close
BETA SITE

చేతి పంపులు మొరాయిస్తున్నాయ్‌..! 

చిన్నపాటి మరమ్మతులకూ నోచుకోని వైనం 
నిధులు లేవంటూ ఎవరికివారే దాటవేత 
14వ ఆర్థిక సంఘం తెచ్చిన విధానమూ ఓ కారణం 
విలవిల్లాడుతున్న కోటి మంది గ్రామీణులు 
ఈనాడు - హైదరాబాద్‌ 

మొరాయిస్తున్న చేతిపంపుల సంఖ్య తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా పెరిగిపోతోంది. భూగర్భజలం అడుగంటిన చోట చేతిపంపులకు అదనంగా ఒకటి, రెండు గొట్టాలను జతచేసి, మరికొన్నింటికి స్వల్ప మరమ్మతులను చేపట్టగలిగితే ప్రస్తుత వేసవిలో తాగునీటి కష్టాల నుంచి ప్రజలు కొంతవరకు గట్టెక్కగలుగుతారు. ప్రస్తుతానికి మాత్రం చేతిపంపుల బాధ్యత మాదికాదంటే మాది కాదంటూ ఎవరికివారే తప్పించుకొంటున్నారు. జిల్లా, మండల పరిషత్‌లకు వాటాలను తీసివేసి నిధులన్నీ పంచాయతీలకు అందేలా జాతీయ 14వ ఆర్థిక సంఘం తెచ్చిన విధానమూ ఈ పరిస్థితికి కారణమవుతోంది. రక్షిత పథకం నిర్ణీత వేళల్లోనే నీళ్లనిస్తుంది. చేతిపంపు అన్నివేళలా గ్రామస్థుల అవసరాలను తీరుస్తుంది. రాష్ట్రంలో ఏకంగా 2.22కోట్ల మంది గ్రామీణులు 1.72లక్షల చేతి పంపులపై ఆధారపడుతుంటారనేది తాగునీటి శాఖ అంచనా. ప్రస్తుతం 25 శాతం చేతి పంపుల్లో నీళ్లు అడుగంటిపోగా.. మరో 25 శాతం చేతి పంపులు చైన్లు తెగిపోవటం, హేండిల్‌ ఊడిపోవటం వంటి చిన్నపాటి మరమ్మతులతో పనిచేయటంలేదు. అంటే దాదాపు కోటి మంది గ్రామీణ ప్రజానీకం ప్రస్తుతం నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని స్పష్టమవుతోంది.
మచ్చుతునకలివీ.. 
* రాష్ట్రంలోని తండాలు, గూడెంలలో చేతింపుల సమస్య మరీ తీవ్రంగా ఉంది. అదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో 500 చేతిపంపులు ఉండగా వాటిలో 200 ప్రస్తుతం పనిచేయటంలేదు. వీటిలో 60 మరమ్మతులకు గురి కాగా మిగతావి భూగర్భజలం అడుగంటి మొరాయించాయి. 
* 40 ఆదిమతెగ కుటుంబాలు గల ఇంద్రవెల్లిలోని మారుతీగూడలో 15 అడుగుల్లోనే నీళ్లు ఉన్నప్పటికీ చేతిపంపుకు హేండిల్‌ను బిగించకపోవంతో బకెట్‌కు తాడును కట్టి నీళ్లను తోడుకుంటున్నారు. దీనిలో పిల్లలు పడిపోయే ప్రమాదమూ పొంచి ఉంది. 
* కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం కిష్టాపూర్‌లోని చేతిపంపునకు రెండు పైపులను జతచేయగలిగితే పుష్కలంగా నీరు వస్తుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు, భల్లాన్‌పల్లి, కుమ్మెర తదితర గ్రామాల్లో చేతిపంపులు చిన్న పాటి మరమ్మతలకూ నోచుకోవటంలేదు.


మూడేళ్ల క్రితం వరకు ఇలా.. 
చేతిపంపులకు ఏర్పడే మరమ్మతులను మూడేళ్ల క్రితం వరకు మండల పరిషత్‌లు నిర్వహించేవి. అప్పట్లో వాటికి కేంద్రం నుంచి నిధులు అందుతుండేవి. ప్రతి మండలానికి నెలవారీ జీతంపై ప్రత్యేకంగా ఒక మెకానిక్‌ ఉండేవాడు.
ఇప్పుడు విధానం ఎందుకు మారింది? 
జాతీయ 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు వల్ల మండలాలకు కేంద్రం నుంచి నిధులు రావటం నిలిచిపోయాక చేతి పంపుల సమస్య జటిలమయింది. మండల పరిషత్‌లు మెకానిక్‌లను తొలగించాయి. పంచాయతీకి వచ్చే నిధుల్లో 30 శాతం మేర ప్రభుత్వమే విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరుతో వెనక్కి తీసేసుకొంటున్నందున తాము ఇక మరమ్మతులను ఎలా చేపట్టగలమంటూ పంచాయతీలు వాపోతున్నాయి. తాగునీటి శాఖ ద్వారా చేతిపంపులను లోతు చేయటానికంటూ ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ.3.86 కోట్లను కేటాయించటం విశేషం. చేతి పంపులపై శాఖల మధ్య సమన్వయం లేదని, వాటిని పట్టించుకొనేవారే లేకుండా పోయారని ఈ వాదనలన్నింటినీ బట్టి తేటతెల్లమవుతోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.