close
BETA SITE

ఎదురులేని జకోవిచ్‌ 

సెమీఫైనల్లో ప్రవేశం 
నిషికోరి, కీస్‌ ముందుకు 
న్యూయార్క్‌ 

వైఫల్యాల బాట వీడి వింబుల్డన్‌  ట్రోఫీతో తిరిగి గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేట  ఆరంభించిన సెర్బియా స్టార్‌ జకోవిచ్‌ జోరు  కొనసాగిస్తున్నాడు. యుఎస్‌ ఓపెన్‌లోనూ టైటిల్‌ దిశగా మరో ముందుకేశాడు. ఫెదరర్‌కు షాకిచ్చిన మిల్‌మాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. నిషికోరి, మాడిసన్‌ కీస్‌ కూడా సెమీస్‌లో అడుగుపెట్టారు.

సూపర్‌ ఫామ్‌లో ఉన్న జకోవిచ్‌ యుఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో ప్రవేశించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జాన్‌ మిల్‌మాన్‌ సంచలనాలకు అతడు తెరదించాడు. ఐతే మిల్‌మాన్‌ ఓడినా.. పోరాటపటిమను ప్రదర్శించాడు. క్వార్టర్‌ఫైనల్లో ఆరో సీడ్‌ జకోవిచ్‌ 6-3, 6-4, 6-4తో వరుస సెట్లలో మిల్‌మాన్‌ను ఓడించాడు. యుఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ చేరడం జకోవిచ్‌కు ఇది వరుసగా 11వసారి కావడం విశేషం. ఐతే గాయం కారణంగా నిరుడు అతడు ఈ టోర్నీలో ఆడలేదు. ఇప్పుడు మిల్‌మాన్‌పై విజయం స్కోర్‌ లైన్‌ చూపిస్తున్నంత తేలిగ్గా రాలేదు. జకోవిచ్‌ దాదాపుగా మూడు గంటలు పోరాడాడు. 20 బ్రేక్‌ పాయింట్లలో నాలుగింటిని మాత్రమే సద్వినియోగం చేయగలిగాడు. మూడో సెట్లో ఓ దశలో 1-3తో వెనుకబడ్డాడు కూడా. తర్వాత పుంజుకున్నాడు. విపరీతమైన వేడి ఉక్కపోత కూడా అతణ్ని బాగా ఇబ్బందిపెట్టింది. 29 ఏళ్ల మిల్‌మాన్‌ ఊహించినదాని కంటే ఎక్కువ సమయమే జకోవిచ్‌ను కోర్టులో ఉంచాడు. నిజానికి జకోవిచ్‌ (53) కంటే తక్కువ అనవసర తప్పిదాలు చేశాడు. కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మ్యాచ్‌లో జకోవిచ్‌ 29 విన్నర్లు కొట్టగా.. మిల్‌మాన్‌ 24 విన్నర్లు సంధించాడు. చెరో నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. జకోవిచ్‌ సెమీఫైనల్లో జపాన్‌ ఆటగాడు నిషికోరితో తలపడతాడు. క్వార్టర్‌ఫైనల్లో నిషికోరి 2-6, 6-4, 7-6 (7/5), 4-6, 6-4తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. నిషికోరి (ఆరు ఏస్‌లు, 29 విన్నర్లు) కన్నా ఎక్కువగా సిలిచ్‌ 19 ఏస్‌లు, 57 విన్నర్లు కొట్టాడు. కానీ 72 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. నిషికోరి 45 అనవసర తప్పిదాలు మాత్రమే చేశాడు. మరో సెమీఫైనల్లో డెల్‌ పొట్రోతో నాదల్‌ తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో మాడిసన్‌ కీస్‌ (అమెరికా) సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 6-4, 6-3తో సురెజ్‌ నవారో (స్పెయిన్‌)ను ఓడించింది. సెమీస్‌లో మాడిసన్‌.. ఒసాకా (జపాన్‌)తో తలపడనుంది.

చొక్కాలు తడిసిపోతున్నాయి 
యుఎస్‌ ఓపెన్‌లో వేడి వాతావరణం.. ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తోంది. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత చెమటలు కక్కిస్తోంది. దీంతో ఆటగాళ్లు ఎప్పటికప్పుడు దుస్తులు మారుస్తూనే ఉన్నారు డెల్‌పోట్రోతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇస్నర్‌ ఏకంగా 11 చొక్కాలు మార్చాడు. జకోవిచ్‌తో జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో మిల్‌మాన్‌దీ దాదాపు అదే పరిస్థితి. చెమటతో వేసుకున్న దుస్తులు పూర్తిగా తడిసిముద్దవ్వడంతో ఛైర్‌ అంపైర్‌ అనుమతి తీసుకొని లాకర్‌ రూమ్‌కు వెళ్లి మరీ మార్చుకున్నాడు. మొత్తానికి ఈసారి వేడి, ఉక్కపోత ఆటగాళ్లను విలవిల్లాడిస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.