close


ఆధ్యాత్మికం

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం..!  

తిరువీధులు గోవిందనామస్మరణతో మారుమోగుతున్న వేళ... అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందుచేస్తున్న వేళ... దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్నవేళ... భూలోకమంతా పండగవాతావరణాన్ని సంతరించుకున్న వేళ... జరగనున్న తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే, ప్రతి సేవా వైభవోపేతమే. (అక్టోబరు 10 నుంచి ప్రారంభం) 
తిరుమలేశుడి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల సందడి అంబరాన్ని తాకుతుందంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మదేవుడే భక్తుడిగామారి 
శ్రీనివాసుడికి మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. సృష్టికారకుడే స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో వీటికి బ్రహ్మోత్సవాలని పేరు. మరో కథనం ప్రకారం - నవబ్రహ్మలు తొమ్మిది రోజుల పాటు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ ఎలాంటి సంబంధంలేదనీ మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అంటారనీ ఇంకొందరి భావన. 
ప్రతిరోజూ ప్రత్యేకమే..! 
తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ ఉత్సవాలకైనా ప్రారంభించే రోజును తిథివారనక్షత్ర యుక్తంగా నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా బ్రహ్మోత్సవాల్లో చిట్టచివరి ఘట్టమైన చక్రస్నానానికి ముందుగా ముహూర్తం నిర్ణయించి, దానికి అనుగుణంగా మొదటి ఎనిమిది రోజులూ వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. సాధారణంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఆలయ ధ్వజస్తంభం మీద గరుడకేతాన్ని ఎగరవేయడమే ధ్వజారోహణం. ఆరోజు రాత్రి నుంచీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వివిధ రూపాల్లో వివిధ వాహనాలను అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతాడు. అయితే కొన్ని వాహనాల్లో స్వామి ఒక్కడే తరలివస్తాడు. మరికొన్నింటిలో దేవేరులతో కలిసి అనుగ్రహిస్తాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవిందుడికి ఉదయం, సాయంత్రం రెండు పూటలా వాహనసేవలు జరుగుతాయి. మొదటిరోజు రాత్రి పెదశేషవాహనం; రెండోరోజు చినశేష, హంసవాహనాలూ; మూడోరోజు సింహవాహనం, ముత్యాలపందిరీ; నాలుగోరోజు కల్పవృక్షం, సర్వభూపాలవాహనం; ఐదోరోజు మోహినీ అవతారం, గరుడవాహనం; ఆరోరోజు హనుమంత, గజవాహనాలూ; ఏడోరోజు సూర్య, చంద్రప్రభవాహనాలూ; 8వరోజు రథ, అశ్వవాహనాలమీద స్వామి దర్శనమిస్తాడు. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన తొమ్మిదోరోజు స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు. దీంతో ఈ ఉత్సవాలు మంగళపూర్వకంగా పరిసమాప్తమవుతాయి.

 

సేవకు వేళాయెరా..!

తిరుమలలో కొలువైన శ్రీనివాసుడి లిప్తపాటు దర్శనం కోసం క్యూకాంప్లెక్సుల్లో గంటలకొద్దీ ఒక్కోసారి రోజుల తరబడి వేచి ఉండే భక్తులు కోకొల్లలు. లక్షల సంఖ్యలో తరలివచ్చే శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అడుగడుగునా సేవలందించేందుకు తిరుమలతిరుపతి దేవస్థానం ‘శ్రీవారి సేవ’ పేరుతో ఒక వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశం నలుమూలలా ఉన్న భక్తులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. మానవసేవే మాధవ సేవ అన్న పెద్దలమాటకు సరైన అర్థాన్ని తెలుపుతూ, స్వామి సేవలో కొద్దికాలమైనా గడిపామన్న తృప్తినిచ్చే ఈ కార్యక్రమానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. 2001లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ దాదాపు ఐదు లక్షల మంది భాగస్వాములయ్యారు. లడ్డూ వితరణ కౌంటర్లను పూర్తిగా సేవకులే నిర్వహించడం గమనార్హం. 
దరఖాస్తు ఇలా...  
శ్రీనివాసుడి సేవలో భాగం పంచుకోవాలనుకునేవారు - పుట్టిన తేదీ, ఫొటో, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ లేదా భారతప్రభుత్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డు వివరాలను తెలుపుతూ శ్రీవారి సేవాపోర్టల్‌ (srivariseva.tirumala.org)లో దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న మూడునెలల తర్వాత సేవకు అవకాశం లభిస్తుంది. ఏయే తేదీల్లో సేవచేయాలో మన సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. దానిప్రకారం సేవ ప్రారంభానికి ముందురోజే శ్రీవారి సేవాసదన్‌ భవనానికి చేరుకోవాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని అక్కడి కౌంటర్‌లో ఇస్తే సేవచేసే సమయంలో ధరించాల్సిన గుర్తింపు కార్డుతోపాటు, ‘శ్రీవారి సేవకులు’ అని ముద్రించి ఉన్న వస్త్రాన్ని కూడా అందజేస్తారు. సేవలు పూర్తయిన తర్వాత వీటిని తిరిగి కౌంటర్‌లో ఇచ్చేయాలి. ఒకసారి సేవలో పాల్గొన్నవారు మూడునెలల వరకూ మరే ఇతర సేవల్లో కొనసాగడానికి అవకాశం ఉండదు.  
ఒకవేళ ఏదైనా కారణం వల్ల అప్లికేషన్‌ రద్దు చేసుకోవాలనుకుంటే పోర్టల్లో వివరాలను నిక్షిప్తంచేసి రద్దు చేసుకోవచ్చు.

- కె.అమర్‌కుమార్‌, ఈనాడు, హైదరాబాద్‌  

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు