close
BETA SITE

చైనా జోరుకు అడ్డు‘వంతెన’! 

సైనిక కదలికలతో తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ సన్నద్ధమవుతోంది. తూర్పు సరిహద్దుల్లోకి వేగంగా బలగాలను తరలించేందుకు ఉద్దేశించిన దేశంలోనే అతిపెద్దదైన రోడ్డు, రైలు వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. అసోంలోని డిబ్రూగఢ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ వరకూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న బోగీబిల్‌ అనే ఈ వంతెనను ఈ ఏడాది చివర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 
భారత్‌, చైనాల నడుమ దాదాపు 4వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అందులో 75 శాతం అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే ఉంది. ఈ రాష్ట్రం వెంబడి ఉన్న సరిహద్దుల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి మౌలిక వసతుల ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున హైవే నిర్మాణం, ఈ నదితోపాటు దిబాంగ్‌, లోహిత్‌, సుబాన్‌సిరి, కామెంగ్‌ వంటి ప్రధాన ఉపనదులపై రోడ్డు, రైలు సంధానతను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. బోగీబిల్‌ వంతెన కూడా ఇందులో భాగమే. ఈ ఏడాది జులై నాటికి దీని సివిల్‌ పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు విద్యుత్‌, సిగ్నల్‌ పనులను సాగిస్తారు.
ప్రయోజనాలు.. 
సంధానత: బోగీబిల్‌ ప్రాజెక్టు వల్ల బ్రహ్మపుత్ర ఉత్తర, దక్షిణ ఒడ్డులకు సంధానత ఏర్పడుతుంది. అసోంలోని తూర్పు ప్రాంతం నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌కు రవాణా మార్గాన్ని కల్పిస్తుంది. రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాలకు ఇది ప్రయోజనం కల్పిస్తుంది. 
‘రక్షణ’కు ఊతం: చైనా సరిహద్దుల్లో మోహరించిన భారత సైనికులకు తేజ్‌పూర్‌ నుంచి సరఫరాలను వేగంగా చేరవేయడానికి వీలు కలుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో బలగాలు, భారీ ఆయుధాలను శరవేగంగా చైనా సమీపంలోకి తరలించవచ్చు. 
రైలు సంధానత: బ్రహ్మపుత్ర ఉత్తర, దక్షిణ ఒడ్డుల్లో ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లను ఈ వంతెన సంధానిస్తుంది. దక్షిణ ఒడ్డులో చాల్కోవా, మోరన్‌హాట్‌ రైల్వేస్టేషన్ల నుంచి రైల్వే లంకె మొదలవుతుంది. రంగియా-ముర్కోంగ్‌సెలెక్‌ సెక్షన్‌లోని సిసిబార్గావ్‌, సిరిపాని స్టేషన్ల వరకూ ఇది సాగుతుంది. 
రోడ్డు లంకె: దక్షిణ ఒడ్డున 29.446 కిలోమీటర్ల ఎన్‌హెచ్‌-37 జాతీయ రహదారి.. ఉత్తర ఒడ్డున ఉన్న ఎన్‌హెచ్‌-52 జాతీయ రహదారితో సంధానమవుతుంది. 
సమయం ఆదా: ప్రస్తుతం రైల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌ చేరుకోవడానికి గువహటి మీదుగా 500 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ప్రయాణం 100 కిలోమీటర్ల కన్నా తక్కువే ఉంటుంది. ప్రస్తుతం దిల్లీ నుంచి డిబ్రూగఢ్‌కు చేరుకోవడానికి 37 గంటలు పడుతోంది. బోగీబిల్‌ వంతెన వల్ల అది 34 గంటలకు తగ్గుతుంది. 
పూర్తి వెల్డింగ్‌ నిర్మాణం: బోగీబిల్‌ నిర్మాణం పూర్తిగా వెల్డింగ్‌తో సాగింది. ఇందులో స్వీడన్‌, డెన్మార్క్‌ల పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.  రివిట్లు బిగించిన అడ్డకమ్మెలతో పోలిస్తే వెల్డెడ్‌ అడ్డకమ్మెల బరువు తక్కువ. 
సవాళ్లు: బ్రహ్మపుత్రలో వరద నీటి కారణంగా నవంబర్‌ నుంచి మార్చి వరకే నిర్మాణ పనులు సాధ్యమయ్యేవి. ఆ కొద్ది నెలల్లోనే భారీ నిర్మాణ సామగ్రిని తరలించాల్సి వచ్చేది. నదిపై తేలియాడే సాధనాలపై అమర్చిన పైపుల ద్వారా కాంక్రీటును పంప్‌ చేయాల్సి వచ్చింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం
ప్రత్యేకతలు.. 
బోగీబిల్‌ ఆసియాలోనే రెండో అతిపెద్ద రైలు-రోడ్డు వంతెన. దేశంలోనే అతిపెద్దది.  
* బ్రహ్మపుత్ర నది జలాలపై 32 మీటర్ల ఎత్తులో ఉంటుంది.  
* ఇందులో పైభాగంలో మూడు వరుసల రోడ్లు ఉంటాయి. కింద.. రెండు రైలు మార్గాలు ఉంటాయి.  
* పొడవు: 4.94 కిలోమీటర్లు 
* సవరించిన అంచనా వ్యయం: రూ.4857 కోట్లు  
* ఈ ప్రాజెక్టుకు 1996లో ఆమోదం లభించింది. 2002లో పనులు ప్రారంభమయ్యాయి. 2007లో నాటి యూపీఏ సర్కారు దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.
చైనా ముందంజ.. 

వాస్తవాధీన రేఖను దాటి చైనా బలగాలు తరచూ భారత భూభాగంలోకి చొరబడుతున్నాయి. పర్వతమయంగా, అత్యంత ప్రతికూలంగా ఉండే ఈ ప్రాంతంలో సైనిక కదలికలకు మెరుగైన మౌలిక వసతులే కీలకం. ఈ విషయంలో కొన్నేళ్ల వరకూ భారత్‌ బాగా వెనకబడిపోయింది. ఆలస్యంగా మేల్కొని రోడ్లు, వంతెనలు, విమాన స్థావరాలు, హెలిపాడ్ల నిర్మాణాలకు నడుం బిగించింది. అయితే సరిహద్దుల్లోని తమ బలగాల పోరాట సన్నద్ధతకు నిత్యం తోడ్పాటును అందించే విషయంలో చైనా చాలా ముందంజలో ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం ఆవల సాంగ్‌పో (బ్రహ్మపుత్ర) నదిపై ఏకంగా 11 వంతెనలను నిర్మించింది. వీటి వల్ల భారత్‌లోకి దురాక్రమణ సాగించడానికి చైనాకు అనేక అవకాశాలు లభించినట్లయింది. టిబెట్‌లోని లాసా నుంచి భారీ రోడ్లతో ఈ వంతెనలను అనుసంధానించారు. ప్రధాన భూభాగం నుంచి టిబెట్‌లోకీ అనుసంధానం ఉంది. ప్రత్యేక రైలు మార్గాలూ వేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.