close


ప్ర‌ముఖులు

పెళ్లికి ఆహ్వానిస్తే... సినిమా చెయ్యమన్నారు!

కొందరు వ్యక్తులకంటే వారి పనులకే బాగా గుర్తింపు ఉంటుంది. అలాంటి వ్యక్తే సినిమా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. ఇష్క్‌లో కుర్రకారు ప్రేమని చూపినా, మనంలో మూడు తరాల్ని ఒక కథతో కలిపినా, 24లో కాలంతో ప్రయోగాలు చేసినా, అఖిల్‌తో ‘హలో’ అనిపించినా... సూటిగా చెప్పాలంటే అతడేం చేసినా  మేజిక్‌లా ఉంటుంది. దాని వెనక లాజిక్కూ ఉంటుంది. హలో సక్సెన్‌ని ఆస్వాదిస్తున్న విక్రమ్‌ని అతడి సినిమాల వెనక కథని అడిగితే చెప్పుకొచ్చాడిలా... 

కేరళలోని తిరుచ్చూర్‌ మా సొంతూరు. చదువుకున్నదీ, పెరిగిందీ మాత్రం తమిళనాడులో. నాన్న విజయ్‌ కుమార్‌... ఉగాండాలో తేయాకు తోటలు పెంచే కంపెనీకి ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. అక్కడ మంచి స్కూళ్లు లేవు. పిల్లల చదువు ముఖ్యమని భావించి నన్ను ఊటీలోని రెసిడెన్షియల్‌ స్కూల్లో చేర్పించారు. మొదట్లో అమ్మానాన్నల్ని వదిలి ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్లదీ అదే పరిస్థితి. మెల్లమెల్లగా అలవాటైపోయింది. గ్రాడ్యుయేషన్‌ చెన్నైలో చేశాను. స్కూల్లో చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ని.

కాలేజీకి వచ్చాక స్కిట్‌లు రాయడం మొదలుపెట్టాను. చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా ఇష్టం. అన్ని భాషల్లోని హిట్‌ సినిమాల్నీ చూసేవాణ్ని. థియేటర్‌లో దొరికే ఆనందం ఇంకెక్కడా దొరికేది కాదు. ‘శుభం’ కార్డు పడ్డాక అయిష్టంగా బయటకు వచ్చేవాణ్ని. డిగ్రీ తర్వాత చెన్నైలోనే ఫిల్మ్‌స్కూల్లో చేరాలనుకున్నాను. కానీ, అప్పటికే అక్కడ అడ్మిషన్లు పూర్తయిపోవడంతో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ దగ్గర అప్రెంటిస్‌గా చేరాను. ఆయన చెన్నైలోనే ఉంటూ మలయాళంతోపాటు హిందీ సినిమాలు తీసేవారు. ఆయన దగ్గర ఉన్నపుడే 1998 ప్రాంతంలో ఆత్మహత్య నేపథ్యంతో ‘సైలెంట్‌ స్క్రీమ్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. దానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. 14 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో దాన్ని ప్రదర్శించారు కూడా. దాంతో సినిమాల్లో కొనసాగేందుకు ధైర్యం వచ్చింది.

టాలీవుడ్‌తో ఆరంభం 
ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ కొత్త కథల కోసం చూస్తున్నట్టు తెలిసి నా కథని వినిపించడానికి చెన్నైలోని వారి ఆఫీసుకి వెళ్లాను. అక్కడ మరో 20 మంది వరుసలో ఉన్నారు. నా కథని అక్కడున్న వ్యక్తికి చెప్పాను. తర్వాత హైదరాబాద్‌ వచ్చి రామోజీరావు గారికి కథ వినిపించాను. ఆయనకీ నచ్చడంతో ప్రాజెక్టు మొదలైది. అదే ‘ఇష్టం’. స్నేహితుడు రాజ్‌తో కలిసి దాన్ని తీశాను. ఆ సినిమా ఒక మాదిరిగా ఆడింది. దీన్లో పరిచయమైన శ్రియ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ‘ఇష్టం’ తర్వాత శింబు హీరోగా తమిళంలో ‘అలై’ సినిమా తీశాను. అది బాగా ఆడలేదు. తర్వాత సినిమాలు లేవు. దాంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయాను. నాన్న మాత్రం నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని నెల నెలా కొంత మొత్తం అకౌంట్‌లో వేసేవారు. చెన్నైలో పెద్ద ఇల్లూ, పనివాళ్లూ, కారూ అన్నీ ఏర్పాటుచేశారు. ‘నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ వెనక నేను ఉన్నాను’ అని చెప్పేవారు. బంధువుల్లో కొందరు మాత్రం ‘సినిమాలు మానేసి ఇంకేదైనా చెయ్యొచ్చు కదా’ అని ఉచిత సలహాలిచ్చేవారు. దాంతో ఫంక్షన్లకి వెళ్లడం మానేశా. నాన్న రిటైరయ్యాక మా కుటుంబం చెన్నైలోనే స్థిరపడింది. నాన్న మద్దతు లేకపోతే నిజంగానే సినిమాలు వదిలేసేవాణ్నే.

ఒకే సినిమాతో రెండు చోట్లా 
ఇబ్బందులున్నా కథలు రాసుకుంటూ అయిదారేళ్లపాటు సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అప్పట్లో హారర్‌ సినిమాలు పెద్దగా తీసేవారు కాదు. ప్రయత్నిద్దామని అలాంటి కథ రాసుకున్నాను. ఇద్దరు ముగ్గురు నిర్మాతల్ని కలిస్తే కథ బాగుందని చెప్పారు. కానీ నిర్మించడానికి వారికి ధైర్యం సరిపోలేదు. ఆ సమయంలో యాడ్‌ల్యాబ్స్‌(రిలయన్స్‌) ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీస్తోందని విని వాళ్ల చెన్నై ఆఫీసుకి కథ పంపాను. పూర్తి స్క్రిప్టుతో ముంబయి రమ్మని పిలుపొస్తే వెళ్లి కథ వినిపించాను. ‘ఈ కథకి ప్రాంతీయ హద్దులు లేవు. తమిళంతోపాటు హిందీలోనూ చేయండి’ అన్నారు. అప్పటికి మాధవన్‌ రెండు చోట్లా సినిమాలు చేస్తున్నాడు. తనని హీరోగా పెట్టాను. అదే ‘13బి’. ఆ సినిమా  హిట్‌ అయింది. ‘13బి’కి పీసీ శ్రీరామ్‌ గారు సినిమాటోగ్రాఫర్‌. ఆయనతో పనిచేయడం నా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పాలి. ఆయన దగ్గరనుంచి సినిమాకి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నాను. అప్పట్నుంచీ నాకు ఆయన గురువులా, తండ్రిలా, మార్గదర్శిలా ఉంటున్నారు. తర్వాత ‘ఇష్క్‌’ చేశాను. అంతకంటే ముందు హీరో విక్రమ్‌తో ‘24’ సినిమాని త్రీడీలో తీయాలనుకున్నాం. నాలుగైదు రోజులు షూట్‌ చేశాక కొన్ని కారణాలవల్ల సినిమా ఆగిపోయింది. ఇష్క్‌ కథని అప్పటికే సుధాకర్‌రెడ్డి, నితిన్‌లకు వినిపించాను. వారికి నచ్చినా నిర్మాత కోసం వేచి చూడాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే సుధాకర్‌ గారు ఫోన్‌చేసి ఇష్క్‌ ప్రారంభిద్దామని చెప్పడంతో హైదరాబాద్‌ వచ్చాను. అందులో నితిన్‌కు జోడీగా నిత్యామేనన్‌ను తీసుకున్నాం. ఇష్క్‌ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమా నాకు టాలీవుడ్‌లో చాలామంది స్నేహితుల్ని ఇచ్చింది. ముఖ్యంగా నితిన్‌ రూపంలో చాలా మంచి ఫ్రెండ్‌ దొరికాడు. త్వరలో మా కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది.

‘మనం’కి మూలం 
ఏదైనా కథాలోచన రావడానికి పెద్ద సంఘటనే ఎదురవనవసరంలేదు. ఓ పదం, ఓ శబ్దం, ఒక ఫొటో, చిన్న అనుభవం... ఇలా ఏదైనా కథకి బీజం వేయగలదు. అలాంటి ఓ చిన్న అనుభవమే ‘మనం’ కథ రాసేలా చేసింది. ‘13బి’ సమయంలో ముంబయి నుంచి చెన్నైకి వస్తున్నపుడు ఫ్లైట్‌లో నా పక్కన కూర్చున్న అబ్బాయి హెడ్‌సెట్లో పాటలు వింటున్నాడు. వినడమేకాదు, డ్యాన్స్‌ కూడా చేస్తున్నాడు. నెత్తిన టోపీ, చేతిమీద ‘ఓం నమశ్శివాయ’ టాటూ కూడా ఉన్నాయి. ‘మీ షేకింగ్‌ కాస్త తగ్గిస్తారా. మీవల్ల పక్కవాళ్లకి ఇబ్బంది కలుగుతుంది కదా’ అని అతడికి మెల్లగా చెప్పాను. ‘సారీ సారీ’ అని మామూలుగా కూర్చున్నాడు. గంటన్నర విమాన ప్రయాణంలో, ఇంటికి వచ్చాకా అతడు నా ఆలోచనల్లోంచి వెళ్లిపోలేదు. ‘ఈతరం వ్యక్తి’... అన్నచోట మొదలైన నా ఆలోచన మూడు తరాల కథగా మారి ఆగింది. ఇష్క్‌ సమయంలోనే నాగార్జున గారికి ఆ కథ వినిపించాను. ‘మూడు తరాల కథ’ అంటే చాలామంది భయపడతారు. అది ఒక దగ్గర మొదలై ఎక్కడికో వెళ్తుంది. నాగార్జున గారికి వినిపించగానే... నచ్చిందన్నారు. ‘ఇష్క్‌’ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాం. అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన ‘మనం’ తెలుగు చిత్ర పరిశ్రమలో మరెన్నో తరాలు గుర్తుండిపోయేంత హిట్‌ అయింది. నాగ్‌సర్‌కి కథ నచ్చిందంటే చాలు, ఆలస్యం కాకుండా ప్రాజెక్టు ప్రారంభిస్తారు. కథకి అవసరమైనవన్నీ సమకూర్చుతారు. అలాగని టేకింగ్‌లో కలుగజేసుకోరు. ఎడిటింగ్‌ సమయంలో మాత్రం పక్కనే ఉంటారు. అప్పుడు మా మధ్య మంచి డిస్కషన్స్‌ జరుగుతాయి. అవెంతో విలువైనవి కూడా. ఎందుకంటే ఆయనకి నటుడిగా, నిర్మాతగా సుదీర్ఘమైన అనుభవం ఉంది.

‘మనం’ రిలీజైన తర్వాత దాన్ని తమిళంలో తీద్దామని హీరో సూర్య అడిగారు. సూర్య వాళ్ల నాన్న, సూర్య, కార్తీ... మూడు తరాల వ్యక్తులుగానూ, శ్రియా పాత్రలో జ్యోతికా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. ‘చేయొచ్చు కానీ నా దగ్గర వేరే కథ ఒకటి ఉంది. అది వినండి. అది నచ్చకపోతే ‘మనం’ చేద్దాం’ అన్నాను. అదే, 24. సూర్యాకి ఆ కథ బాగా నచ్చడంతో స్వయంగా నటించి నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన ఆ సినిమా మంచి హిట్టయింది. 24 నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ‘హలో’లో విధిరాత గురించి చెప్పాను. ‘24’ విక్రమ్‌తో ఆగిపోవడం, ‘మనం’ కోసం వచ్చిన సూర్యాకి అది నచ్చడం, ఆ సినిమాకి ఏ.ఆర్‌.రెహమాన్‌తో పనిచేయడం, ఆయన దగ్గర సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనిధితో పరిచయం, ఆమెతో ప్రేమ, పెళ్లి ఇదంతా విధిరాతే. గమ్యాన్ని చేరాల్సి ఉంటే అది ఎలాగైనా జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మలుపులు తిరుగుతూ ఆలస్యంగా చేరుకుంటామంతే!

అఖిల్‌ కోసమే ‘హలో’ 
నా పెళ్లి కార్డు ఇవ్వడానికి నాగ్‌ సర్‌ని కలిసినపుడు... ‘అఖిల్‌తో ఒక సినిమా చెయ్యి విక్రమ్‌’ అని అడిగారు. ‘తప్పకుండా సర్‌’ అని చెప్పి తర్వాత ఒక కథ రాసి చూపించాను. కానీ అది ఆయనకీ, అఖిల్‌కీ అంతగా నచ్చలేదు. తర్వాత మరో కథ వినిపించాను. అందరికీ నచ్చింది. అదే ‘హలో’. హీరోయిన్‌ కల్యాణి కూడా కొత్తమ్మాయి. అలాగని వాళ్లకి హోమ్‌వర్క్‌ ఇవ్వలేదు. అలా చేస్తే ప్రిపేరయిపోతారు. లైఫ్‌లో అన్నీ ప్రిపేరయినట్టు ఉండవు. కొన్ని అప్పటికప్పుడు జరగాలి. అప్పుడే సహజంగా ఉంటుంది. అందుకే వాళ్లకి ప్రిపరేషన్‌ వద్దని చెప్పాను. నా ప్రేమ అనుభవాలు ఈ సినిమాకి పనిచేశాయి.

నాగ్‌ సర్‌ నాపైన చాలా భారం మోపారు... సినిమా బాగా ఉండాలి, అఖిల్‌ని బాగా చూపాలి. షూటింగ్‌ సమయంలో ఒక్క మాట అనకుండా అడిగినవన్నీ ఇచ్చారు. మనం అన్నీ బాగా చేస్తాం కానీ, తెరపై చూసినపుడు సినిమా ఫీల్‌ ఎలా ఉంటుందో తెలీదు కదా! అందుకే చిన్న టెన్షన్‌. షూటింగ్‌ అంతా అయిపోయాక ఎడిట్‌ సూట్‌కి వచ్చి సీన్లు చూసిన నాగ్‌ సర్‌ కళ్లు చమర్చాయి. అప్పుడు నా మనసు కుదుటపడింది. మనం, హలో... ఈ రెండు సినిమాల సమయంలో అడిగినవన్నీ ఇచ్చారు నాగ్‌ సర్‌. నా టీమ్‌ని జాగ్రత్తగా చూసుకున్నారు. అలాంటి సపోర్ట్‌ అన్నిచోట్లా దొరకదు. అందుకే ఆయన ఎప్పుడు ఏ ప్రాజెక్టు చేయమన్నా చేస్తాను. అందులో రెండో ఆలోచనే ఉండదు. 
చై, అఖిల్‌ ఇద్దరూ చాలా మంచి కుర్రాళ్లు. ఇండస్ట్రీలో ఒక ఎత్తుకి వెళ్తారు. చైతూ అయితే నాతో తమ్ముడిలా ఉంటాడు. 
తనతో త్వరలోనే సినిమా ఉంటుంది.

నా బలం వాళ్లే... 
డైరెక్టర్‌ విక్రమ్‌ అంటే నేను మాత్రమే కాదు నా సాంకేతిక బృందం మొత్తం. వాళ్లు లేకుంటే నాకు బలం లేదు. సంగీత దర్శకుడు అనూప్‌ మంచి స్నేహితుడు. నా దగ్గర ఎలాంటి ప్రయోగం చేయడానికైనా తనకి స్వేచ్ఛ ఉంటుంది. ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి... కూడా నాకు ఫ్రెండే. ఓ సినిమాకి ఏం కావాలో తనకు బాగా తెలుసు. సినిమాటోగ్రాఫర్‌ వినోద్‌తో కథ, కథనాల గురించి ఎక్కువగా చర్చిస్తాను. ఆయన అభిప్రాయం నాకు చాలా ముఖ్యం. నా సినిమాల్లో పాటలు కూడా కథ చెబుతాయి. చంద్రబోస్‌, వనమాలి పాటలు లేకుండా నేను కథని గొప్పగా చెప్పలేను. ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవన్‌, దర్శకత్వ బృందంలోని స్వరూప్‌, సందీప్‌, నవీన్‌, రాంబాబు, అద్వైత్‌... ‘హలో’ మాటల రచయితలు కిట్టు- ఉష... వీళ్లంతా నా టీమ్‌. మున్ముందూ వీరిని కొనసాగిస్తాను.

‘టైమ్‌’ ఉండాల్సిందే!
ప్రపంచంలో ఒకే ఒక్క విషయం ఎవరి నియంత్రణలోనూ ఉండదు... అదే కాలం. నాకు ఆ అంశం బాగా నచ్చుతుంది. పేద, గొప్ప అన్న తేడాలేకుండా అందరూ టైమ్‌ని ఫాలో అవుతారు. సినిమాల్లో టైమ్‌తో ప్రయోగాలు చేయడమంటే నాకు సరదా. అందుకే నా కథల్లో టైమ్‌కి ప్రాధాన్యం ఉంటుంది. అలాగని అన్నింటిలోనూ కావాలని చొప్పించను. ఒక కథలో ఆ ఎలిమెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యం కుదురుతుంది. కొన్నిసార్లు కుదరదు. కానీ, అవకాశం ఉన్నప్పుడల్లా టైమ్‌ అంశాన్ని పెట్టడానికి చూస్తాను. 
- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.