్టులుండగా 9 మందే పనిచేస్తున్నారు.
* అత్యంత కీలకమైన హైదరాబాద్‌ నగర పరిధిలో ఏడు పోస్టులకుగాను ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి లక్షమంది జనాభాకు ఒక ఆహార పరిరక్షణాధికారి, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒకరు ఉండాలి. ఈ లెక్కన సుమారు 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో దాదాపు 400 మంది అధికారులు అవసరమవుతారు. హైదరాబాద్‌లోనే 160 మంది ఆహార పర్యవేక్షకులు ఉండాల్సి ఉంటుంది.

* హైదరాబాద్‌,  పరిసర ప్రాంతాల్లోనే అధికంగా ఆహార పదార్థాల ఉత్పత్తి సంస్థలుండడంతో పాటు వేల సంఖ్యలో హోటళ్లు, టోకు, చిల్లర దుకాణాలున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ వందల కొద్దీ వ్యాపార, వాణిజ్య సంస్థలున్నాయి. ఇంత విస్తృత పరిధిలో తనిఖీ, పర్యవేక్షణ నిర్వహించాల్సి ఉండడంతో సిబ్బంది కొరతను సాకుగా చూపి, అధికారులు నామమాత్రపు తనిఖీలతో నెట్టుకొస్తున్నారు. ఇదే అలుసుగా వ్యాపారులు యథేచ్ఛగా కల్తీకి తెగబడుతున్నారు.

* గత రెండేళ్లలో ఐసు తయారీ సంస్థలపై ఒక్క తనిఖీ కూడా నిర్వహించలేదని అధికారులే అంగీకరిస్తుండడం నిర్లక్ష్యం స్థాయిని చాటిచెబుతోంది.

* తక్షణమే ఆహార పరిరక్షణాధికారుల భర్తీ ప్రక్రియ చేపట్టి తరచూ తనిఖీలు నిర్వహించడమే దీనికి పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరీక్షల్లో గుర్తించిన అంశాలు..
* బ్యాక్టీరియా విశ్లేషణలో పర్యావరణ, మల కలుషితాలు కనిపించాయి. ఐసు తయారీ పరిశ్రమల పరిసరాల్లో మురుగునీటి పైపులైన్లలో లీకేజీలుంటే నీరు ఇలా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. 
* ఉష్ణోగ్రతను తట్టుకునే కొలిఫాంతోపాటు ఈ-కొలి ఉనికితోపాటు ఈ-కొలి నమూనాల్లో కనిపించింది. 
* అమ్మోనియా, నైట్రేట్స్‌ మూలాలు ఉన్నాయి. 
* మెగ్నీషియం, ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్నాయి. సౌందర్య పోషణకు ఉపయోగించే రసాయనాల నమూనాలు కనిపించాయి. 
* జలమండలి నీటిని యథావిధిగా ఐసు తయారీకి వినియోగించారు. 
* నీరు పొట్టు వాసన వస్తోంది. 
* ఐస్‌ తయారీ కంపెనీ సంప్‌ వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవటంతో పక్షులు విసర్జితాలు పడి ఉండవచ్చు.
ఐస్‌లో ప్రమాదకర పదార్థాలు
* మల కలుషితాలు 
* ఈ-కొలి బ్యాక్టీరియా 
* ఫ్లోరైడ్‌, నైట్రేట్‌ కారకాలు 
* కాఠిన్య పదార్థాలు, పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర రసాయనాలు
కట్టుదిట్టమైన చర్యలు 
-డాక్టర్‌ శంకర్‌, ఐపీఎం సంచాలకులు
ఆహార కల్తీపై కఠిన వైఖరి అవలంబించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ విభాగంలో ఏళ్లుగా మానవవనరుల లోటు కొనసాగుతోంది. సిబ్బందిని భర్తీ చేయకుండా కల్తీని అరికట్టడం సాధ్యం కాదు. అందుకే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆహార పరిరక్షణకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలో నియామకాలు చేపడతాం. ఇక నుంచి ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు, ముగ్గురు ఆహార పరిరక్షణాధికారులు ఉంటారు. ప్రతి జిల్లాకూ ఒక గెజిటెడ్‌ ఆహార పరిరక్షణాధికారిని నియమిస్తాం. ప్రయోగశాలలను ఆధునికీకరిస్తే పరీక్షల ఫలితాలు మరింత వేగంగా, నాణ్యంగా అందుతాయి.
ఆరోగ్యానికి చేటే 
-డాక్టర్‌ అనిల్‌ చెరుకూరి, జీర్ణకోశ వ్యాధుల నిపుణులు
మలినమైన నీటిని తాగినా, మాలిన్యంతో కూడిన ఐస్‌ ముక్కలను పండ్లరసాల తయారీలో వినియోగించినా ఆరోగ్యానికి చేటే. ఇలాంటి ఐస్‌ కలిపిన పదార్థాలు తీసుకుంటే వాంతులు, వికారం, టైఫాయిడ్‌, కామెర్లు తదితర వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతుంటారు. ఐస్‌ తయారీకి ఉపయోగించే నీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉంటే దీర్ఘకాలంలో ఎముకలపై దుష్ప్రభావం చూపుతుంది. బయటి దుకాణాల్లో పండ్లరసాలు తాగాలనుకుంటే ఐస్‌ లేకుండా తాజాగా తయారు చేయించుకోవటం మేలు.

మరిన్ని

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

రుచులు