close


సెంట‌ర్ స్ప్రెడ్

2018 ఫ్యాషన్‌ వర్ణం ఊదా

కొన్ని రంగులు చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటే, మరికొన్ని అందంగా కనిపిస్తాయి. ఆ రెండూ కాకుండా అంతుపట్టని ఏదో అర్థాలను సూచిస్తున్నట్లుగా నిగూఢ రంగులూ కొన్ని ఉంటాయి. ఈ అల్ట్రా వయొలెట్‌ ఆ కోవకే చెందుతుంది. అంతుబట్టని రహస్యానికి సంకేతంగా చిత్రకారులు తమ చిత్రాల్లో ఊదా రంగు ఆకాశాన్ని చిత్రించేది అందుకేనట. చిత్రమేంటంటే కాంతి వక్రీభవనం వల్ల ఆకాశమే కాదు, పర్వతాలూ వంకాయ(పర్పుల్‌) రంగుని పులుముకుంటాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం చైనా, నాన్‌జింగ్‌ ప్రాంతంలోని ‘పర్పుల్‌ మౌంటెయిన్‌’. సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో వంకాయ వర్ణంలోని మేఘాలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడమే కారణం. నిజానికి ఊదా, వంకాయ రంగులు రెండూ దాదాపు ఒకటే. వయొలెట్‌కి దృశ్యకాంతిలో ప్రత్యేకస్థానం ఉంది. ఎరుపు, నీలం రంగుల మేళవింపే వంకాయ వర్ణం. ఊదా నీలిరంగుకి దగ్గరగా ఉంటే, వంకాయ రంగులో ఎరుపు పాళ్లు ఎక్కువ. మొత్తమ్మీద నీలం, ఎరుపు రంగుల మిశ్రమ ఫలితమే ఊదా ఛాయలు.

ఏడాదంతా ఒకటే రంగేల? 
సృష్టిలో వేనవేల వర్ణాలుంటే, ఏడాది మొత్తానికీ ఒక రంగుని ఫ్యాషన్‌ కలర్‌గా ప్రకటించే సంప్రదాయం ఏమిటా అనిపించడం సహజం. కానీ ఆ ఏడాది మార్కెట్లోకి తీసుకురాబోయే ఉత్పత్తులకోసం డిజైనర్లూ బ్రాండ్లూ కార్పొరేట్‌ కంపెనీలూ అన్నీ కలిసి సమన్వయంతో పనిచేసేందుకు ఈ రంగుల ఎంపిక దోహదపడుతుంది. అందుకోసం అంతా కలిసి చేసుకున్న ఏర్పాటే అంతర్జాతీయ పాంటోన్‌ కలర్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఎక్కువమందికి నచ్చడంతోబాటు, మారుతున్న మనుషుల ఆలోచనాతీరునీ మనస్తత్వాన్నీ భావోద్వేగాల్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఏటి ఫ్యాషన్‌ రంగుని నిర్ణయిస్తారు ఆ సంస్థ నిపుణులు. అందులో భాగంగానే 2018లో మరెన్నో ఆవిష్కరణల దిశగా మానవజాతిని ప్రేరేపిస్తూ- అద్భుత ఊహాశక్తికీ ఆధ్యాత్మిక చింతనకీ సాంకేతిక పరిజ్ఞానానికీ ఖగోళ పరిశోధనలకీ ప్రతీకగా నిలిచే ఊదా రంగుని ఎంపికచేశారట.

అయితే ఎరుపూ, ఆకుపచ్చా, పసుపూ... వంటి వాటిలా ఊదా పాపులర్‌ ఫ్యాషన్‌ కలర్‌ కాదు. ఇది సంపన్నుల వర్ణం అన్నది ఒక కారణమైతే, ఆ రంగు ముదురు గోధుమ, నలుపు ఛాయలున్న వాళ్లకి అంతగా నప్పదనేది మరో కారణం. కానీ ఇటీవల దీన్ని కూడా తరచూ సీజనల్‌ కలర్స్‌లో ఒకటిగా ఎంపిక చేస్తుండటంతో ఆధునిక, సంప్రదాయ దుస్తులన్నీ ఊదా వన్నెలతో కాంతులీనుతున్నాయి. దాంతో యాక్సెసరీలూ ఆ ఛాయల్లో కనువిందు చేస్తున్నాయి. గ్యాడ్జెట్లూ వాహనాలు సైతం ఊదాతో హుందాగా దౌడు తీస్తున్నాయి. ఇంటిగోడలతోబాటు అలంకరణ వస్తువులు సైతం క్రమంగా ఊదా ఛాయల్ని పులుముకుంటున్నాయి. గదిలో ఒకవైపు గోడకో లేదా తెలుపూ, పసిడి ఛాయల మేళవింపుతోగానీ ఊదా వేస్తే ఆ అందమే వేరు అంటున్నారు నేటితరం ఇంటీరియరిస్టులు.

ఆభరణాల్లో... 
నీలం, కెంపు, పచ్చ, ముత్యం... ఇలా ఆభరణాల్లో ఎన్నో రంగు రాళ్లను వాడుతుంటాం. కానీ పాశ్చాత్యదేశాల్లో ఊదారంగు రాళ్ల వాడకమూ ఎక్కువే. క్వార్ట్‌జ్‌ రాళ్లలో ఐరన్‌ పాళ్లు కలవడంతో ఏర్పడిన ఎమిథిస్ట్‌ అనే సహజాతి రత్నం ఆ రంగులోనే మెరుస్తుంటుంది. ఎమిథిస్ట్‌ శక్తిమంతమైన రత్నం అనేది గ్రీకుల విశ్వాసం. దీన్ని దిండుకింద పెట్టి పడుకుంటే నిద్ర పడుతుందనీ మంచి కలలు వస్తాయనీ నుదుటిమీద రుద్దితే తలనొప్పి తగ్గుతుందనీ చెబుతారు. లవ్‌స్టోన్‌గా పేరొందిన సూజిలైట్‌, మాంగనీస్‌తో ఏర్పడిన పర్పురైట్‌లు కూడా ఊదారంగులోనే మెరుస్తుంటాయి. సూజిలైట్‌ డిస్లెక్సియానీ ఇతరత్రా నొప్పుల్నీ తగ్గిస్తుందని 
విశ్వసిస్తే; పర్పురైట్‌ మెదడుని ఉత్తేజపరుస్తుందట.

ఊదా... ఓ హోదా..! 
నిన్నమొన్నటివరకూ ఊదా రాచరిక హోదాకి సంకేతం. అందుకే దీన్ని రాయల్‌ కలర్‌ అంటారు. చరిత్రలోకి తొంగిచూస్తే, ప్రాచీనకాలంలో రాజులూ సంపన్నులూ బిషప్‌లూ మధ్యయుగంలో ప్రొఫెసర్లు... ఇలా అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్లు మాత్రమే ఈ రంగుని వాడేవారట. దాంతో అప్పట్లో ఇది సంపన్నవర్ణంగా స్థిరపడిపోయింది. బ్రిటన్‌లో చాకొలెట్‌ రేపర్లకి ఎక్కువగా ఈ రంగునే వాడేదీ అందుకేనట. క్యాడ్‌బరీసే ఇందుకు ఉదాహరణ. అంతెందుకు... ఫ్రాన్స్‌లో ఈ రంగుని చిత్తానుసారం ధరించకూడదనే నిబంధన నేటికీ అమల్లో ఉంది. అక్కడి విద్యార్థులను ఆర్ట్స్‌, సైన్స్‌, లా, ఆధ్యాత్మికత... ఇలా రకరకాల విభాగాలుగా విభజించి, వాళ్లకో డ్రెస్‌కోడ్‌ ఇస్తారు. వాళ్లలో ఆధ్యాత్మికవర్గం వాళ్లు మాత్రమే ఊదారంగు ధరించాలి. అత్యున్నత పదవుల్లో ఉన్న విశ్వవిద్యాలయ అధ్యక్షులు, ఫ్యాకల్టీ హెడ్‌లూ కూడా ఈ రంగు ధరించవచ్చట. అలాగే అమెరికా రక్షకదళ సభ్యులు డ్యూటీలో చనిపోయినా గాయపడినా ‘ద పర్పుల్‌ హార్ట్‌’ అన్న అవార్డును ప్రకటించి, వాళ్లను గౌరవిస్తుంటారు.

ఊదా భావోద్వేగాలెన్నో... 
హద్దుల్లేని సృజనాత్మకత, ఆధ్యాత్మికత, కొంచెం అహంకారం లేదంటే అంతర్ముఖులుగా ఉన్నవాళ్లని కదిలించి మీకే రంగు ఇష్టం బాస్‌ అంటే, వాళ్లు ఊదా అని చెబితే ఆశ్చర్యపోకండి. 
ఆ రంగుని ఇష్టపడేవాళ్లకి ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉండే ఉంటుందట. అందుకే ఈ రంగుని ఇష్టపడేవాళ్లు చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, ఖగోళం, జ్యోతిషం, సాహిత్యం, కవిత్వం... వంటి రంగాల్లో స్థిరపడతారని అంటారు రంగుల నిపుణులు. ముఖ్యంగా ఆత్మశోధకులై ఉంటారట. తమ శక్తిసామర్థ్యాలతోబాటు ఎదుటివాళ్లవీ కచ్చితంగా అంచనావేయగల సమర్థులట. కాలాన్ని అస్సలు పట్టించుకోరు. తమకు అనుకూలంగానే జీవిస్తుంటారు తప్ప, రాజీపడరు. అలాగని స్వార్థపరులు కాదు, మానవతావాదులేనట. వాక్చాతుర్యం ఎక్కువే. కానీ కొన్ని సందర్భాల్లో అంతర్ముఖులై పోతుంటారు. కలల్లో విహరిస్తుంటారు. చుట్టుపక్కలవాళ్లతో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు. దాంతో ఒంటరితనంతో బాధపడుతుంటారు. అందుకే అతిగా ఊదారంగుని ధరించవద్దనీ చికాకు, డిప్రెషన్‌ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు కలర్‌ థెరపిస్టులు.

ఆధ్యాత్మిక ‘ఊదా’ 
ఎరుపులోని శక్తినీ నీలంలోని ఆధ్యాత్మికతనీ నింపుకున్న ఊదా, వంకాయ వర్ణాలు భౌతిక, ఆధ్యాత్మిక శక్తులను సమన్వయం చేస్తాయట. ధ్యానం చేసే గదుల్లో ఈ రంగు కాంతిని ఉపయోగించడంవల్ల ఇది నాడుల్ని ప్రేరేపించడం ద్వారా అంతర్గత శక్తిని మేల్కొలుపుతుందట. అందుకే సున్నిత మనస్తత్వంతో బాధపడేవాళ్లు ఈ రంగు కాంతిలో ధ్యానం చేయడంవల్ల ఫలితం ఉంటుందట. ఈ రంగుని ఇష్టపడేవాళ్లు కాలాతీత ఆలోచనలు కలిగిఉంటారనీ ఎంతమందిలో ఉన్నా ప్రకాశవంతంగా కనిపిస్తారనీ చెబుతారు. సో, సప్తవర్ణపటకంలోని ఊదాలో సంగతులెన్నో... మరి మీరూ ఊదాకి ఫిదానేగా..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.