close


క‌థ‌

కొత్తకొత్తగా వచ్చేస్తున్నాయ్‌!

కొత్త సంవత్సరం వచ్చేసింది. సంబరాలు ముగిశాయి. సావకాశంగా ఓసారి భవిష్యత్తులోకి తొంగిచూస్తే... యాభయ్యేళ్ల తర్వాత మళ్లీ చందమామ మనకు దగ్గరవుతున్నాడు. కృత్రిమ మేధ ఇంటినే కాదు ఒంటినీ అలంకరించనుంది. కమ్యూనికేషన్ల రంగంలో మరో మైలురాయి 5జీ వచ్చేస్తున్నానంటోంది. జీవనశైలి జబ్బులకు మేలైన చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది మన ముందుకు తేనున్న ఇలాంటి కొన్ని

విశేషాలు...

మునక్కాడల పులుసూ, మునగాకు పచ్చడీ, టమాటా మునక్కాడల కూరా... పొద్దున్నే నోరూరించే ఈ మునక్కాడల దండకం ఎందుకు గుర్తొచ్చిందంటే మన మునక్కాయ ఈ ఏడాది ‘సూపర్‌ ఫుడ్‌’ బిరుదు తెచ్చుకుంది మరి. మునగ ఆరోగ్యానికి మంచిదని వంటల్లోనే కాదు, ఆయుర్వేద మందుల్లోనూ వాడడం మనకు తెలుసు. అయితే ఆసియా, ఆఫ్రికాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న మునగ రుచిని ఇప్పుడు అమెరికా వాళ్లూ కనిపెట్టేశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగపడే చెట్టు ఏదైనా ఉందీ అంటే అది మునగచెట్టేనని తేల్చేశారు. విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే మునగాకు పొడిని పళ్ల రసాల్లో, స్మూతీస్‌లో చల్లుకుని బలవర్థకమైన ఆహారం తీసుకుంటున్నామని సంబరపడిపోతున్నారు. మునగలో నారింజలోకన్నా విటమిన్‌ సి ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, క్యారట్లలోకన్నా విటమిన్‌ ఏ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, శరీరంలో క్యాన్సర్‌ నిరోధక శక్తిని పెంచుతుందనీ, రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేస్తుందనీ...

ఇలా మునగ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ వరసగా పరిశోధనలు వెలుగు చూడడంతో ఇప్పుడు వారు మునగ చెట్టుకి జైకొడుతున్నారు. మునగ గింజల నుంచి తయారుచేసిన నూనెతో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారుచేస్తున్నారట. ఇవన్నీ చూస్తోంటే ఈ ఏడాది మునగకి చాలా పెద్ద సీనే ఉన్నట్లు కన్పిస్తోంది.

గత ఏడాదే విదేశాల్లో జైత్రయాత్ర ప్రారంభించిన మన పసుపు ఈ సంవత్సరం కూడా సూపర్‌ ఫుడ్స్‌లో ఒకటిగా ప్రస్థానం కొనసాగిస్తుందట. జలుబు నుంచి వృద్ధాప్య ఛాయల్ని తగ్గించడం వరకూ అడుగడుగునా పసుపు ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా మేలు చేస్తుందంటూ అక్కడి పోషకాహార నిపుణులు ఉపన్యాసాలిచ్చేస్తున్నారు. మొత్తానికి పాశ్చాత్య ప్రపంచం సూపర్‌ ఫుడ్స్‌గా పేర్కొంటున్న మొదటి ఐదింటిలో రెండు మనవే.

చందమామని చుట్టొస్తామా! 
తారలు దిగివచ్చే వేళా, మల్లెలు నడిచొచ్చే వేళా... చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి... అని పాడుకున్నవారంతా ఇప్పుడిక అందుకు సరంజామా సిద్ధం చేసుకోవచ్చు. చందమామ మీదికి ప్రయాణానికి ఈ ఏడాదే దారి పడబోతోంది. అంగారకుడి మీద కాలనీలు కట్టేస్తామని అమెరికా వ్యాపారవేత్తలు ఎన్నాళ్లుగానో ఊరిస్తున్నారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికన్నా ముందు చందమామనే ఓ పట్టుపట్టేద్దామని ప్రభుత్వాలూ, ప్రైవేటు సంస్థలూ కలిసి ప్రయోగాలు మొదలెట్టేశాయి. చందమామపై గనులను తవ్వేందుకు రోబో జియాలజిస్టులూ అదంతా చిత్రీకరించి భూమికి పంపేందుకు రోబో వీడియాగ్రాఫర్లూ ప్రయాణానికి రెడీ అవుతున్నారు. ఆ పనులన్నిటినీ పర్యవేక్షించడానికి మనుషులతో ఓ అవుట్‌ పోస్ట్‌ కూడా ఏర్పాటుచేస్తారట.

చందమామ మీద మనిషి నడిచి దాదాపు అర్ధశతాబ్దమవుతోంది. ఇన్నాళ్లూ దాని గురించి బయటకు వార్తలేమీ రాకపోయినా పరిశోధకులు తమ పని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా గూగుల్‌ నిర్వహిస్తున్న లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌ పోటీతో చందమామ మళ్లీ చర్చనీయాంశమయింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ పోటీలో ఐదు జట్లు ఫైనల్‌కి అర్హత సాధించాయి. ఈ ఏడాది మార్చి 31లోపల ఇవి చంద్రుడిమీదికి అంతరిక్షనౌకలను పంపాలి. ఆ నౌకలు చంద్రుడి మీద దిగి, 500మీటర్లు ప్రయాణించి, అక్కడి వీడియోలూ ఫొటోలూ పంపించాలి. ఈ మూడు దశలనూ విజయవంతంగా గడువులోపల పూర్తి చేసిన సంస్థకి గూగుల్‌ ప్రథమ బహుమతి కింద 20 మిలియన్‌ డాలర్లు (రూ.128కోట్లకు పై మాటే) ఇస్తుంది. రెండో బహుమతి కింద 5 మిలియన్‌ డాలర్లూ బోనస్‌ ప్రైజ్‌ కింద మరో 5 మిలియన్‌ డాలర్లూ ఇస్తుంది.

యువ ఇంజినీర్లనూ, శాస్త్రవేత్తలనూ ప్రోత్సహించడానికి ఈ పోటీ పెట్టింది గూగుల్‌. పోటీ పడుతున్న సంస్థలన్నీ చంద్రుడి మీద పలు ప్రయోగాలు చేయబోతున్నాయి.

మన దేశంలో బెంగళూరుకు చెందిన టీమ్‌ ఇండస్‌ కూడా పోటీలో ఉంది. ఏడు యువ శాస్త్రవేత్తల జట్లు దానికి సహకరిస్తున్నాయి. ఒక్కో జట్టూ ఒక్కో రంగానికి చెందిన ప్రయోగాన్ని సిద్ధంచేసి చంద్రుడి మీదికి వెళ్లే అంతరిక్షనౌకతో పంపుతుంది. ఈ పోటీ తర్వాత ఇక మనుషుల చంద్రమండల యాత్రకి దారి ఏర్పడుతుందనీ, మరో ఐదేళ్లలో చంద్రుడి మీద ఓ కాలనీనే ఏర్పాటైపోతుందనీ అంటున్నారు పోటీలో ఉన్న మరో సంస్థ ‘మూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వ్యవస్థాపకులు నవీన్‌ జైన్‌. అధికారికంగా ప్రకటించలేదు కానీ నాసా కూడా ఇద్దరు అంతరిక్ష యాత్రికులతో తొమ్మిది రోజుల పర్యటన నిర్వహించేందుకు సన్నద్ధమవుతోందట.

నిజం ‘టైటానిక్‌’ చూడొచ్చు! 
ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలు చూసి రావాలని తపించే పర్యటక ప్రియులకోసం... తొలి ప్రయాణమే మహా విషాదంగా మారిన టైటానిక్‌ ఓడ గుర్తుందిగా. దానిపై వచ్చిన సినిమా సూపర్‌ హిట్టు. ఆ ఓడ గురించి ఏ చిన్న వార్త వెలువడినా ఇప్పటికీ ఆసక్తిగా చదువుతారు అన్ని దేశాలవారూ. అలాంటప్పుడు సముద్రగర్భంలో 12,500 అడుగుల లోతున మునిగి ఉన్న ఆ ఓడను చూసొచ్చే అవకాశం కల్పిస్తే..? ఈ ఆలోచనే వచ్చింది బ్లూమార్బుల్‌ ప్రైవేట్ అనే పర్యటక సంస్థకి. దానికీ ఓ కారణముంది. మూడున్నర దశాబ్దాల క్రితం సైప్రస్‌ తీరంలో ‘జెనోబియా’ అనే ఓ పెద్ద ఓడ సామగ్రితో సహా మునిగిపోయింది. ఓడ మునిగిన ప్రాంతం తీరానికి దగ్గరగా ఉండడంతో చాలామంది డైవర్లు ఉత్సాహంగా దాన్ని చూడడానికి వెళ్తుంటారు. చివరికి అదో పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. మధ్యధరాసముద్రంలో ఉండడంతో ‘టైటానిక్‌ ఆఫ్‌ ద మెడ్‌’ అని దాన్ని పిలుచుకుంటున్నారు. మామూలు ఓడకే ఇంత క్రేజ్‌ ఉండడం చూసిన బ్లూమార్బుల్‌ కంపెనీకి నిజం టైటానిక్‌నే చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఫలితమే వచ్చే మేలో మొదలవనున్న పర్యటన. అయితే ఒక్క మాట. దానికో టికెట్‌ కూడా ఉంది మరి. టికెట్‌ ధర అప్పటి టైటానిక్‌లో మొదటి తరగతి టికెట్‌ ధర అంతే. కాకపోతే దాని విలువని ఇప్పటి కరెన్సీ విలువలో తీసుకుంటారు. అంటే కనీసం ఓ లక్ష డాలర్ల (రూ. 65 లక్షలు) పై చిలుకు..!

అంత సాహసం మన వల్ల కాదనుకుంటే మరో ఆఫర్‌ కూడా ఉంది. ఇది అంటార్కిటికాలోని పెంగ్విన్ల సామ్రాజ్యానికి.

ఇప్పటివరకూ ఈ మంచుఖండం మీదికి వెళ్లడానికి వివిధ అంశాలపై అధ్యయనాలు చేసే శాస్త్రవేత్తలకు మాత్రమే అవకాశం ఉండేది. చార్టర్డ్‌ ఫ్లైటూ ఆసక్తీ ఉన్న ధనికులెవరైనా అప్పుడప్పుడూ వెళ్లి చూసొచ్చేవారు. ఈ ఏడాది తొలిసారిగా అర్జెంటీనా నుంచి అంటార్కిటికాకి కమర్షియల్‌ ఫ్లైట్‌ నడపనున్నారు. పర్యటకులు క్యూ కడితే ఇక క్రమం తప్పకుండా విమానాలు నడుపుతారట.

ఇల్లే ఆఫీసు! 
2018లో వ్యాపార సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని నిపుణుల అంచనా. ఇప్పటికే అడుగడుగునా మన జీవితాలు టెక్నాలజీ, అంతర్జాలాలతో అనుసంధానమైపోయాయి. నీళ్లు లేకుండా కొన్ని గంటలైనా బతకగలమేమో కానీ నెట్టు లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేమంటోంది యువతరం. ఇది ఇంకా పెరిగి ఇంటినీ ఆఫీసునీ వ్యక్తిగత జీవితాలనీ కూడా ప్రభావితం చేయనుంది. కృత్రిమ మేధా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆటోమేషన్‌ లాంటివి అన్నిచోట్లా ఉనికి చాటబోతున్నాయి. ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకే వెళ్లనక్కరలేదు. ఇంట్లో ఉండి ఆఫీసు పనీ, ఆఫీసులో ఉండి ఇంటిపనీ చేసేసుకోవచ్చు. ఆఫీసులోనే ఉండి ఇంట్లో టీవీ ఆన్‌చేసి మీకిష్టమైన ప్రోగ్రామ్‌ రికార్డు చేసుకోవచ్చు. ఒవెన్‌ సెట్‌ చేయొచ్చు. ఇంటికెళ్లేముందే ఏసీ ఆన్‌చేసి మీకు అవసరమైన ఉష్ణోగ్రత సెట్‌ చేసిపెట్టుకోవచ్చు. ఇన్నాళ్లూ ఎక్కడో ఒకరో ఇద్దరో వాడుతున్న ఇలాంటి హైటెక్‌ హంగులు ఈ ఏడాది సాధారణ విషయాలైపోతాయట. విదేశాల్లో చాలా కంపెనీలు ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగులు తమకు ఇష్టమైన సమయంలో పనిచేసుకోవడానికి వీలుకల్పిస్తే పని వేగంగా, నాణ్యంగా జరుగుతోందని అధ్యయనాల్లో తేలడంతో కొత్తగా వస్తున్న స్టార్టప్స్‌ పూర్తిగా దీని మీదే ఆధారపడుతున్నాయట. దాంతో ఆఫీసు నిర్వహణ ఖర్చు కూడా కలిసివస్తోంది. మన దగ్గర కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మాత్రమే ఇప్పటివరకూ ఆ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే మారుతున్న ట్రెండ్‌ని అందిపుచ్చుకోవడంలో మనమేమీ వెనకబడిపోమనీ ఈ ఏడాది ఆ మార్పు చూస్తామనీ అంటారు డిజిటల్‌ టెక్నాలజీ ట్రెండ్స్‌ నిపుణులు.

కేర్‌టేకర్‌ రోబోలు! 
పిల్లల్ని చూసుకునే రోబోలను చైనా, జపాన్‌లలో కొందరు వాడుతున్నారు కానీ ఇతర దేశాలకు అంతగా రాలేదు. అయితే జపాన్‌కి చెందిన గ్లోబల్‌ బ్రిడ్జ్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ తమ శిశుసంరక్షణ గృహాల్లో సిబ్బంది కొరత ఉండడంతో వెవో అనే రోబోలను ఉపయోగిస్తోంది. పిల్లలను పర్యవేక్షించడానికి రోబోలనూ సెన్సార్లనూ కలుపుతూ కొత్త వ్యవస్థను రూపొందించింది. అది విజయవంతం కావడంతో వచ్చే ఏప్రిల్‌ నుంచీ ఇతర దేశాలకూ వాటిని అమ్మబోతున్నట్లు ప్రకటించింది. అంటే ఇక కేర్‌సెంటర్లూ ప్రిస్కూల్స్‌లో పిల్లల్ని ఆయాల బదులు రోబోలు చూసుకుంటాయన్నమాట.

రేషన్‌కి వేలిముద్ర. ఆఫీసుకు వెళ్తే వేలిముద్ర. అది లేకుండా ఇప్పుడు మనం ఏ పనీ చేయలేని పరిస్థితి కదా. అయితే వేలిముద్ర కన్నా చెవి ముద్ర ఇంకా సురక్షితం అని తేల్చారు చాలాకాలంగా దీనిపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు. కాబట్టి భవిష్యత్తులో చెవిముద్రల్నీ వాడుకోవాల్సి రావచ్చు. దుబాయ్‌లో ఇప్పటికే నేరస్థుల్ని పట్టుకునేందుకు పాదముద్రల్ని వాడుతున్నారు. పాదముద్రలంటే- మనిషి నడిచే తీరూ, అవయవాల కదలికా లాంటివన్న మాట. భద్రత కోసం ఎక్కడికక్కడ కెమెరాల నిఘా ఉంచినా ముఖానికి ముసుగులేసుకుని దోపిడీలూ దౌర్జన్యాలూ చేస్తూనే ఉన్నారు. అందుకని నడక ఆధారంగా వ్యక్తుల్ని గుర్తించే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ని తయారుచేసి విజయవంతంగా వాడుతున్నారక్కడ.

త్వరలోనే చెవి ముద్రల్నీ, చేతి ఆకృతినీ కూడా ఇలా భద్రతాపరమైన అంశాలకు వాడేందుకు విధానాలను రూపొందిస్తారట.

వెండితెర జాతర 
సినీ అభిమానులకైతే ఈ ఏడాది కనుల విందే. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ ఎన్నెన్నో సినిమాలు ఈ సంవత్సరం వెండితెరలను అలంకరించనున్నాయి. రెండేళ్లుగా రూపుదిద్దుకుంటూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో 2.0 ఏప్రిల్‌లో అభిమానుల ముందుకు రానుంది. 2010లో వచ్చిన రోబో సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఒకేసారి తమిళం, హిందీలలో నిర్మించి 15 భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇక ఇప్పటికే పాటలతో, ట్రైలర్లతో దుమ్మురేపిన త్రివిక్రమ్‌, పవన్‌కల్యాణ్‌ల కాంబినేషన్‌ ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి సందడి చేయనున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’ కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. చిరంజీవి ఇందులో నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ‘జైసింహా’ అంటూ బాలకృష్ణా, ‘భరత్‌ అను నేను’ అంటూ మహేష్‌బాబూ, ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ అల్లు అర్జున్‌... అభిమానుల ముందుకు రాబోతుండగా ‘రంగస్థలం’పై రామ్‌చరణ్‌ మెరవనున్నారు. నానీ ‘కృష్ణార్జున యుద్ధం’ చేయనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌,  వెంకటేశ్‌- తేజ కాంబినేషన్లలో కొత్త సినిమాలూ రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌... ఈ ఏడాది సినీ అభిమానులను ఆశగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. హాలీవుడ్‌లోనూ ఏడాది పొడుగునా విడుదలయ్యేందుకు చాలా సినిమాలు వరసకట్టాయి. జురాసిక్‌ వరల్డ్‌- ఫాలెన్‌ కింగ్‌డమ్‌, అవెంజర్స్‌- ఇన్‌ఫినిటీ వార్‌, ది ఇన్‌క్రెడిబుల్స్‌-2, మిషన్‌: ఇంపాజిబుల్‌6 లాంటి సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

పోటీలే పోటీలు! 
ఈ ఏడాది క్రీడాకారులకు సందడే సందడి. ఒలింపిక్స్‌ తర్వాత అంతగా ఆదరణ పొందిన ఆసియా క్రీడోత్సవాలు ఈసారి ఇండొనేషియాలోని జకార్తాలో జరుగుతున్నాయి. ఆగస్టులో మొదలయ్యే ఈ క్రీడలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ-స్పోర్ట్స్‌ను తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీ పడే ఒక అంశంగా చేరుస్తున్నారు. దాంతో ఇప్పటివరకూ ప్రైవేటు పోటీలకు పరిమితమైన ఈ-స్పోర్ట్స్‌ జట్లు ఆసియా క్రీడోత్సవాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే... జకార్తా ఆసియా క్రీడల మౌలిక వసతులన్నీ ఎలాంటి కర్బన ఉద్గారాలూ వెలువడకుండా, పర్యావరణహితంగా ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. యూరోప్‌కి చెందిన ఐఎంఎస్‌ ఈక్యూబ్‌ అనే సంస్థ ఈ నిర్మాణాలను చేపడుతోంది.

నాలుగేళ్లకోసారి జరిగే మంచు ఆటల సంబరాలు - వింటర్‌ ఒలింపిక్స్‌ ఫిబ్రవరిలో దక్షిణకొరియాలో ప్రారంభమవుతాయి. మరో క్రీడాసంబరం ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ కూడా ఈ ఏడాది జూన్‌-జులైలలో రష్యాలో జరుగనుంది. ఫుట్‌బాల్‌ క్రీడకు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే పోటీల్లో మనదేశం పాల్గొనకపోయినా అభిమానుల్లో మాత్రం నంబర్‌ వన్‌ స్థానం మనదేనట. అమెరికా, ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీలలో కలిపి ఎంత మంది ఫుట్‌ బాల్‌ అభిమానులున్నారో అంతకన్నా ఎక్కువ మంది ఒక్క మనదేశంలోనే ఉన్నారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ వచ్చాక ఫుట్‌బాల్‌కి దేశంలో ఆదరణ బాగా పెరిగింది. ఈ ప్రపంచ కప్‌ దానిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

* * *

ఇవన్నీ ఇప్పటివరకూ తెలిసిన... ఈ ఏడాది జరగబోయే విశేషాలు. ఇక తెలియకుండా జరిగేవి ఇంకెన్నుంటాయో! ప్రగతి దిశగా పరిశోధనలూ అధ్యయనాలూ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ప్రయోగదశ దాటి పలు పరీక్షలను తట్టుకుని నిలిచి గెలిస్తేనే అవి ప్రజలదాకా వస్తాయి. పైన చెప్పుకున్నవన్నీ అలా వచ్చినవే. ఇలాంటి ఇంకెన్నో మంచి విశేషాలకు ఈ ఏడాది సాక్షిగా నిలవాలనీ, చరిత్రలో 2018 అభ్యుదయ నామ సంవత్సరంగా నిలవాలనీ ఆకాంక్షిద్దాం.

ఈ చికిత్సలు వచ్చేస్తాయి!  

ఈ సంవత్సరం వైద్యరంగం కొన్ని ఆశాజనకమైన మార్పులకు వేదిక కానుంది. 
* క్యాన్సర్‌ బాధితులకు కీమోథెరపీ ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే కూల్‌క్యాప్‌ అన్ని అనుమతులూ పొంది ఈ ఏడాది మార్కెట్లోకి రానుంది. కీమోథెరపీ సమయంలో దీన్ని ధరిస్తే శరీరానికి చల్లగా ఉంటుందట. జుట్టు ఊడడం కూడా తగ్గుతుందట.

* వేరొక ప్రాంతంలో ఉన్న రోగికి టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ సహాయంతో వైద్యుడు చికిత్స చేయడం(టెలిమెడిసిన్‌) మన దగ్గర అడపాదడపా జరుగుతోంది. అమెరికాలో గత ఐదేళ్లలో ఈ సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్య 19 రెట్లు పెరిగింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతనూ, సేవలను వినియోగించుకునేవారి సంఖ్యనూ చూస్తుంటే అది ఈ ఏడాది ఇతర దేశాల్లోనూ మరింతగా ఆదరణ పొందుతుందని నిపుణుల అంచనా.

* చెడు కొవ్వు (ఎల్‌డీఎల్‌) రక్తనాళాలకు అవరోధంగా మారి గుండెజబ్బులకు తద్వారా ఆకస్మిక మరణాలకూ దారితీస్తుంటుంది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త మందు ఒకటి ఈ ఎల్‌డీఎల్‌ స్థాయులను 75 శాతం తగ్గించగలుగుతోందట. దీని వల్ల మరణాలూ గణనీయంగా తగ్గుతాయనీ ఈ ఏడాది ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందనీ వైద్యరంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

* టైప్‌ 1 మధుమేహాన్ని నియంత్రించగలిగే కొత్త చికిత్స ఒకటి(హైబ్రిడ్‌ క్లోజ్‌డ్‌ లూప్‌ ఇన్సులిన్‌ డెలివరీ సిస్టమ్‌) 2016లోనే ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. ఇది ఈ ఏడాది బాధితులకు అందుబాటులోకి రానుంది. ఎక్కువ మంది దీనిని వాడడం మొదలుపెడితే టైప్‌ 2 మధుమేహానికి కూడా అలాంటి చికిత్సనే అభివృద్ధి చేయొచ్చని శాస్త్రవేత్తలు చూస్తున్నారు.

* ఆనువంశికంగా వచ్చే రెటీనా వ్యాధులను నయం చేయడానికి అభివృద్ధిపరిచిన కొత్త జీన్‌థెరపీ  కూడా ఈ ఏడాది ఎఫ్‌డీఏ అనుమతి పొందనుంది. ఇది అనుమతి పొందితే ఇంకా కొన్ని జన్యుచికిత్సలకు మార్గం సుగమమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

* ఏదైనా ఒక వ్యాక్సిన్‌ తయారుకావాలంటే ఇప్పటివరకూ పదేళ్ల సమయమూ వేలకోట్ల రూపాయల ఖర్చూ అయ్యేది. ఇటీవల తలెత్తిన ఎబోలా, జికా వ్యాధుల్ని చూశాక వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించారు. తక్కువ సమయంలో తయారై ఎక్కువ జనాభాకి అందుబాటులోకి వచ్చేలా వ్యాక్సిన్లను రూపొందించి, రవాణా చేసే కొత్త ప్రక్రియల అభివృద్ధికి ఈ ఏడాది వేదిక కానుంది. కొత్త ఫ్లూ వ్యాక్సిన్‌ కూడా ఈ ఏడాదే మార్కెట్లోకి రానుంది.

కారు తాళాలతోనూ చెల్లించొచ్చు!  

వ్యాపార, ఆర్థిక రంగాల్లో కొత్త సంవత్సరం తెచ్చే సాంకేతిక మార్పులూ ఆసక్తికరమే. 
* ఇప్పటివరకూ డబ్బు లావాదేవీలను కార్డులతోనూ, ఆన్‌లైన్లో కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్లతో నిర్వహిస్తున్నాం. ఇక ముందు కారు తాళాలూ, స్పోర్ట్స్‌ వాచీలు... ఇలా చాలా పరికరాలు పేమెంట్‌ 
పరికరాలుగా మారనున్నాయి. బ్యాంకింగ్‌ సేవల్లో కృత్రిమ మేధ వినియోగం పెరగడంతో ఇలా మనం వాడే వ్యక్తిగత పరికరాలకు ఖాతాలను లింక్‌ చేయడం సాధ్యం కానుంది.

* 2018 చివరికల్లా అమెరికాలోని ఐదు నగరాల్లో 5జీ వైర్‌లెస్‌ రెసిడెన్షియల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రారంభిస్తామని వెరిజాన్‌ సంస్థ ప్రకటించింది. వింటర్‌ ఒలింపిక్స్‌లో దీన్ని తొలిసారి వాడి 
చూడనున్నట్లు సమాచారం.

* వ్యాపార రంగంలో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌... డబ్బు కట్టి సేవలను అందుకునే పద్ధతి ఈ ఏడాది ప్రధాన అంశం కానుంది. ఇప్పటివరకూ ఈ పద్ధతిని అనుసరిస్తున్న సంస్థలు లాభాలనార్జించడంతో ఇతర సంస్థలూ అదే బాట పట్టనున్నాయి.

* ఇన్నాళ్లూ మిలెనియల్స్‌ని దృష్టిలో పెట్టుకుని నడిచిన మార్కెటింగ్‌ రంగం ఇప్పుడు 30ప్లస్‌ వారిపై దృష్టి పెట్టనుంది.

* ఇంటరాక్టివ్‌ మార్కెటింగ్‌... అంటే వినియోగదారు నేరుగా సంస్థతో సంభాషించి సేవలు పొందే  విధానం విస్తృతమవుతుంది. తద్వారా ఆన్‌లైన్‌ వ్యాపార రంగంలో విశ్వసనీయతను పెంపొందించే ప్రయత్నాలపై సంస్థలు దృష్టిపెడుతున్నాయి.

కృత్రిమ మూత్రపిండాలు!

2018లో అనుమతులు పొంది వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి ఎదురుచూస్తున్న కొత్త పరికరాలు కొన్ని... 
* డయాలసిస్‌ రోగులకోసం కృత్రిమ మూత్రపిండాలను తయారుచేసింది కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధక బృందం. మార్పిడికి కిడ్నీలు దొరకనప్పుడు వీటిని శరీరంలోపలే అమర్చవచ్చు. డయాలసిస్‌ కోసం రోగి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఈ ఏడాది వీటిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.

* వాస్తవ ప్రపంచాన్నీ డిజిటల్‌ సమాచారాన్నీ కలగలిపే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఇప్పుడు ఓ గిమ్మిక్‌లా కన్పిస్తున్నా త్వరలోనే ఈ టెక్నాలజీ స్మార్ట్‌ ఫోన్లలోకి వచ్చేస్తోంది. ఏఆర్‌ హెడ్‌సెట్లూ రానున్నాయి. ఉదాహరణకు స్నాప్‌చాట్‌ వినియోగదారులు బీఎండబ్ల్యూ కారు కొనకుండానే అది రోడ్డు మీద నడిపేటప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో చూడవచ్చు. అందుకు స్నాప్‌చాట్‌ బీఎండబ్ల్యూతో కలిసి ఓ ప్రోగ్రాం సిద్ధం చేసుకుంటోంది.

* హెచ్‌పీ కంపెనీ తయారుచేసిన కొత్త కంప్యూటర్‌ ‘ద మెషీన్‌’ మార్కెట్లోకి వస్తోంది. ఇప్పుడున్న సర్వర్లకన్నా ఆరు రెట్లు శక్తిమంతమైన ఈ కంప్యూటర్‌ని బిగ్‌ డేటా అవసరాలకోసం వినియోగిస్తారు.

*  అంధులకోసం బ్రెయిలీ ఈ-రీడర్‌ని తయారుచేసింది బ్రిస్టల్‌ బ్రెయిలీ టెక్నాలజీ సంస్థ. కాన్యూట్‌ అనే ఈ పరికరం వేలాది ఈ బుక్స్‌ని నిల్వచేసుకోగలదు. ఇతర బ్రెయిలీ పరికరాలతో పోలిస్తే చాలా చౌక. అంధుల ఉపాధి కల్పనకు తోడ్పడడం దీని ముఖ్యోద్దేశం.

* తల్లిపాలను తీసి నిల్వ చేసే బ్రెస్ట్‌ పంప్‌ మరింత ఆధునికంగా రూపొందింది. రొమ్ము ఆకృతిలో చిన్నగా దుస్తుల్లో అమర్చుకోవడానికి వీలయ్యేలా ఉండి బ్యాటరీతో పనిచేస్తుంది. తల్లి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కప్‌లోనే అమర్చిన ప్యాకెట్‌లోకి పాలను సేకరిస్తుంది. ఆ ప్యాకెట్‌ తీసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే చాలు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ పరికరం ఈ ఏడాది చివరికల్లా ఉపయోగంలోకి రావచ్చట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.