close
BETA SITE

బీసీ గురుకులాలపై సందిగ్ధం! 

కొత్తగా 119 నెలకొల్పాలన్నది ప్రతిపాదన 
  చాన్నాళ్లుగా దస్త్రానికి లభించని మోక్షం 
  ఎదురుచూపుల్లో బీసీ సంక్షేమశాఖ 

ఈనాడు - హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 119 బీసీ గురుకులాలు నెలకొల్పడంపై సందిగ్ధత నెలకొంది. 2018-19 విద్యాసంవత్సరంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. ఈ దస్త్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉంది. అక్కణ్నుంచి ఆమోదం లభిస్తేనే వీటి ఏర్పాటు సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 
తెలంగాణలో ప్రస్తుతం 142 బీసీ గురుకుల(బాలురకు 69, బాలికలకు 73) పాఠశాలున్నాయి. గత విద్యా సంవత్సరంలో ఏర్పాటైన 119 గురుకులాల్లో ఐదు, ఆరు, ఏడు తరగతులతో రెండేసి సెక్షన్లు ప్రారంభించారు. ఒక్కో పాఠశాలలో 240 మంది వరకు చదువుతున్నారు. నిజానికి వీటిలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశానికి భారీ గిరాకీ ఉంటోంది. పూర్వ నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో అయితే సీట్ల కోసం భారీ పోటీ ఉంది. పాఠశాలల సంఖ్య తక్కువగా, పోటీపడే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండటంతో..విద్యా సంవత్సరం ఆరంభం నుంచే తల్లిదండ్రులు సీట్ల కోసం సంక్షేమభవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. పేదరికం, జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లనున్నందున 150 కి.మీ దూరంలోని ఇతర జిల్లాలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడటం లేదు. ఈ పరిణామాల దృష్ట్యా కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన బీసీ సంక్షేమశాఖ ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నెల క్రితం సంబంధిత దస్త్రం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. జూన్‌ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటం, ఇప్పటి వరకు ప్రతిపాదిత దస్త్రానికి ఆమోదం లభించకపోవడంతో వీటి ఏర్పాటు ఉంటుందా? ఉండదా? అన్న సందిగ్ధం కొనసాగుతోంది.

కార్యాచరణ సిద్ధం 
ఆ దస్త్రానికి ఆమోదం లభించిన పక్షంలో వెంటనే కొత్త గురుకులాలను ప్రారంభించేందుకు బీసీ సంక్షేమశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. భవనాల గుర్తింపునకు సమయం లేనందున  ప్రస్తుతానికి గత ఏడాది ఏర్పాటు చేసిన వాటిలోనే కొత్త పాఠశాలలను సర్దుబాటు చేయాలని భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి కేవలం ఐదో తరగతి ఒకే సెక్షన్‌తో ప్రవేశాలు జరపాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉంది. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే బాలుర పాఠశాల ఉన్నచోట బాలికలకు.. బాలికల పాఠశాల ఉన్న పక్షంలో బాలుర పాఠశాలను మంజూరు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.