close
BETA SITE

నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ? 

ముందుకొచ్చిన ప్రభుత్వం 
అధ్యయనానికి కమిటీ ఏర్పాటు 
రుణ పరిష్కార ప్రణాళిక సమర్పణకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి 
దివాలా పరిష్కార ప్రక్రియ గడువు పెంపు 
ఈనాడు - హైదరాబాద్‌ 

ష్టాలను భరించలేక వ్యవస్థాపకులు చేతులెత్తేయగా మూసివేత దిశగా అడుగులు పడుతున్న నిజాం దక్కన్‌ షుగర్స్‌ పునరుద్ధరణకు ప్రయత్నిస్తామంటూ రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా పరిష్కార ప్రక్రియ గడువు జూన్‌ 16తో ముగిసినందున దాన్ని పొడిగించాలంటూ దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. 12 వారాల గడువు కావాలని ప్రభుత్వం కోరగా తిరస్కరించింది. అలాగే ప్రతివాదిగా చేర్చుకోవాలన్న ప్రభుత్వ దరఖాస్తునూ తోసిపుచ్చింది. ఆర్‌పీ ఆర్‌.రామకృష్ణగుప్త దాఖలు చేసిన దరఖాస్తుపై ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులు బిక్కి రవీంద్రబాబు విచారణ చేపట్టి ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

నిజాం షుగర్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించిన నేపథ్యంలో ఆర్‌పీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఆంధ్రాబ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, యూకో, ఐఓబీ బ్యాంకులతో రుణదాతల కమిటీని ఏర్పాటు చేశారు. వీరు కంపెనీ స్వాధీనానికి ప్రకటన జారీ చేశారు. ముంబయికి చెందిన ఫొనిక్స్‌ ఏఆర్‌సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బెంగళూరుకు చెందిన హిందుస్థాన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఆసక్తి కనబరచాయి. వీరికి చక్కెర తయారీలో అనుభవం లేనందున కమిటీ తిరస్కరించింది. అహ్మదాబాద్‌కు చెందిన పాల్కొ రీసైకిల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ముంబయికి చెందిన మైసీఎఫ్‌ఓ, నాగ్‌పూర్‌కు చెందిన ఎక్స్‌వైకెనొ క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లు సమాచారాన్ని కోరగా పంపారు. వాటి నుంచి రుణ పరిష్కార ప్రణాళిక అందలేదు. దీంతో ఆస్తులను అమ్మి అప్పులు తీర్చడానికి మూసివేత(లిక్విడేషన్‌)కు దరఖాస్తు చేయాలంటూ రుణదాతల కమిటీ ఆర్‌పీకి సూచించింది. జూన్‌ 1న ఆర్‌పీ తెలంగాణ పరిశ్రమలశాఖకు లేఖ రాస్తూ 2015నాటి జీవో-28 అమలులో భాగంగా కంపెనీ పునరుద్ధరణకు చేయూతనివ్వాలని కోరారు. దీంతో ప్రభుత్వం పలువురు ప్రభుత్వ, కర్మాగార ఉన్నతాధికారులతో ఓఅధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్‌ 11న ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించడానికి 12 వారాల గడువు కావాలని కోరింది. దివాలా పరిష్కార ప్రక్రియ గడువు ముగియడంతో ప్రభుత్వం ముందుకొచ్చిన నేపథ్యంలో గడువు పొడిగించాలని ఆర్‌పీ కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యవస్థాపకుల నుంచి ఆమోదం లభించింది. వాదనలను పరిగణనలోకి తీసుకున్న సభ్యులు జాతీయ కంపెనీ ట్రైబ్యునల్‌ ప్రధాన బెంచ్‌, సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో దివాలా పరిష్కార ప్రక్రియ గడువును 78 రోజులపాటు పొడిగించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం తరఫున ఎన్‌సీఎల్‌టీలో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, డీవీఏఎస్‌ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈనేపథ్యంలో నిజాం షుగర్స్‌ రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించడానికి ప్రభుత్వానికి అనుమతి లభించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.