close

అంతర్యామి

మేఘ సందేశం 

వని, ఆకాశాల నడుమ నిరంతరం సాగే మేఘం- రాయబారం నడిపే ఒక సజీవ మాధ్యమం. ఇహపర సాధనకు కలిసివచ్చే ఒక మంచి నేస్తం. ఒక చక్రవర్తి సామంత ప్రభువుకు ఇచ్చిన శ్రీముఖాన్ని అందజేసే మధ్యవర్తి. ప్రేమికుల వార్తలను చేరవేసి తాపం చల్లార్చే చల్లనిదొర. కాళిదాసు కావ్యానికి తొలి శీర్షిక. తెల్లని మేఘం కురవదు. ఆకాశరథంలో పయనిస్తూ చూపరులను అలరిస్తుంది. ప్రేమికులకు ఉపశమనం కలిగిస్తుంది. నల్లని మేఘం చల్లదనం కురిపిస్తుంది. చరాచర ప్రకృతి దాహార్తిని తీరుస్తుంది. భౌతిక జగత్తుకు, ఆధ్యాత్మిక ప్రపంచానికి, సయోధ్య కూర్చగల సామర్థ్యం దాని సొంతం. ఒక నిస్వార్థ క్రియాయోగిగా మేఘం మానవ సమాజానికి సాయపడే వైనాన్ని బృహదారణ్యకం చెబుతుంది.

ఆకాశంలో విహరించే దేవతలు సాత్వికులని, భూలోకంలో నివసించే మానవులు రాజసికులని, పాతాళంలో దాగే రాక్షసులు తామసులని- స్థూలంగా విభజించటం వారి ప్రవృత్తులకు నిదర్శనం మాత్రమే. భగవంతుడికి అందరూ ఒకటే. రూప, గుణ భేదాలు సమయ సందర్భాలను బట్టి మూడు గణాల్లో బయటపడుతూ ఉంటాయి. మానవుడు దానవుడు కాగలడు, రాక్షసుడు రక్షకుడై దైవసమానుడు కావచ్చు. మానవుడు దివ్యమానవుడిగా మార్గదర్శనం చేయించగలడు. దేవదానవ సంగ్రామం మానవ హృదయంలో చెలరేగే ఒక వింతైన అనుభవం. స్వర్గానికి, నరకానికి నడుమ మానవలోకం ఉండటమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మధ్యముడైనా మానవుడు ముల్లోకాలను నిత్యజీవితంలోనే సాధించుకోగలుగుతున్నాడు. భూలోకంలో తనకోసం జీవించే మానవుడు స్వార్థపరుడు. పరులకోసం పాటుపడేవాడు పితృలోకం పొందుతాడు. నిష్కామంగా తోటి మనుషుల్ని జ్ఞానవంతులుగా చేయగల మానవుడు దేవలోకానికి అర్హుడు కాగలడు. ఈ భూమిపైన జీవిస్తూనే పితృ, దేవలోకాల పనులు చక్కపెట్టే మానవుడు ధన్యజీవుడు. అతడి జీవితమే మహాయజ్ఞం; అదే బ్రహ్మయజ్ఞం. మానవుడు ఎన్ని భౌతిక విజయాలు సాధించినా, ఎన్నెన్ని లోకాలు తిరిగినా చివరకు సాధించవలసిన స్థితి బ్రహ్మగతి. అదే మానవ జీవిత పరమార్థం.

దైవానికి మూడు గణాలు సమానమే అయినట్లు, ఆ ప్రజాపతికి దేవ, మానవ, దానవ, గణాలకు చెందిన శిష్యులు చాలామంది ఉంటారు. తరతమ భేదం లేకుండా గురువు అందరికీ సమంగా విద్యాదానం చేశారు. ప్రజాపతి నుంచి వారు జీవిత కళాశాలలో ప్రవేశించే సమయం ఆసన్నమైంది. శిష్యులకు గురువును దర్శించుకుని ఆయన చివరి సందేశం వినాలనిపించింది. ముందుగా దేవతలు హితోపదేశం చేయమని ప్రజాపతిని కోరారు. ఆయన నోటివెంట ‘ద’ అనే అక్షరం పలికింది. ‘తెలిసిందా?’ అని అడిగారు గురువుగారు. తెలిసింది... ‘ద’ అంటే దమనం. మేం స్వేచ్ఛాజీవులం కాబట్టి ‘ఇంద్రియ సంయమనం పాటించాలి’ అని శలవు తీసుకున్నారు. తరవాత మానవులు ఆయన దరికి చేరారు. అదే అక్షరం; అదే ప్రశ్న... తెలిసింది, ‘ద’ అంటే ‘దానం చెయ్యటం’ అంటూ వెళ్లిపోయారు. రాక్షసులు ‘ద’ అంటే దయ చూపటం అని తెలుసుకుని నిష్క్రమించారు. దేవతలకు నిగ్రహం కావాలి. మానవులు దానం చేయాలి. రాక్షసులు దయ చూపాలి. అలాంటి ఆదర్శవంతమైన జీవితమే వారిని ఉన్నతులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. అన్ని విద్యలకన్నా ఆత్మవిద్య గొప్పదన్న విషయాన్ని ఉపనిషత్తు తేటతెల్లం చేస్తున్నది. ప్రజాపతి సందేశం విన్న ఒక మేఘం ‘దదద’ అని ముమ్మారు గర్జించింది. ప్రజాపతి దివ్యబోధనను భవ్యజీవితంలోకి అనువదించాలని మేఘం తనదైన బాణీలో, తనదైన భాషలో సందేశముద్ర వేసింది. అదే ఆధ్యాత్మిక జీవన దివ్యసందేశం!

- ఉప్పు రాఘవేంద్రరావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవ‌తార్చ‌న

రుచులు