close
BETA SITE

విహారి ఆడతాడా! 

నెట్స్‌లో తీవ్రంగా సాధన చేసిన తెలుగు కుర్రాడు 
ప్రాక్టీస్‌కు కోహ్లి దూరం 
రెండో టెస్టు రేపటి నుంచే 
ఈనాడు - హైదరాబాద్‌ 

ఇంగ్లాండ్‌ పర్యటనలో అరంగేట్ర టెస్టులోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు గాదె హనుమ విహారి తన కెరీర్‌లో రెండో టెస్టు ఆడేందుకు రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది! శుక్రవారం టీమ్‌ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్‌ చేశాయి. ఉదయం విండీస్‌ జట్టు సాధన చేసుకోగా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోల్ని బట్టి ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోకి కోహ్లి వెళ్లినట్లు తెలిసింది. మిగతా జట్టంతా సాధనలో నిమగ్నమైంది. పుజారా, రాహుల్‌, రహానె, పృథ్వీ షా నెట్స్‌లో చెమటోడ్చారు. వీరితో పాటు విహారి కూడా చాలాసేపు సాధన చేశాడు. విండీస్‌తో తొలి టెస్టుకు ముందు టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌తో ఆడిన చివరి టెస్టులో విహారి ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ (56)తో పాటు మూడు వికెట్ల (3/37)తో మెరిశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు తడబడిన వికెట్‌పై విహారి ఎంతో సంయమనం ప్రదర్శించాడు. ఐతే విండీస్‌తో తొలి టెస్టులో విహారికి అవకాశం లభించలేదు. విహారి నెట్స్‌లో ఎక్కువసేపు సాధన చేయడాన్ని బట్టి అతను ఉప్పల్‌లో ఆడే అవకాశముంటుందా అన్న చర్చ మొదలైంది. తొలి టెస్టులో టీమ్‌ఇండియా సునాయాసంగా నెగ్గిన నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తారా అన్నది సందేహమే. కోహ్లి స్వయంగా విశ్రాంతి తీసుకుంటే తప్ప మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఎవరినీ తప్పించేందుకు ఆస్కారం లేదు. ఒకవేళ విహారి లేదా మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం భారత్‌ ఒక్క పేసర్‌తోనే బరిలో దిగొచ్చు! తొలి టెస్టులో టీమ్‌ఇండియా పేసర్లు షమి, ఉమేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు వేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో వేసింది 6 ఓవర్లే. ఇద్దరూ కలిసి తీసిన వికెట్లు 3. అదీ తొలి ఇన్నింగ్స్‌లోనే. ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు సహకరించే అవకాశాలే ఎక్కువ కాబట్టి ఒక పేసర్‌ను పక్కన పెట్టి అదనపు బ్యాట్స్‌మన్‌కు తుదిజట్టులో చోటిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పైగా విహారి ఆఫ్‌ స్పిన్‌ వేయగలడు. అతను హైదరాబాద్‌లో కెరీర్‌ మొదలుపెట్టి.. ఉప్పల్‌ స్టేడియంలో  వేలకొద్దీ పరుగులు చేశాడు కూడా.

కోచ్‌, కెప్టెన్‌, సెలెక్టర్లతో సీఓఏ భేటీ! 
టీమ్‌ఇండియా తుదిజట్టులో తరుచూ మార్పులు చేస్తుండటం.. ఆటగాళ్లకు, సెలెక్షన్‌ కమిటీకి మధ్య సమాచార లోపంపై బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) దృష్టిసారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బుధవారం టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, టెస్టు.. వన్డే జట్ల వైస్‌ కెప్టెన్‌లు రహానె, రోహిత్‌, కోచ్‌ రవిశాస్త్రి, ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీతో సీఓఏ భేటీ అయినట్లు తెలిసింది. తుది జట్టులో స్థానం కల్పించకపోవడంపై సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి తమకెలాంటి సమాచారం లేదంటూ కరుణ్‌ నాయర్‌, మురళీ విజయ్‌ బహిరంగ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని సీఓఏ చర్చించినట్లు సమాచారం. విదేశాల్లో టీమ్‌ఇండియా స్పిన్నర్లు తడబడుతున్న నేపథ్యంలో స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ ఎంపికనపై చర్చ జరిగినట్లు తెలిసింది.శివరామకృష్ణన్‌ లేదా ఎన్‌సీఏ కోచ్‌ హిర్వాణిల పేర్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని రహానె, పుజారాలను ఇండియా-ఎ జట్టుతో న్యూజిలాండ్‌ పంపించనున్నట్లు తెలిసింది.

‘‘సిరాజ్‌ది తొందరగా నేర్చుకునే తత్వం. అనుభవం తోడైతే సిరాజ్‌ మరింత మెరుగవడం ఖాయం. గత టెస్టులో పృథ్వీ షా అద్భుతంగా ఆడాడు. పథ్వీ సాధించిన పరుగుల కంటే అతని ఆత్మవిశ్వాసం, శరీర భాష అసలు సిసలు ఆటగాడిని తలపించాయి’’ 

- బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
Ad Space
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు