close


సేవ/స్ఫూర్తి/జ‌న‌ర‌ల్

నచ్చిన సినిమా చూస్కోండి!

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌లలో సినిమాలు వచ్చాక చాలా మంది ఫోన్‌, ల్యాప్‌టాప్‌లోనే నచ్చిన సినిమాల్ని చూసి ఆనందిస్తున్నారు. కానీ సినిమా చూడ్డం అంటే కేవలం ఒక్కరే హెడ్‌ఫోన్‌ పెట్టుకుని చూడ్డం కాదు గదా! పది మంది స్నేహితులతో కలిసి సినిమా చూస్తే అదో మజా. అందుకే నచ్చిన సినిమాని థియేటర్లో చూసే అవకాశం కల్పిస్తున్నాయి ఈ సంస్థలు.

సినీ, వ్యాపార ప్రముఖులకు ఇంట్లోనే మినీ థియేటర్లు ఉండటం గురించి చదివే ఉంటారు. దాంట్లో కుటుంబ సభ్యులూ, స్నేహితులతో సరదాగా తమకు కావాల్సిన సినిమా వేసుకుని చూస్తుంటారు వాళ్లు. అలాంటి అనుభవాన్ని సామాన్యులకూ కల్పిస్తోంది టెరిఫ్లిక్స్‌. బెంగళూరులో ఉండే ఈ థియేటర్‌ని మైక్రో థియేటర్‌ అనొచ్చు. 135 అంగుళాల తెర, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌, ఫుల్‌ హెచ్‌డీ ప్రొజక్షన్‌ లాంటి సదుపాయాలుండే ఈ థియేటర్లో 18మంది సినిమా చూడొచ్చు. రెండు నుంచి నాలుగు గంటలవరకూ అద్దె చెల్లించి ఈ థియేటర్‌లో ఎవరైనా సినిమాలు చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌ లాంటి సంస్థల అకౌంట్‌ ఉంటే వాటిలో లాగిన్‌ అయి అక్కడుండే సినిమాలూ, డాక్యుమెంటరీల్ని ఈ తెరమీద చూడొచ్చు. లేదంటే మనకు నచ్చిన సినిమా డీవీడీల్నీ, షార్ట్‌ఫిల్మ్స్‌నూ చూసుకోవచ్చు. కొన్నిసార్లు వీరి దగ్గర అందుబాటులో ఉన్న ఫీచర్‌ ఫిల్మ్స్‌ వివరాలు వెబ్‌సైట్లో పెడతారు. ఎవరైనా బృందంగా ఆ సినిమా చూడాలనుకుంటే అలా కూడా చూడొచ్చు. ఎంపీ4, బ్లూరే, డీసీపీ లాంటి ఫార్మాట్‌లలో సినిమాన్ని చూసినపుడు ప్లేబ్యాక్‌ సదుపాయం కూడా ఉంటుంది. సినిమా చూశాక బయట వరండాలో కాసేపు కూర్చొని వాటి గురించి చర్చించుకోవచ్చు. తమ తాతతండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని ఏం చేద్దామా అని ఆలోచించినపుడు ప్రశాంత్‌, ప్రవీణ్‌లకు ఈ ఆలోచన వచ్చిందట. న్యాయపరమైన అడ్డంకులేవీ రాకుండా చూసుకుని గతేడాది సెప్టెంబరులో థియేటర్‌ ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచన కదా!

నచ్చిన సినిమా వేస్తారు...
పీవీఆర్‌... దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఎన్నో థియేటర్లు ఉన్నాయి. వాటిలో ఎన్నో రిలీజ్‌ సినిమాలు ఆడతాయి. అది తెలిసిన విషయమే, కానీ మనకు ఇష్టమైన సినిమాని హాల్లో చూడాలనుకుంటే కూడా వీరు ప్రేక్షకుల కోరిక మేరకు ఆ సినిమాని ప్రదర్శిస్తారు. ఈ సంస్థ వెబ్‌సైట్‌/ఆప్‌ ‌్రఁ్చ్చ్నకు చందాదారులుగా ఉండేవాళ్లు అమెజాన్‌, హాట్‌స్టార్‌లానే అక్కడ ఉండే సినిమాల్నీ, డాక్యుమెంటరీలనీ కొంత మొత్తం చెల్లించి చూడొచ్చు. దీంట్లో ఇంకో సదుపాయమూ ఉంటుంది. అదే నచ్చిన సినిమాని థియేటర్లో చూడటం. ఏదైనా సినిమాని ఫలానా ఊళ్లో, ఫలానా తేదీన చూడాలనుకుంటున్నట్టు చెబితే ఆ సినిమాని మీరుండే నగరం/పట్టణంలోనే ప్రదర్శిస్తారు. అయితే థియేటర్లో సీట్లని బట్టి కనీసం 30-100 మంది ఆ సినిమా చూడ్డానికి ఇష్టపడితేనే ప్రదర్శిస్తారు. సాధారణంగా అన్నిచోట్లా రిలీజ్‌కాని హాలీవుడ్‌ సినిమాల్నీ, ప్రాంతీయ భాషా చిత్రాల్నీ, పాత సినిమాల్నీ ఈ విధంగా చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద తీసిన డాక్యుమెంటరీ ‘ఏన్‌ ఇన్‌సిగ్నిఫికెంట్‌ మ్యాన్‌’ని థియేటర్లలో చూస్తామని ప్రేక్షకులు కోరడంతో పీవీఆర్‌ సంస్థ 50 థియేటర్లలో 200 షోలు ఏర్పాటుచేసింది. అలాగే చిన్న సినిమాగా రిలీజైన మలయాళీ చిత్రం ‘ఎస్‌ దుర్గ’ మంచి ప్రశంసలు అందుకోంది. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ ఆ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు కోరడంతో వందకు పైగా థియేటర్లలో ప్రదర్శించారు.

 

అభిమాన థియేటర్లో...
బాహుబలి మళ్లీ చూస్తారా, దిల్‌వాలే ఇంకోసారి చూడాలనిపిస్తోందా, గాంధీ జీవితకథని తెరపై వీక్షించాలనుకుంటున్నారా... ఇవే కాదు ‘క్రీడా సినిమాలూ, సైన్స్‌ ఫిక్షన్లూ, డాక్యుమెంటరీలూ... ఏవి కావాలంటే ఆ సినిమాల్ని వెండితెరపైనే చూపిస్తాం’ అంటోంది 1018ఎంబీ సంస్థ. దీని కోసం మనం చేయాల్సిందల్లా సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం ఉండే ప్రాంతం, వారి లైబ్రరీలో ఉన్న సినిమాల్లోంచి మనం చూడాలనుకుంటున్న సినిమా, ఇంకా తేదీ- సమయం, థియేటర్‌ మొదలైన వివరాలు ఇస్తే చాలు. వారు ఆ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తారు. అయితే ఒక షరతు... సినిమాకి కనీస సంఖ్యలో ప్రేక్షకులు ఉంటేనే!  2015లో కొద్దిమంది స్నేహితులు కలిసి ఈ సంస్థను ప్రారంభించారు. కొత్త సినిమాల్ని ఇప్పుడు చాలామంది థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. కానీ కొత్తతరానికి పాత సినిమాల్ని థియేటర్లో చూసే అవకాశం లేదు. ఆ లోటుని దృష్టిలో పెట్టుకునే 1018ఎంబీని ప్రారంభించారు. పాత సినిమాల్ని కొత్త స్క్రీన్లమీద ప్రదర్శించినపుడు కొన్ని సాంకేతిక సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించేందుకు ఈ సంస్థ సొంతంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా వెయ్యి ప్రదర్శనలు ఏర్పాటు చేసిందీ సంస్థ. మరెందుకు ఆలస్యం థియేటర్లో చూడాలనుకుంటున్న సినిమాల లిస్టు తయారుచేసుకోండి!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.