close


సెంట‌ర్ స్ప్రెడ్

పచ్చా కెంపూ... కలగలుపు..!

కొన్ని రంగుల మేళవింపు ఎంతచూసినా తనివితీరదు. కొత్త కాంబినేషన్లు ఎన్ని పుట్టుకొచ్చినా వాటి అందం కళ్లను కట్టిపడేస్తుంది. కొన్ని నగలూ అంతే, ఎప్పటికీ పాతబడవు. తరాలు మారుతున్నా అవి తళుకులీనుతూనే ఉంటాయి. ఆ రంగుల సమ్మేళనం ఎరుపూ ఆకుపచ్చలదయితే, ఆ నగల మెరుపు కెంపులూ పచ్చలది. అందుకే ఎన్ని వర్ణాల రత్నాభరణాలున్నా మగువల మనసు దోచుకునే సౌందర్యం మాత్రం పచ్చలూ కెంపుల కలగలుపు నగలదే..!
బంగారం ధర ఎంత పెరిగినా భారతీయులకి ఆభరణాలమీద మోజు ఎప్పటికీ తగ్గదు. అందుకే మార్కెట్లో రోజుకో నగల ట్రెండ్‌ పుట్టుకొస్తుంది. దుస్తుల్లో మాదిరిగానే జ్యువెలరీలోనూ ఫ్యాషన్లు వస్తూపోతూ ఉంటాయి. అచ్చంగా బంగారంతో చేయించుకునే డిజైన్లు కొంతకాలం ఫ్యాషనయితే, రాళ్ల నగలు మరికొంతకాలం రాజ్యమేలేవి. కానీ ఇప్పుడలా కాదు, దుస్తుల్ని మార్చినట్లే వాటికి మ్యాచయ్యేలా నగల సెట్స్‌నీ మార్చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో కట్టుకునే చీర, లంగావోణీలను బట్టి నగల ఎంపికా మారిపోతుంది. దాంతో అటు బంగారు నగల్లో యాంటిక్‌, టెంపుల్‌, నక్షీ, తుషి... అంటూ రకరకాల డిజైన్లు వస్తుంటే; ఇటు రాళ్ల నగల్లో వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, కెంపులూ... అంటూ దేనికది రకరకాల డిజైన్లలో వస్తున్నాయి. కానీ ఎన్ని రకాలున్నా కెంపులూ పచ్చలూ కలగలిసిన అందమే వేరు అంటారు డిజైనర్లు.

ఆనందం... ఆహ్లాదం..!
ఒకప్పుడు రాళ్లనగలు అంటే ఎక్కువగా కెంపులూ పచ్చలతో చేసినవి మాత్రమే ఉండేవి. లేదంటే కాస్త తక్కువ ధరలో వచ్చే అమెరికన్‌ డైమండ్స్‌, సీజెడ్స్‌, జేడ్స్‌... వంటి సహజాతి రత్నాలు ఉండేవి. కానీ ఈమధ్య సంపన్న వర్గాల్లో వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలు, సీపెరల్స్‌తో చేసిన నగల్ని ధరించడం పెరిగింది. సందట్లో సడేమియాలా వీటిమధ్య ఉత్తరాదిన కనిపించే కుందన్‌కారి, మీనాకారి, పోల్కీ నగలూ మురిపిస్తున్నాయి. కానీ ఎన్ని వచ్చిపోతున్నా కెంపులూ పచ్చల నెక్లెస్‌ల హవా ఎంతమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ‘ఎర్రని గులాబీల్ని చూస్తే కలిగే ఆనందాన్నీ పచ్చని పైరుని చూసినప్పుడు కలిగే ఆహ్లాదాన్నీ ఏకకాలంలో అందించేవే కెంపులూ పచ్చలూ. అందుకే అవి ఎవర్‌గ్రీన్‌ కాంబినేషన్‌’ అంటారు జెమాలజిస్టులు. ఆ రంగుల అందంవల్లే సంప్రదాయ మహిళలతోబాటు ఈతరం అమ్మాయిలు సైతం కెంపూపచ్చా కలిసిన నగ ఒక్కటైనా తమ నగలపెట్టెలో ఉండేలా చూసుకుంటున్నారు. పైగా ఒకప్పటిలా కనీకనిపించని చిన్నసైజు రాళ్లని కాకుండా బంగారం తక్కువ, రాళ్ల సైజు పెద్దగా కొట్టొచ్చినట్లు కనిపించేలా నగల్ని చేయడంతో అవి అమ్మాయిల మెడల్లో మరింత అందంగా మెరుస్తున్నాయి. ఇక, డిజైన్ల సంగతయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాశ్చాత్య డిజైన్లకు దేశీ నగిషీలను జోడించి మరీ తయారుచేస్తున్నారు డిజైనర్లు. వీటిని కూడా డైమండ్‌, కుందన్‌ నగల్లో మాదిరిగా కత్తిరించి, పూలూ ఆకులూ కలగలిసినట్లూ రూపొందిస్తున్నారు. సంప్రదాయ మామిడిపిందె డిజైన్లతోబాటు ముత్యాలతో చేసే గుత్తుల హారాల డిజైన్లలో కూడా కెంపులూ పచ్చల్నీ నాలుగైదు వరసల్లో అమరుస్తున్నారు. మెడనిండుగా కనిపించే ఈ రకం నెక్లెసుల్ని పెళ్లిళ్లూ రిసెప్షన్లకి అలంకరించుకుంటే, రెండుమూడు వరసల్లో సింపుల్‌గా చేసినవి పుట్టినరోజూ, పెళ్లిరోజు వేడుకలకి పెట్టుకునేలా ఉంటున్నాయి.

ప్రేమ కానుకలు!
రాళ్లనగల్లో ఎక్కువగా కలగలిపి వాడేది కెంపుల్నీ పచ్చల్నే అయినప్పటికీ ఈ రెండూ ఒకే రకానికి చెందవు. నేలపొరల్లో గూడుకట్టుకున్న అల్యూమినియం ఆక్సైడ్‌(కోరండమ్‌)నే కెంపుగా చెబుతారు. ఈ కోరండమ్‌కి ఏ రంగూ ఉండదు. దీనికి కొద్దిపాళ్లలో కొన్ని మూలకాలు కలిసినప్పుడు అది రకరకాల రంగుల్లో ప్రకాశిస్తుంది. ఉదాహరణకు క్రోమియం కలిస్తే గులాబీ, క్రోమియం శాతం మరీ ఎక్కువగా ఉంటే ఎర్రని ఎరుపురంగునీ సంతరించుకుంటుందన్నమాట. అందుకే కెంపులన్నీ ఎర్రగా ఉండవు. ముదురు గులాబీ, లేతగులాబీ, నారింజ కలిసిన గులాబీ వర్ణాల్లో దొరుకుతాయి. 1980లలో రత్నాల్లో కెంపుల ధర చాలా  ఎక్కువగా ఉండేదట. ఎందుకంటే వజ్రాలతో పోలిస్తే నాణ్యమైన కెంపులు చాలా అరుదుగా దొరకడంతో క్యారెట్‌ కోటిరూపాయల వరకూ కూడా అమ్ముడుపోయేదట. సాధారణంగా కెంపుల పరిమాణం పెరిగేకొద్దీ రంగూ నాణ్యతా తగ్గుతాయి. కాబట్టి పెద్దవి కావాలనుకుంటే రాజీ తప్పదు. కెంపుల్లో మలినాలు మరీ ఎక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది. అలాంటి కెంపుల్లో మెరుపూ పారదర్శకత తక్కువ. పూర్వం రత్నాలన్నింటిలోకీ కెంపుల్నే రాజుగా భావించేవారట. వీటిని ధరిస్తే కోరికలు తీరతాయనీ అనారోగ్యాన్ని తగ్గిస్తాయనీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుందనీ నమ్మేవారట. ఇప్పటికీ హృదయాకారంలో కత్తిరించిన కెంపుల్ని ప్రేమకానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు ప్రేమికులు.

బెరీలియం అల్యూమినో సిలికేట్‌(బెరైల్‌) అనే ఖనిజమే పచ్చకి మూలం. ఇందులో కొద్దిపాళ్లలో క్రోమియం, వెనీడియం కలవడంతో అది ‘పచ్చ’వర్ణంలో శోభిస్తుంది. పచ్చల్లో కూడా లేత రంగువే ఎక్కువ పారదర్శకంగా ఉండి బాగా మెరుస్తాయి. ముదురురంగులో పారదర్శకంగా మెరిసేవి అరుదు. అలాంటి పచ్చలు వజ్రాల ధరతో పోటీపడతాయి. కొలంబియా పచ్చలు అన్నింటిలోకీ మేలైనవిగా చెబుతారు. ఆనాటి రాజుల కిరీటాలూ సింహాసనాల్నీ చూస్తే వజ్రాలతో సమానంగా పచ్చల ధగధగలూ కనిపిస్తాయి. అప్పట్లో క్లియోపాత్రాకి పచ్చలంటే తగని ఇష్టమట. దాంతో ఆమె దగ్గరే పచ్చలు ఎక్కువగా ఉండేవట. మనదగ్గర మొఘల్‌ చక్రవర్తులందరూ పచ్చల ప్రేమికులే. ఆకుపచ్చని ఈ రత్నాన్ని తదేకదీక్షతో చూస్తే కంటికి మంచిదట. పోయిన కంటిచూపు కూడా తిరిగొస్తుంది అంటారు. అందుకే నీరో చక్రవర్తి గ్లాడియేటర్‌ యుద్ధాల్ని పారదర్శక పచ్చల్లోంచి చూసేవాడట. పచ్చలు మూర్ఛ వ్యాధుల్ని నివారిస్తాయనీ జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయనీ విశ్వసిస్తారు. పూర్వం ప్రేమికులు వీటిని ధరిస్తే ఒకరి మనసులోని భావాలు మరొకరికి సులభంగా అర్థమవుతాయనీ నమ్మేవారట. వీటి ధర కూడా పరిమాణం, స్వచ్ఛత, రంగు, కత్తిరింపుని బట్టి 500 నుంచి 50 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. మొత్తమ్మీద ఈ రెండు రత్నాల్లో వేటి అందం వాటిదే. దేని గొప్పదనం దానిదే. కానీ ఈ రెండింటి కలయిక మాత్రం ఆభరణానికే అందం. అందుకే అప్పుడూ ఇప్పుడూ ఎప్పడూ కెంపులూపచ్చలూ సువర్ణశోభిత రత్నాల నగలై అమ్మాయిల మెడల్లో అందంగా మెరుస్తూనే ఉంటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.