close


క‌థ‌

గేమ్‌ పాయింట్‌ 


- ఉమా మహేష్‌ ఆచాళ్ళ

‘‘రెడీ... గేమ్‌ పాయింట్‌ - నైన్‌’’ అంటూ ఎడంచేత్తో రాకెట్‌నీ కుడిచేత్తో షటిల్‌కాక్‌నీ పట్టుకుని సర్వీస్‌ చెయ్యడానికి సిద్ధమయ్యాడు ప్లేయర్‌ నంబర్‌ ఫైవ్‌ రామ్మూర్తి. 
అవతల కోర్ట్‌లో ప్లేయర్‌ల మొహంలో టెన్షన్‌. నెట్‌కి అంగుళం హైట్‌లో దూసుకొచ్చిన కాక్‌ని పైనుంచి 
కొట్టలేక కిందనుంచి బలంగా స్కైలెవెల్‌లో అవతల కోర్ట్‌ బేస్‌లైన్‌ దగ్గరకి పంపాడు ప్లేయర్‌ నంబర్‌ త్రీ జాఫర్‌. 
అంతే, రామ్మూర్తి వెనక ఉన్న అతని పార్టనర్‌ నంబర్‌ వన్‌ విష్ణు 
ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి, బలంగా కొట్టిన బేస్‌లైన్‌ స్మాష్‌కి 
ఆ కాక్‌ తిరిగొచ్చి నంబర్‌ త్రీ ఛాతీకి తగిలి కిందపడింది. 

‘‘శబాష్‌ రా విష్ణూ, గేమ్‌ ఓవర్‌’’ అంటూ గాల్లోకి ఎగిరి, విష్ణుని కౌగిలించుకుని, ఆనందంగా కోర్ట్‌ బయటకి వచ్చాడు రామ్మూర్తి. 
విష్ణు అవతలి ప్లేయర్‌కి షేక్‌హ్యాండ్‌ 
ఇచ్చి, కాక్‌ తగిలినందుకు సారీ చెప్పి 
బయటికి వచ్చాడు. 
నలుగురూ అలసటగా చెమటలు కక్కుతూ అక్కడున్న గట్టు మీద కూర్చోగా, 
మిగలిన నలుగురూ కోర్ట్‌లోకి ప్రవేశించారు నెక్స్ట్‌గేమ్‌ ఆడటానికి. 
గట్టు మీదున్న తొమ్మిదో ప్లేయర్‌ ‘‘ఏమండీ రామ్మూర్తిగారూ, బాగా ఇరగదీశారు. రోజురోజుకీ మరీ కుర్రాడైపోతున్నారు. మిమ్మల్నెవరూ కొట్టలేరండీ బాబూ’’ అన్నాడు నవ్వుతూ. 
‘‘ఆ ఆయనదేముందిలెండి, అంతా వాళ్ళ అబ్బాయి ఆడిందే. అతన్ని అడ్డుపెట్టుకుని ఈయన రెచ్చిపోతున్నాడు కోర్టులో’’ అన్నాడు వెటకారంగా ప్లేయర్‌ నంబర్‌ సిక్స్‌ చౌదరిట్రయల్‌ ఆడుతూ. 
‘‘ఆఁ... మీరు కూడా మీ అబ్బాయిని తెచ్చుకోవచ్చుగా, ఎవరొద్దన్నారు. అయినా, మీరు చెప్పినట్టు మావాడు నావైపు ఉన్నంతకాలం, ఈ అరవై అయిదేళ్ళ షుగర్‌ పేషెంట్‌ని సైతం ఎవ్వడూ కొట్టలేడు’’ అంటూ, వెళ్తూవెళ్తూ ‘‘అందరికీ ఇదే చెప్పడం... నేను ఇరవైరోజులు సెలవు. ఉత్తర భారతదేశం యాత్రలకి వెళ్తున్నా. మళ్ళీ నెక్స్ట్‌మంత్‌ కలుద్దాం’’ అంటూ లేచి బ్యాట్‌ని బ్యాగులో సర్ది, వాటర్‌బాటిల్‌లోంచి కొద్దిగా నీళ్ళు తాగి ఇంటికి బయలుదేరాడు రామ్మూర్తి. 
అది ఆ కాలనీలో ఉన్న ఓ షటిల్‌ కోర్ట్‌. ఓపెన్‌ కోర్ట్‌ అయినా, చుట్టూ బిల్డింగ్స్‌ ఉండటంతో పెద్దగా గాలి ఇబ్బందేమీ ఉండదు. రోజూ దాదాపు పన్నెండుమంది ఉదయమే అయిదున్నరకల్లా అక్కడికి చేరుకుంటారు. వర్షంపడితేనో, ఎవరైనా ఊరెళితేనో తప్ప దాదాపు అన్ని రోజులూ అందరూ హాజరవుతారు. అందరూ నలభై అయిదు నుంచి అరవై అయిదులోపు వయసువాళ్ళు. పొద్దున్న పది వరకూ మంచం దిగని ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళకి వీళ్ళో పాఠం. ఆటలో నైపుణ్యం కోసం కాకపోయినా, ఆరోగ్యం కోసం మొదలెట్టి నెమ్మదిగా అదో మంచి వ్యసనంగా మారింది వాళ్ళకి. చౌదరిగారు, వర్మగారు, జాఫర్‌, జోసెఫ్‌, పట్నాయక్‌, శర్మగారు... ఇలా వాళ్ళ పేర్లన్నీ బయట సొసైటీ కోసం మాత్రమే. కోర్ట్‌లో ముందుగా వచ్చిన టైమ్‌నిబట్టీ లేదా ఆటలో వాళ్ళ నైపుణ్యాన్నిబట్టీ అక్కడంతా నంబర్లతోనే పిలుచుకుంటారు. ఆ రెండు గంటలు వాళ్ళు 
కులమతాలకతీతం, హోదాలకతీతం. కేవలం ఆట మాత్రమేకాక, వారానికోసారి కలిసి టిఫిన్లు చెయ్యటం, 
ఏదో ఓ ఓల్డేజ్‌ హోమ్‌కి వెళ్ళటం, 
అనాథాశ్రమానికి పాతబట్టలివ్వటం, లేదా ఓ వారం వీధి కుక్కలకి అన్నం పెట్టటం, అలాగే ప్రతీ ఆరు నెలలకోసారి ఓ పిక్నిక్‌కి వెళ్ళటం లాంటి కార్యక్రమాలతో వాళ్ళంతా 
ఓ ఫ్యామిలీలా మసలుతారు. ఎవరింట్లో 
ఏ కార్యక్రమమైనా అందరూ హాజరవుతారు. తలో చెయ్యి వేస్తారు. ప్రతిరోజూ ఆ రెండు గంటలు వాళ్ళు సర్వం మర్చిపోయి చిన్నపిల్లలైపోతారు. రోజూ చెమట చిందిస్తారు. శరీరమూ మనసూ కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండడానికి వాళ్ళకదో 
చక్కటి కాలక్షేపం. దీనివల్ల ఇంట్లో 
కూడా చిన్నచిన్న విషయాలకి కీచులాటలు తగ్గాయని వాళ్ళ భార్యల రిపోర్ట్‌. బహుశా అందుకే ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా ఏ సమస్యలున్నా 
కుంగిపోరు. ఎప్పుడూ అంతే హుషారుగా ఉంటారు. 
ఇక వీళ్ళ వ్యక్తిగత విషయానికొస్తే మిగతావాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోడానికేం లేకపోయినా, రామ్మూర్తి మాత్రం చాలా స్పెషల్‌. బహుశా టీచర్‌గా చేసి రిటైర్‌ 
అవ్వటంవల్లనేమో అరవై ఏళ్ళు దాటినా, 
ఏ పనైనా చాలా శ్రద్ధగా చెయ్యడం అలవాటు. పిక్నిక్‌లో ఇతను చేసే నారింజకాయ పులిహోర కావొచ్చు, పార్టీలో చేసే డాన్స్‌ కావొచ్చు, రోజూ ఆట కావొచ్చు... మిగతావాళ్ళు క్యాజువల్‌గా తీసుకున్నా, ఇతను మాత్రం ఆట కూడా చాలా శ్రద్ధగా, గెలుపే లక్ష్యంగా ఆడతాడు. పంక్చువాలిటీ మెయిన్‌టెయిన్‌ చేస్తాడు. విష్ణు ఇతని అన్నకొడుకు. అన్న చిన్నప్పుడే చనిపోతే, ఇతనే విష్ణు 

ఏరా, నాకే లెక్కలుగట్టి డబ్బిచ్చేంత పెద్దవాడివైపోయావా ఈ ఇరవై రోజుల్లో? 
అంటే ఈ ఏభై అడుగులు నేను నీకు అమ్ముకోవాలా? 
నాకు చెప్పకుండా, నేను లేనప్పుడు నువ్వీపని చెయ్యడం తప్పంటున్నాను. అది తెలుసుకో.

బాగోగులు చూశాడు. విష్ణుకి రామ్మూర్తి అంటే చాలా గౌరవం. రామ్మూర్తికి కూడా విష్ణు అంటే చాలా అభిమానం. తన సొంత కొడుకులానే చూసుకుంటాడు. అందులోనూ విష్ణు బ్యాడ్మింటన్‌ బాగా ఆడతాడు. అందుకే అతనంటే మరింత అభిమానం. ఆస్తి 
పంపకాల్లో మాత్రం చాలా నిక్కచ్చి... అది వేరే విషయం. రామ్మూర్తి ఇంటి పక్కనే విష్ణు అద్దెకి ఉంటున్నాడు. అదే వీధిలో వాళ్ళకో స్థలం ఉంది. విష్ణూ, రామ్మూర్తిగారి అబ్బాయీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే 
కట్టుకోవాలని వాళ్ళ ప్లాన్‌. అయితే రామ్మూర్తి కొడుకు అమెరికాలో ఉండటంతో అతనికి తొందరలేదు. విష్ణు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వీలైనంత తొందరలో సొంతిల్లు 
కట్టుకోవాలని అతని కోరిక.

*    *

‘‘బాబాయ్‌, రండి... ఎప్పుడొచ్చారు? ప్రయాణం బాగా జరిగిందా? పిన్ని ఎలా ఉంది, ఫోన్‌ చేస్తే నేను స్టేషన్‌కి వచ్చేవాడిని కదా’’ అన్నాడు సైట్‌లో ఫౌండేషన్‌ వర్క్‌ చేయిస్తున్న విష్ణు- అప్పుడే అక్కడికొచ్చిన రామ్మూర్తిని చూసి. 
‘‘నేను నిన్నే వచ్చాను. అది సరే, కన్‌స్ట్రక్షన్‌ వర్క్‌ ఎప్పుడు మొదలెట్టారు? నాకు ఒక్క మాటైనా చెప్పలేదు. ఏం అంత అర్జంటుగా మొదలెట్టవలసిన అవసరం ఏమిటట?’’ అన్నాడు రామ్మూర్తి విసురుగా. 
‘‘ఓ అదా బాబాయ్‌, అనుకోకుండా 
మా మావయ్యగారికి ఏవో ఎరియర్స్‌ 
వచ్చాయట. అవి అనితకి ఇచ్చారు. ఇప్పుడు తప్పితే దగ్గరలో ముహూర్తాలు కూడా లేవట. మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపే స్టార్ట్‌ చెయ్యాలని మొదలుపెట్టాం. మీకు రెండు మూడుసార్లు ఫోన్‌ కూడా చేశాను. మీరు బహుశా ఏ గుళ్ళోనో ఉండుంటారు. అయినా ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకుని మూడు నెలలైంది. మీరూ చూశారు కదా. ప్రస్తుతం ఫౌండేషన్‌ మాత్రమే అయింది. మిగతా పనంతా మీరే దగ్గరుండి జరిపించాలి బాబాయ్‌’’ అన్నాడు విష్ణు అక్కడున్న కుర్చీ ముందుకి జరిపి కూర్చోమన్నట్టుగా. 
‘‘నీ స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకోవడం 
నీ ఇష్టం. కానీ నేను లేకుండా సరిహద్దులు నిర్ణయించడం కరెక్ట్‌ కాదు. నిన్ననే నావైపు నుంచి కొలిచి చూశాను. నువ్వు ఒక అడుగు నా జాగాలోకి వచ్చావు. అది తప్పు’’ అన్నాడు రామ్మూర్తి కోపంగా కుర్చీలో 
కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటూ. 
‘‘బాబాయ్‌, నేను తూర్పు వైపు నుంచి కొలిచే చూశాను. అంతా కరెక్ట్‌గానే ఉంది. అలాని మీరు తప్పని నా ఉద్దేశం కాదు. బహుశా మీ స్థలంలో పడమరవైపు ఓ అడుగు తగ్గిందేమో. అయినా మనమధ్య ఓ అడుగు అటూ ఇటూ అయితేనేం బాబాయ్‌. మీరు ఎలా అంటే అలాగే. మీరు ఏమీ అనుకోనంటే దానికి లెక్కగట్టి చెల్లించేస్తాను’’ అన్నాడు విష్ణు కొంచెం మొహమాటంగా. 
‘‘ఏరా, నాకే లెక్కలుగట్టి డబ్బిచ్చేంత 
పెద్దవాడివైపోయావా ఈ ఇరవై రోజుల్లో? అంటే ఈ ఏభై అడుగులు నేను నీకు 
అమ్ముకోవాలా? నాకు చెప్పకుండా, నేను 
లేనప్పుడు నువ్వీపని చెయ్యడం తప్పంటున్నాను. అది తెలుసుకో’’ అని విసురుగా 
లేచి వెళ్ళిపోయాడు రామ్మూర్తి. 
ఆ తర్వాత విష్ణూ, అతని భార్యా రెండు మూడుసార్లు వెళ్ళి కన్విన్స్‌ చెయ్యడానికి ప్రయత్నం చేసినా రామ్మూర్తి వినలేదు. 
ఇద్దరిమధ్యా మాటలు ఆగిపోయాయి. ఇళ్ళమధ్య రాకపోకలు ఆగిపోయాయి. విష్ణుతో ఆడటం ఇష్టంలేక రామ్మూర్తి, తనకెంతో 
ఇష్టమైన ఆటకి కూడా వెళ్ళటం మానేశాడు. దాంతో అతనికి బీపీతోపాటు షుగర్‌ కూడా పెరిగిపోయింది. ఓరోజు బాగా నీరసంగా ఉండటంతో ఫ్యామిలీ డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాడు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ బాగా పెరిగిపోయాయని డోసు పెంచి, ఆటకి వెళ్ళటంలేదన్న విషయం తెలుసుకుని దెబ్బలాడాడు. 
‘‘రామ్మూర్తిగారూ, ఇన్నాళ్ళూ మీరు షుగర్‌ కంట్రోల్‌లో ఉంచగలిగారూ అంటే... అది మీరుచేసే ఫిజికల్‌ ఆక్టివిటీవల్లే. అది మానేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. మీరు ఇలాగే ఉంటే ఇంకో ఆరు నెలల్లో ఇన్సులిన్‌ చేసుకోవలసి వస్తుంది. అంచేత నామాట విని, రేపటి నుంచి మళ్ళీ ఆటకి వెళ్ళండి’’ అంటూ నచ్చచెప్పాడు.

   *  *  *

‘‘ఆ రామ్మూర్తిగారూ... రండి, చాలా రోజులకి వచ్చారు. మేం ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదు. ఆఖరికి డాక్టర్‌గారు చెబితే వచ్చారు. ఇప్పుడు మీ హెల్త్‌ ఎలా ఉంది? అయినా ఆటకి వచ్చారుగా, మళ్ళీ పాతికేళ్ళ కుర్రాడైపోతారు చూస్తూ ఉండండి’’ అంటూ అందరూ కోర్ట్‌లో ఆ మర్నాడు ఉదయం వచ్చిన రామ్మూర్తిని చుట్టుముట్టేశారు. 
వాళ్ళకి దూరంగా కోర్టులో విష్ణు ఒక్కడూ రాకెట్‌ పట్టుకుని నించున్నాడు. అతనికి తెలుసు- వెళ్ళి పలకరించినా బాబాయ్‌ 
తనతో మాట్లాడడని. 
‘‘రామ్మూర్తిగారూ, ఎప్పటిలాగే 
మీ అబ్బాయి టీమ్‌లోకి వెళ్ళండి’’ అన్నాడు చౌదరి నవ్వుతూ. విష్ణు ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు- ఆయన వస్తాడేమోనని. రామ్మూర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి ఎదురు టీమ్‌లో ఉన్న జాఫర్‌తో జత కలిశాడు. అంతే, వెంటనే నంబర్‌ సెవెన్‌ శర్మ పరిగెత్తుకుని వెళ్ళి విష్ణు టీమ్‌లో చేరాడు. విష్ణు కొద్దిగా చిన్నబుచ్చుకుని, తిరిగి మామూలుగా ఆటలో పడిపోయాడు. గేమ్‌ మంచి రసవత్తరంగా నడుస్తోంది. జాఫర్‌ కూడా మంచి ప్లేయరే. శర్మ కొద్దిగా వీక్‌ ప్లేయర్‌ కావడం, దానికితోడు అవతల రామ్మూర్తి విష్ణు మీద కోపంతో బాగా పట్టుదలగా ఆడటంతో మ్యాచ్‌ నువ్వా నేనా అన్నట్టు నడుస్తోంది. గట్టుమీద కూర్చున్నవాళ్ళు కూడా రెండు టీమ్‌లుగా విడిపోయి సపోర్ట్‌ చేస్తున్నారు. చివరికి జాఫర్‌ టీమ్‌ స్కోర్‌ గేమ్‌బాల్‌... విష్ణు టీమ్‌ స్కోర్‌ ఓ బాల్‌... రామ్మూర్తి సర్వీస్‌ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఒక్క పాయింట్‌ వస్తే గెలుపు తనదే. అతనికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అతను ప్రతీ మ్యాచ్‌నీ చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. మొట్టమొదటిసారి నంబర్‌ వన్‌ ప్లేయర్‌కి ఆపోజిట్‌గా ఆడుతున్నాడు. పైగా గేమ్‌ పాయింట్‌. అవతల సర్వీస్‌ ఫేస్‌ చెయ్యడానికి శర్మ రెడీ అవుతున్నాడు. అతను చాలా 
టెన్షన్‌గా ఉన్నాడు. మ్యాచ్‌ పోతే విష్ణు మొట్టమొదటిసారి తనవల్ల ఓడిపోయినట్టవుతుంది. పైగా విష్ణుకీ అతని బాబాయ్‌కీ మధ్య ఏదో కోల్డ్‌వార్‌ నడుస్తోందని అందరికి చూచాయగా తెలుసు. రామ్మూర్తి సర్వీస్‌ కూడా చాలా షార్ప్‌గా ఉంటుంది. కాక్‌ మరీ నెట్‌ని ఆనుకుని వస్తుంది. పైనుంచి షాట్‌ కొట్టడానికో, ప్లేస్‌ వెయ్యడానికో కుదరదు. కిందనుంచి లిఫ్ట్‌ చేయవలసిందే. అది జాఫర్‌ గనక షాట్‌ కొడితే తను డిఫెన్స్‌లో వీక్‌. ఇలా ఆలోచిస్తూ రెడీ అవ్వగానే రామ్మూర్తి లెఫ్ట్‌హ్యాండ్‌ సర్వీస్‌ చేశాడు. శర్మ బలమంతా ఉపయోగించి కాక్‌ని ఎదురు కోర్ట్‌లో బేస్‌లైన్‌ వరకూ పంపాడు. అవతల ఉన్న జాఫర్‌ కాక్‌ని అంతకన్నా బలంగా కొట్టినట్టు నటించి, విష్ణుకి అందకుండా ఉండాలని ఆఖరి నిమిషంలో నెమ్మదిగా నెట్‌కి ఓ అడుగు అవతలపడేలా డ్రాప్‌ వేశాడు. అయితే ఆఖరి నిమిషంలో స్పీడ్‌ కంట్రోల్‌ చెయ్యడంలో కొంచెం విఫలం అయ్యి, ఆ కాక్‌ నెట్‌ దగ్గర కాకుండా వెళ్ళి అవతల ఫోర్‌ కోర్ట్‌లో గాల్లోకి లేచింది. 
అప్పటికే కోర్ట్‌ సెంటర్‌కి వచ్చి రెడీగా ఉన్న విష్ణుకి ‘నెట్‌ కిల్‌’ చెయ్యడానికి చాలా అనువుగా ఉండటంతో శర్మతో సహా అక్కడున్న అందరూ ‘‘విష్ణూ, షాట్‌ కొట్టు’’ అని గట్టిగా అరుస్తున్నారు. జాఫర్‌కీ రామ్మూర్తికీ అర్థం అయిపోయింది. విష్ణు కొట్టబోయే స్మాష్‌ ఎంత గట్టిగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అది తాము డిఫెండ్‌ చెయ్యలేమనీ తెలుసు. సర్వీస్‌ డౌన్‌ అయ్యి, వాళ్ళ చేతికి సర్వీస్‌ వెళితే మ్యాచ్‌ అయిపోయినట్టే. అందరూ మ్యాచ్‌ విష్ణు టీమ్‌ పక్షాన మారబోతోందని ఫిక్స్‌ అయిపోయిన ఆ క్షణం జరిగిందా సంఘటన. విష్ణు నెట్‌ కిల్‌ చెయ్యకుండా డ్రాప్‌ వెయ్యడానికి ప్రయత్నించడం, 
ఆ కాక్‌ నెట్‌ వరకు కూడా వెళ్ళకుండా 

ఒరేయ్‌ విష్ణూ, నేనన్న మాటలేం పట్టించుకోకు. ఏదో పెద్దవాణ్ణి, కొంచెం చాదస్తం ఎక్కువ. 
ఈ వర్షాలు తగ్గగానే, ఇంటిపని నేనే దగ్గరుండి పూర్తిచేస్తా. నీకింకా ఏదైనా 
డబ్బు అవసరం ఉంటే మొహమాటపడకుండా చెప్పు... నేను సర్దుతాను.

విష్ణు కోర్ట్‌లోనే పడిపోవడం, జాఫర్‌ టీమ్‌ గేమ్‌ గెలవటం జరిగిపోయింది. జరిగింది అర్థం అవటానికి అందరికీ టైమ్‌ పట్టేలోపు, రామ్మూర్తి ఒక్కసారిగా చిన్నపిల్లాడైపోయి ‘యాహూ’ అంటూ జాఫర్‌ని గట్టిగా 
కౌగిలించుకుని గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పాడు. అంతటితో ఆగక, కోర్ట్‌ బయటకి వచ్చి అందరితో గట్టిగా చెప్పాడు. 
‘‘రేపటి నుంచి ఇక నా టర్న్‌. 
చూసుకోండి’’ అంటూ అదే ఆనందంతో బ్యాట్‌ సర్దేసి ఇంటికి వెళ్ళిపోయాడు. 
ఇంకో రెండు గేములయ్యాక అందరూ వెళ్ళిపోయారు. 
చౌదరి, విష్ణు కూడా నెట్‌ విప్పి, బ్యాగులు సర్ది బయలుదేరబోతూ ఉండగా చౌదరిగారు అడిగారు విష్ణుని ‘‘అదేంటి విష్ణూ అలా చేశావు. ఈ మ్యాచ్‌ నువ్వే గెలుస్తావనుకున్నాను. ఆఖర్లో అంత క్యాజువల్‌గా 
ఆడావేంటి? మీ బాబాయ్‌ చూడు... 
గెలుపుని ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో. నాకెందుకో నువ్వు కావాలనే ఓడిపోయినట్టనిపించింది’’ అన్నారు అనుమానంగా. 
దానికి విష్ణు నవ్వుతూ ‘‘సర్‌, మన 
లక్ష్యం ఎదుటివాడి ఓటమి కాదు, మనందరి కూటమి. మనకిదో ఆరోగ్యకరమైన కాలక్షేపం. మా బాబాయ్‌కి గెలుపు ఓ బోనస్‌. 
నాకు ఆయన సంతోషం బోనస్‌. అయినా 
మనమంతా ఒక్కటే అయినప్పుడు ఒక్క పాయింట్‌లో ఎవరు గెలిస్తే ఏముంది సర్‌’’ అన్నాడు బ్యాగ్‌ వెనకాల తగిలించుకుని
బండి స్టార్ట్‌ చేస్తూ.

*   *  *

ఆ మర్నాడు వర్షం పడటంతో ఆట 
జరగœలేదు. వాట్సాప్‌లో మెసేజ్‌ చూసుకుని అందరూ ఇళ్ళ దగ్గరే ఉండిపోయారు. విష్ణు ఆఫీసుకి వెళ్ళడానికి తయారవుతూ ఉంటే కాలింగ్‌బెల్‌ మోగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా వర్షంలో గొడుగుతో బాబాయ్‌. 
‘‘రండి బాబాయ్‌, వర్షంలో వచ్చారా... ఫోన్‌ చేస్తే నేనే వచ్చేవాడిని కదా’’ అంటూ లోపలికి ఆహ్వానించాడు సంతోషంగా. 
కిచెన్‌లో ఉన్న భార్యని కాఫీ తెమ్మనిపురమాయించాడు. 
‘‘ఇంకేంటి బాబాయ్‌ సంగతులు... పిన్ని ఎలా ఉంది... తమ్ముడు స్కైప్‌లోకి 
వస్తున్నాడా?’’ అంటూ అడిగిన ప్రశ్నలన్నిటికీ ‘ఆ ఆ’ అంటూ పొడిపొడిగా సమాధానం చెప్పి, కాఫీ తాగి కప్పు టేబుల్‌ మీద పెడుతూ ‘‘పొద్దున చౌదరి ఫోన్‌ చేశాడ్రా’’ అన్నాడు రామ్మూర్తి నెమ్మదిగా. కాసేపాగి మళ్ళీ తనే ‘‘ఒరేయ్‌ విష్ణూ, నేనన్న మాటలేం పట్టించుకోకు. ఏదో పెద్దవాణ్ణి, కొంచెం చాదస్తం ఎక్కువ. ఈ వర్షాలు తగ్గగానే, ఇంటిపని నేనే దగ్గరుండి పూర్తిచేయిస్తా. అన్నట్టు చౌదరికి ఎవరో బ్యాంకు మేనేజరు తెలుసట. అతని దగ్గరకి తీసుకెళ్తానన్నాడు. కొంచెం లోను ఎక్కువ వచ్చేలా చూస్తాడట. అదికాక నీకింకా ఏదైనా డబ్బు అవసరం ఉంటే మొహమాటపడకుండా చెప్పు... నేను 
సర్దుతాను. మరి నేను వస్తాను, కూరలకి వెళ్ళాలి. రేపు మామూలుగా అయిదున్నరకల్లా ఆటకి వచ్చేయ్‌’’ అంటూ విష్ణు భుజం తట్టి లేచి బయలుదేరాడు రామ్మూర్తి.

*    *

‘‘రెడీ గేమ్‌ పాయింట్‌- నైన్‌’’ అంటూ సర్వీస్‌ చేశాడు రామ్మూర్తి. కాక్‌ గాల్లో ఫ్లోట్‌ అవుతూ రిటర్న్‌ వచ్చింది. విష్ణు బలంగా కొట్టిన స్మాష్‌ అవతలి కోర్ట్‌లో నేలని బలంగా తాకే వరకూ ఎవరికీ అసలు కనబడనేలేదు. 
‘‘శబాష్‌ రా విష్ణూ, గేమ్‌ ఓవర్‌’’ అంటూ గాల్లోకి ఎగిరి, విష్ణుని కౌగిలించుకుని ఆనందంగా కోర్ట్‌ బయటకి వచ్చాడు రామ్మూర్తి. 
ఒక అడుగు, ఒక గెలుపు, ఒక మాట- వీటన్నిటినీ మించి ఒకటుంది...‘ఒకరికొకరు’.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు