close
BETA SITE

అవుటర్‌పై జరభద్రం 

సభ కోసం ఓఆర్‌ఆర్‌పై తాత్కాలిక ర్యాంప్‌లు 
రహదారిపైకి వస్తున్న పశువులు, ద్విచక్రవాహనాలు 

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం గ్రామీణం:  తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు చేరుకునేందుకు బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)పై ఏర్పాటు చేసిన తాత్కాలిక ర్యాంప్‌లను ఇంకా తొలగించలేదు. సభ ముగిసి వాహనాలు తిరిగి వెళ్లిపోయాయి. అయితే ఆ తాత్కాలిక ర్యాంప్‌లను తొలగించకపోవడంతో సర్వీస్‌ రోడ్ల నుంచి వాహనాలు, ద్విచక్రవాహనాలు, పశువులు అవుటర్‌పైకి వచ్చేస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌పై రోజూ సగటున లక్ష పైచిలుకు వాహనాలు దూసుకెళ్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న 19 ఇంటర్‌ఛేంజ్‌ల నుంచే అవుటర్‌పైకి ఎక్కేందుకు, దిగేందుకు ర్యాంప్‌లు ఏర్పాటు చేశారు. అవుటర్‌కు అటూ ఇటూ 316 కి.మీల సర్వీస్‌ రోడ్లను నిర్మించింది. ప్రగతి నివేదన సభకు అవుటర్‌పై నుంచి నేరుగా చేరుకునేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వీస్‌ రోడ్ల నుంచి అవుటర్‌ ప్రధాన మార్గంపైకి ఎక్కేందుకు, దిగేందుకు బొంగుళూరు నుంచి రావిర్యాల వరకు కిలోమీటరుకు ఒకటి చొప్పున మట్టితో తాత్కాలిక ర్యాంప్‌లు నిర్మించారు. ప్రమాదాలు జరగకుండా హెచ్‌ఎండీఏ నిర్మించిన రక్షణ గోడలను కూడా తాత్కాలిక ర్యాంప్‌ల కోసం తొలగించారు. సభకు వచ్చిన వాహనాలు ఆదివారం అర్థరాత్రి వరకు తిరుగుముఖం పట్టాయి.

ముందే చెప్పినా.. 
సభ పూర్తి కాగానే తాత్కాలిక ర్యాంప్‌లను తొలగించి రక్షణ చర్యలను పునరుద్ధరించాలని హెచ్‌ఎండీఏ అధికారులు కార్యక్రమ నిర్వాహకులకు ముందుగానే చెప్పారు. సోమవారం రాత్రి వరకు వీటి తొలగింపు జరగలేదు. సభకు వచ్చిన వాహనాలు వెళ్లిపోగానే పోలీసులు తాత్కాలిక ర్యాంప్‌ల దగ్గర బారికేడ్లను అడ్డుగా పెట్టారు. కాపలా కూడా లేదు. అవుటర్‌ ప్రధాన మార్గంలో హెచ్‌ఎండీఏ పెంచుతున్న మొక్కలను తినేందుకు పశువులు ఈ ర్యాంప్‌ల మీద నుంచి గుంపులు గుంపులుగా అవుటర్‌పైకి వచ్చేస్తున్నాయి. ‘ఔటర్‌ మీద 100 కి.మీ.ల వేగంతో వెళ్తుంటాం. ఈ ర్యాంప్‌ల దగ్గరికి వచ్చేసరికి అకస్మాత్తుగా వాహనాలు, పశువులు ప్రధాన మార్గంపైకి వచ్చేస్తున్నాయి. దీంతో వేగాన్ని అదుపు చేయడం కష్టమవుతోంది’ అని కొందరు వాహనదారులు ‘ఈనాడు’తో చెప్పారు.

ఆ బాధ్యత వారిదే - జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌: సభ పూర్తి కాగానే తాత్కాలిక ర్యాంప్‌లను తొలగించాలని తెరాస నాయకులకు ముందే చెప్పాం. దీనిపై సోమవారం సంబంధిత వ్యక్తులను అప్రమత్తం చేశాం. ప్రస్తుతం బారికేడ్లను అడ్డుగా ఉంచాం. వెంటనే తొలగింపు పనులు పూర్తి చేయిస్తాం.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.