close


‘2.ఓ’... విశేషాలెన్నో!

ఆయన సినిమాలన్నీ ఒకేలా ఉండవు. అలా ఉండి ఉంటే అవి శంకర్‌ సినిమాలు అయ్యేవి కావు. 
ఎందుకంటే ఏడు వింతలను ఒక పాటలో చూపించే ధైర్యం ఎవరు చేస్తారు? శంకర్‌ తప్ప! 
సీతాకోక చిలుకలు హీరోయిన్‌ను అల్లుకున్నట్లు ఎవరు చూపించగలరు.. శంకర్‌ తప్ప! 
‘చిట్టి’ రోబోతో అదిరిపోయే ఫైట్స్‌ ఎవరు చేయించగలరు... శంకర్‌ తప్ప! 
మోటార్‌ బైక్‌ను హీరోయిన్‌లా ఎవరు మార్చగలరు... శంకర్‌ తప్ప!

భారీదనానికి నిలువెత్తు రూపం ఆయన చిత్రాలు. ఆయన తీసే సినిమాలకు కోట్ల రూపాయలు ఖర్చు కావొచ్చు.. కొన్నేళ్లు పట్టవచ్చు. కానీ, సినిమా చూసిన ప్రేక్షకుడు దానికి పది రెట్లు ఆనందాన్ని ఆస్వాదించగలడు. ప్రేక్షకులను ఎలా మంత్రముగ్ధులను చేయాలో శంకర్‌కు మాత్రమే తెలుసు. రజనీకాంత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుపుకొంటోంది. అవి కూడా తుది దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వినాయకచవితి సందర్భంగా ‘2.ఓ’ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది. మరి ‘2.ఓ’కు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందామా!

అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం
శంకర్‌ గత చిత్రాల కన్నా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘2.ఓ’. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇందులో అత్యధిక భాగం వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే ఖర్చు చేశారు. హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం 75మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారట. అంటే మన కరెన్సీలో రూ.540కోట్లు. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 3వేల మంది నిపుణులు దీని కోసం పనిచేశారు. ఇక ప్రచారానికీ భారీగానే ఖర్చు చేస్తున్నారు. దుబాయ్‌లో ఆడియో విడుదల వేడుకను నిర్వహించిన చిత్ర బృందం.. ఏకంగా హాట్‌ బెలూన్‌ ద్వారా వినూత్న ప్రచారానికి తెరతీసింది.

లక్షల గంటల శ్రమ
‘2.ఓ’ కోసం చిత్ర బృందం ఎంతో శ్రమించింది. శంకర్‌ అనుకున్న కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఎంతోమంది నిపుణులు పనిచేశారు. కొన్ని వందల ఆలోచనలను పంచుకున్నారు. కథ ప్రకారం పాత్రలు ఎలా ఉండాలి? నటులు ఎలాంటి కాస్ట్యూమ్స్‌ ధరించాలి? సెట్స్‌ ఎలా ఉండాలి? ఏ సన్నివేశాలకు వీఎఫ్‌ఎక్స్‌ జోడించాలి? వేటిని సహజంగా తీయాలి? ఇలా శంకర్‌ ఆలోచనలను కొన్ని వందల మంది పంచుకుని వాటిని వెండితెరపై కనిపించేందుకు నిరంతరం శ్రమించారు. ముఖ్యంగా గ్రీన్‌ మ్యాట్‌పై తీసే సన్నివేశాల వెనుక ఎంతోమంది కృషి దాగి ఉంది. ఇక యాక్షన్‌ సన్నివేశాలకైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రకాల సూట్‌లు, ప్రత్యేక గ్యాడ్జెట్‌లను తయారు చేశారు. అసలు కథ మొత్తాన్ని తొలుత ఓ వీడియో వీడియో గేమ్‌ రూపంలో తీసుకొచ్చి దాని ఆధారంగా మార్పులు, చేర్పులు చేసుకుంటూ వెళ్లారు.

మొత్తం 3డీలోనే!
సాధారణంగా త్రీడీ సినిమాలను మొదట 2డీలో తీసి, దాన్ని పోస్ట్‌ప్రొడక్షన్‌లో 3డీగా మారుస్తారు. హాలీవుడ్‌ సినిమాలైనా అంతే. కానీ, గతంలో ఏ భారతీయ చిత్రం తీయని విధంగా మొత్తం సినిమాను 3డీలో తెరకెక్కించారు. ఇందుకోసం హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల బృందం పనిచేసింది. ‘2.ఓ’ను అత్యాధునిక 3డీ కెమెరాతో నేరుగా చిత్రీకరించారు. తీసిన ప్రతి సన్నివేశాన్ని హైటెక్‌ 3డీ గ్లాస్‌తో ఒకటి రెండు సార్లు చెక్‌ చేసుకునేవారు. దీని వల్ల తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్‌ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. తొలిసారి శంకర్‌ తీసిన 3డీ షాట్‌ చూసి రజనీ ఆశ్చర్యపోయారట. ఈ చిత్రాన్ని కావాలని 3డీలో తీయలేదని స్క్రిప్ట్‌కు ఉన్న డిమాండ్‌ వల్లే 3డీలో తీయాల్సి వచ్చిందని శంకర్‌ చెప్పారు. ఒక సినిమాలో ప్రేక్షకుడు పూర్తి లీనం కావాలంటే అలాంటి సాధనాల్లో 3డీ ఒకటిని శంకర్‌ చెబుతారు.

రజనీ-అక్షయ్‌
‘2.ఓ’ విడుదల ఆలస్యమైనా, క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణం రజనీకాంత్‌. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత ఆయన రెండు చిత్రాల్లో నటించారు. అయినా కూడా చాలా మంది కళ్లు ‘2.ఓ’పైనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ‘2.ఓ’పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు రజనీలోని మాస్‌ను ఆశించినంత మేర చూపించలేకపోయాయి. ఆ లోటు ‘2.ఓ’ తీరుస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ అక్షయ్‌కుమార్‌. బాలీవుడ్‌ కిలాడీగా తనదైన ముద్రవేసిన అక్షయ్‌ ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. ఆయనో శాస్త్రవేత్తగా కనిస్తారట. అక్షయ్‌కు సంబంధించిన పోస్టర్‌లు చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘నేను నటిస్తున్న ఓ శక్తిమంతమైన పాత్రను మీతో పంచుకుంటున్నాను. మాటలే రాని ఓ ప్రపంచానికి నేనో డార్క్‌ సూపర్‌ హీరోని. మనుషుల్లారా జాగ్రత్త’’ అని ఇటీవల అక్షయ్‌ ఓ ఫొటోను పంచుకున్నారు. ‘ఈ ప్రపంచం మనుషులు ఒక్కళ్లదే కాదు..’ అని పోస్టర్‌పై రాసి ఉంది. మరి వెండితెరపై అక్షయ్‌ ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తారో చూడాలి.

వీఎఫ్‌ఎక్స్‌.. వీఎఫ్‌ఎక్స్‌.. వీఎఫ్‌ఎక్స్‌
శంకర్‌ సినిమా అంటేనే భారీదనం. ఇక అందులో రజనీకాంత్‌ కథానాయకుడు అయితే ఆ అంచనాలు ఇంకా భారీగా ఉంటాయి. మరి ఇద్దరు లెజెండ్స్‌ కలిసి చేస్తున్న సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడినా, తేడా కొట్టేస్తుంది. అందుకే శంకర్‌ ఎంచుకున్న కథకు తెరపై న్యాయం జరగాలంటే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం కావాలి. నేడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతోనే అది సాధ్యం. అది గుర్తించిన శంకర్‌ ఇంత పెద్ద ప్రాజెక్టును భుజాలపైకి ఎత్తుకున్నాడు. అసలు ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం వీఎఫ్‌ఎక్స్‌ పనులే. ప్రతి ఫ్రేమూలోనూ వీఎఫ్‌ఎక్స్‌ బృందం పనితనం కనపడుతుందని చిత్ర బృందం చెబుతోంది. మరి ‘2.ఓ’లో ఏ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నాయో రుచి తెలియాలంటే వినాయకచవితి వరకూ వేచి చూస్తే సరిపోతుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

 

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు