close


ట్రావెలాగ్

సంక్రాంతి సందడి చూద్దాం పదండి

‘‘నాన్నా! సెలవుల్లో ఎక్కడికి వెళ్దాం?’’ 
‘‘చూద్దాంలే!’’ 
‘‘అదే, ఏం చూద్దాం నాన్నా!!’’ 
సెలవుల ముందు చాలా ఇళ్లల్లో వినిపించే మాటలివి.

నాలుగు రోజుల్లో సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయ్‌! పల్లెకు పోయేవాళ్లు పల్లెకు పోతారు. పతంగులు ఎగరేసేవారు.. గాల్లో తేలిపోతుంటారు. సెలవుల్లో కాస్త తిరిగొద్దామని అనుకునేవారు మరికొందరు. ఐదారు రోజుల సెలవులు. ఎందుకాలస్యం... జిల్లాలు దాటండి, రాష్ట్రాలు దాటి వెళ్లిపోండి. సంకురాతిరి సంబరాలను సంతోషంగా ఆస్వాదించండి. మీ పర్యటన కోసం ముచ్చటైన ప్రదేశాల వివరాలు అందిస్తున్నాం. నచ్చినదాన్ని ఎంచుకొని ఎంచక్కా చుట్టేసిరండి!

ఉడుపి : కన్నయ్య సన్నిధిలో..
మకర సంక్రాంతి వేళ కృష్ణుడు కొలువుదీరిన ఉడుపి క్షేత్రం కోలాహలంగా ఉంటుంది. ఉత్తరాయణ ప్రవేశం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. సంక్రాంతి రోజు మూడు రథాల్లో నిర్వహించే శోభాయాత్ర ఉత్సాహభరితంగా సాగుతుంది. గర్భగుడిలోని కృష్ణుడి విగ్రహాన్ని చిన్న కిటికీలో నుంచి చూడాలి. ఈ కిటికీకి ఉండే తొమ్మిది గళ్లను నవగ్రహాలుగా భావిస్తారు. ఉడుపి ఉత్సవాలు మగిశాక.. చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే ‘కంబాలా’ పోటీలు చూడాల్సిందే.
మడిలో తలపడి 
వూళ్లొని వారంతా ఒక చోటికి చేరుకుంటారు. జట్లుగా విడిపోయి.. కేరింతలు కొడుతుంటారు. బూరలు వూదుతుంటారు. కాడికి కట్టిన దున్నలు కాలుదువ్వుతుంటాయి. ముక్కులు ఎగిరేస్తుంటాయి. కాడిని పట్టుకున్న రైతుబిడ్డ మీసం మెలేస్తాడు, ఈల మోగుతుంది. ‘రా.. రా.. రా..’ ఏ నోట విన్నా ఇవే అరుపులు. పంటలు సమృద్ధిగా పండాలని దైవాన్ని కోరుతూ చేసుకునే ‘కంబాలా’ పండగ ఇలా సాగిపోతుంది. ఉడుపి జిల్లాలోని పల్లెలతో పాటు దాని పక్కనే ఉండే మంగళూరు ప్రాంతంలోనూ ఈ సంప్రదాయం ఉంది. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు వారాంతాల్లో ఈ పోటీలు జరుగుతాయి. సంక్రాంతి సమయంలో ఈ ఉత్సాహం రెండింతలు అవుతుంది. రైతులే.. వీరులు. కాడికి దున్నలను కట్టి.. దూసుకెళ్తారు. గెలిచినవాడే మొనగాడు. కంబాలా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ రేసులు జరుగుతుంటాయి. వూరూరా జరిగే ఈ పోటీలను చూసేందుకు వేలమంది పర్యాటకులు ఉడుపి చుట్టుపక్కల గ్రామాలకు విచ్చేస్తుంటారు. పల్లెవాసుల ఆనందంలో పాలుపంచుకుంటారు.

సమీపంలో 
పుణ్యక్షేత్రాలు: కొల్లూరు (మూకాంబిక), మురుడేశ్వర్‌, శృంగేరి, ధర్మస్థల 
విహార స్థలాలు: కపూ బీచ్‌, మల్పె బీచ్‌, కుడ్లూ జలపాతం, జోగ్‌ ఫాల్స్‌ 
ఎలా వెళ్లాలి: హైదరాబాద్‌ నుంచి ఉడుపి, మంగళూరు... విజయవాడ నుంచి మంగళూరుకు ప్రైవేట్‌ ట్రావెల్‌ సంస్థల బస్సులు ఉన్నాయి. టికెట్‌ ధర రూ.1,000 నుంచి రూ.1,600 వరకూ ఉంది. మంగళూరు నుంచి ఉడుపి 56 కిలోమీటర్లు. హైదరాబాద్‌ నుంచి హుబ్లీ మీదుగా ఉడుపి చేరుకోవచ్చు. 
ఎన్ని రోజులు: 5-7 రోజులు

పొంగల్‌ హంగులు
క్రాంతి పండగ తమిళనాట నాలుగు రోజుల పాటు సాగుతుంది. భోగి పొంగల్‌, థాయ్‌ పొంగల్‌, మట్టు పొంగల్‌, కనుమ్‌ పొంగల్‌.. మన దగ్గర భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఎలాగో అలాగన్నమాట! అయితే సంప్రదాయాలను కచ్చితంగా పాటించే తమిళనాడు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది జల్లికట్టు ఆట. మదురై చుట్టు పక్కల గ్రామాల్లో ఈ సందడి కనిపిస్తుంది. సంక్రాంతి సీజన్‌లో నెల రోజుల పండగ ఒకటి జరుగుతుందిక్కడ. అదే మామల్లపురం నృత్యోత్సవం. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌, కథాకళి, ఒడిస్సీ... ఇలా భారతీయ సంప్రదాయ నృత్యాలన్నీ ప్రదర్శిస్తారు. ప్రసిద్ధ నృత్యకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. సంక్రాంతి నాలుగు రోజులు నృత్యోత్సవం పతాకస్థాయిలో సాగుతుంది.

మామల్లపురం పేరు కొత్తగా ఉందంటారా! ఈ పట్టణాన్ని మహాబలిపురం అని కూడా అంటారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ నగరం పల్లవ రాజ్యంలో రేవుపట్నంగా ఉండేది. బంగాళాఖాతం ఒడ్డున క్రీస్తుశకం 7వ శతాబ్దంలో నిర్మించిన మహాబలిపురంలో అడుగడుగునా అద్భుతాలే. కడలి కెరటాలు తాకేంత దూరంలో ఉన్న శివాలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం యునెస్కో చారిత్రక సంపదగా గుర్తింపు పొందింది. వరాహ గుహ, పాండవుల రథాలు, భారీ శిలలను తొలిచి పౌరాణిక గాథలు తెలిపే శిల్పమాలికలుగా మలచిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొండవాలుపై ఏటవాలుగా నిలిచి ఉన్న బండరాయి ఇప్పుడు సెల్ఫీజోన్‌గా మారింది. మహాబలిపురం సందర్శన ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది.

సమీపంలో 
చోళమండలం ఆర్ట్‌ విలేజ్‌, లైట్‌ హౌస్‌, ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియమ్‌, టైగర్‌ కేవ్‌, ప్రభుత్వ శిల్పకళా కళాశాలతో పాటు మరెన్నో ఉన్నాయి. మహాబలిపురం నుంచి కంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
ఎలా వెళ్లాలి: మహాబలిపురం వెళ్లాలంటే ముందుగా చెన్నై చేరుకోవాలి. అక్కడి నుంచి నుంచి మహాబలిపురం దాదాపు 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో చేరుకోవచ్చు. 
ఎన్ని రోజులు: 4-6 రోజులు

గోదారి గలగలలు.. కోనసీమ
గోదారి గలగలలు.. పైర గాలులు.. కొబ్బరి తోటలు.. కడలి అందాలు.. ఇదీ కోనసీమ సౌందర్యం. సంక్రాంతి వేళ.. ముంగిట్లో ముగ్గులు, వంటింట్లో పిండివంటల ఘుమఘుమలు, వూరంతా పతంగులు, వూరి చివరన కోడి పందేలు.. కోనసీమ అందాలు రెట్టింపు అవుతాయి. దీనికి తోడు మనసును కట్టిపడేసే పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయిక్కడ.

కోనసీమలో సంక్రాంతి శోభ వారం ముందు నుంచే మొదలవుతుంది. భోగి నాడు వేసే.. మంటలతో పండగ సంబరం పతాకస్థాయికి చేరుకుంటుంది. సంక్రాంతి రోజు మరింత సందడిగా ఉంటుంది. కనుమ రోజు కోనసీమలో ప్రభల తీర్థాలు వైభవంగా జరుగుతాయి. వీరభద్రుడిని కొలుస్తూ అందమైన ప్రభలను తయారు చేసి తీర్థ ప్రదేశాలకు తరలిస్తారు. ప్రభ కింద పడకుండా యువకులు భుజం కాసి అశ్శరభ...శ్శరభ అంటూ పొలాలు, కాలువల వెంట.. సాగిపోతారు.

జగ్గన్నతోట వైభవం.. 
కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల తీర్థానికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. దీనికి నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. 11 ప్రదేశాల నుంచి ప్రభలు ఇక్కడికి వస్తాయి. దీంతో పాటు పి.గన్నవరం, రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం, కొత్తపేట ఇలా వివిధ మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. వీటికి హాజరయ్యే వారు ఎడ్ల బళ్లలో విహరిస్తారు. పచ్చని కొబ్బరి ఆకులతో అల్లిన చాపలను ఈ బళ్లకు చుడతారు. వాటిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తీర్థాలకు వెళ్లే తీరు పల్లె వైభవాన్ని, సంక్రాంతి ఔన్నత్యాన్ని చాటుతుంది.

- భగత్‌సింగ్‌ న్యూస్‌టుడే, పి.గన్నవరం
సమీపంలో 
అంతర్వేది నరసింహస్వామి, అప్పనపల్లిలో శ్రీబాలబాలాజి, అయినవిల్లిలో ´వినాయకుడు, మురమళ్లలో వీరేశ్వరస్వామి, వాడపల్లిలో వేేంకటేశ్వరస్వామి వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. 
ఎలా వెళ్లాలి: రాజమండ్రి, రాజోలు, అమలాపురం చేరుకుంటే కోనసీమ మొత్తం చుట్టిరావొచ్చు. దిండి రిసార్ట్స్‌లో బస చేయవచ్చు. 
ఎన్ని రోజులు: 2-4 రోజులు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.